డీఎల్ డీల్ ఏమిటి?
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి ఎక్కడున్నారు? ఎవరితో ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎన్నికల వేళ ఎంతో బిజీబిజీగా ఉండాల్సిన డీఎల్ ఏమయ్యారు?
ఆయన కాంగ్రెస్ ని వదిలేశారు. టీడీపీలో చేరారు. పార్టీ తీర్థం పుచ్చుకోకుండానే టీడీపీ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించేశారు. డీ ఎల్ అంతటి వాడు మద్దతు పలికితే ఇంకేముందని టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఎగిరి గంతేశారు. సరిగ్గా ఎన్నికల వేడి రాజుకునే సరికి డీఎల్ 'చలో అమెరికా' అంటున్నారు. ఒక్క దెబ్బతో అటు కాంగ్రెస్ ని, ఇటు టీడీపీని గిల్లి జెల్ల కొట్టేశారు. టీడీపీని వాడుకుని వదిలేయడంతో ఆ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు తల పట్టుకుంటున్నారు.
అసలు డీఎల్ రాజకీయ డీల్ ఏమిటన్నది ఇప్పుడు టీడీపీ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్న. టీడీపీలో చేరకుండానే చేరి, ఉండకుండానే ఉండి, తన అనుచరులకు వీలైనన్ని జడ్ పీ టీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ సీట్లు ఇప్పించుకుని, వారికి ఓటేయించుకున్నారు. ఒక వేళ స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులెవరైనా గెలిస్తే వారంతా డీఎల్ మనుషులే. వారంతా పేరుకే తెలుగుదేశం పార్టీ సభ్యులు. ఆ తరువాత టీడీపీతో తనకు పని లేదన్నట్లుగా చక్కగా హ్యాండిచ్చేశారు. ఇప్పుడు ఎంఎల్ఏ, ఎంపీ ఎలక్షన్ల వేడి మొదలయ్యే సరికి సమ్మర్ హాలీడేస్ కి వెళ్లిపోతున్నారు.
మొత్తం మీద పచ్చ పార్టీని తెల్లబోయేలా చేశారు డీఎల్ రవీంద్రా రెడ్డి.