వార్ వన్ సైడే..
సాక్షిప్రతినిధి, గుంటూరు :జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్‌గా సాగింది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో జెండా ఎత్తేయగా టీడీపీ సైతం పోలింగ్‌కు ముందే చేతులెత్తేసింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని 17 అసెంబ్లీ, 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్నింటా దాదాపు విజయదుంధుబి మోగించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ నాయకులు ప్రవేటు ఏజెన్సీల ద్వారా చేయించిన సర్వేలో సైతం జిల్లాలో అన్ని సీట్లు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోనున్నట్లు ముందే గుర్తించారు. దీంతో ఓటర్లను అదిరించి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి ఓట్లు సాధించుకోజూసిన ఆ పార్టీ నేతల ఆశలు గల్లంతయ్యాయి.
అంతర్గత కుమ్ములాటలు
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన రోజు నుంచే టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో టికెట్ల కేటాయింపులో సామాజిక సమతుల్యం పాటించకపోవడం, కాపులకు చివరి నిమిషంలో టికెట్టు కేటాయించడంతో పాటు 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను నామినేషన్ల ఆఖరు సమయంలో ప్రకటించారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. టికెట్లు కేటాయించినా ఇద్దరు అభ్యర్థులు పోటీ చేయలేమంటూ చేతులెత్తేయడంతోనే జిల్లాలో ఆ పార్టీ పనైపోయిందన్న ప్రచారం జరిగింది. దింపుడు కళ్లం ఆశలతో ఓటర్లకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వారు మాత్రం లొంగలేదు. అలాగే మోడీ, చంద్రబాబు బహిరంగ సభ సైతం విజయవంతం కాలేదు.
జననేతకు జేజేలు..
వైఎస్సార్ సీపీకి జల్లా ప్రజలు తొలి నుంచి అండగా నిలిచారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ప్రజలు జగన్ నాయకత్వాన్ని బలపరిచారు. సార్వత్రిక ఎన్నికల్లో వారి ప్రేమ, అభిమానాన్ని ఓట్ల రూపంలో కురిపించారు. నోటిఫికేషన్‌కు మందే అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లారు. అలాగే అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రతో పాటు జిల్లాలో నిర్వహించిన రైతుదీక్ష, వరదల్లో నష్టపోయిన సమయంలో రైతుపరామర్శ యాత్రలతో ప్రజలకు అండగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి షర్మిల చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించింది. విశ్వసనీయతకు, కుట్రలకు మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు జననేతకే జై కొట్టారు.
ఫలించని కుట్రలు.: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిచేందుకు టీడీపీ చేయని కుట్రంటూ లేదు. జై సమైక్యాంధ్ర పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులను గంపగుత్తగా డబ్బుతో కొనుగోలు చేసి పోటీ నుంచి విరమింపచేశారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌పార్టీతో కుమ్మక్కు రాజకీయాలు నెరిపారు. అయినా వారి ఆశలు ఫలించలేదు. దీంతో పోలింగ్ రోజైన బుధవారం ఉదయం నుంచి జరిగిన ఓటింగ్ సరళిని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు నరసరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, గురజాల, గుంటూరు ఈస్ట్, తెనాలి, మంగళగిరి, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల పరిధిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. అయినా ఓటర్లు ఏమాత్రం వెనుకాడలేదు. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవడంతో రాష్ట్రంలోనే 83 శాతం పోలింగ్‌తో ప్రథమస్థానంలో నిలిచింది. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా మహిళలు సైతం పెద్ద ఎత్తున క్యూలైన్లలో గంటల కొద్ది నిల్చొని ఓటు వేశారు. వైఎస్సార్ సీపీకి ప్రజలు పట్టం కట్టారు.