అభ్యర్థుల గుండెల్లో రెబల్స్ | heavy tensions to candidates with rebels | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల గుండెల్లో రెబల్స్

Published Thu, Apr 10 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

heavy tensions to candidates with rebels

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అభ్యర్థులెవరో తేలడంతో అన్ని పార్టీల్లోనూ అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. భంగపడిన ఆశావహులు.. టిక్కెట్లు దక్కిన నేతలకు దీటుగా నామినేషన్లు వేశారు. ఏకంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి రెబల్‌గా బరిలోకి దిగుతుండటంతో ఆ పార్టీ అధిష్టానం ఇరకాటంలో పడినట్లయింది. మరోవైపు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు కూడా రెబల్స్ బెడద తప్పడం లేదు. రెండు, మూడు నియోజకవర్గాలు మినహా దాదాపు అన్నిచోట్ల టిక్కెట్ రాకుండా భంగపడిన టీఆర్‌ఎస్ నాయకులు బుధవారం చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. పొత్తులో భాగంగా టీడీపీ-బీజేపీలు సీట్లు సర్దుబాటు చేసుకున్నా.. ఇరు పార్టీల నాయకులు మాత్రం ఎవరికి వారే అన్న చందంగా నామినేషన్లు వేశారు. దీంతో అన్ని పార్టీలకు బుజ్జగింపుల తలనొప్పులు తప్పేలా లేవు.

ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ టిక్కెట్ భార్గవ్‌దేశ్‌పాండేకు దక్కింది. ఆయనతోపాటు, టిక్కెట్ రాకుండా భం గపడిన డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి కూడా నామినేషన్ వేయడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నరేష్‌జాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించగా, ఆయన బుధవారం నామినేషన్ వేశారు. కాంగ్రెస్‌లోని మరో వర్గం నాయకులు జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతిని తెరపైకి తెచ్చిన విషయం విధితమే.

 బోథ్ (ఎస్టీ) స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అనిల్‌జాదవ్‌తోపాటు, ఆ పార్టీ టిక్కెట్ ఆశించిన కొమ్రం కోటేశ్వర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ ఇప్పటికే టీఆర్‌ఎస్ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి రాములునాయక్ నామినేషన్ వేయగా, టీఆర్‌ఎస్ టిక్కెట్ మాత్రం రాథోడ్ బాపురావుకు దక్కింది. పొత్తులో భాగంగా సోయంబాపు రావు టీడీపీ తరఫున బోథ్ నియోజకవర్గానికి నామినేషన్ వేయగా, ఈ స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ ఆశించిన మడావి రాజు తన కోడలు మడావి సుమలతతో నామినేషన్ వేయించారు. అలాగే ముథోల్  స్థానం బీజేపీకి దక్కింది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా రమాదేవి నామినేషన్ వేశారు. ఇందుకు ధీటుగా టీడీపీ నాయకులు ఓం ప్రకాష్ లడ్డా, టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి నారాయణరెడ్డి కూడా బరిలోకి దిగుతున్నారు.

 కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా జిల్లాలోని బెల్లంపల్లి స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌కు ధీటుగా, కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన చినుముల శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎ.శ్రీదేవిలు బరిలోకి దిగాలని నిర్ణయించారు. పొత్తులో ఈ స్థానం టీడీపీకి దక్కగా పాటి సుభద్ర నామినేషన్ వేశారు. టీడీపీ నాయకులు శీలం రాజలింగు, పి.వెంకటిలతోపాటు, బీజేపీ నాయకుడు గందం రమేష్ కూడా పోటీ చేయాలని నిర్ణయించారు.

సిర్పూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కావేటి సమ్మయ్య బరిలో దిగుతుండగా, ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన జబ్బార్‌ఖాన్ కూడా నామినేషన్ దాఖలు చేశా రు. టీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు పాల్వయి రాజ్యలక్ష్మి తన కుమారుడు హరీష్‌రావుతో ఇప్పటికే నామినేషన్ వేయించిన విషయం విధితమే. టీడీపీ అభ్యర్థిగా రావి శ్రీనివాస్ పోటీ చేస్తుండగా, ఈ టిక్కెట్ దక్కని టీడీపీ సీనియర్ నాయకుడు బుచ్చిలింగం కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

 మంచిర్యాల స్థానం నుంచి బీజేపీ నుంచి ఎం.మల్లారెడ్డి పోటీ చేయాలని నిర్ణయించగా, ఇందుకు ధీటుగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండేటి సత్యం నామినేషను వేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు బరిలో దిగుతుండగా, ఆ పార్టీ నాయకులు డాక్టర్ రమణ, ఎస్.రాజేష్ కూడా పోటీ చేయాలని నిర్ణయించారు.

 ఖానాపూర్ కాంగ్రెస్ టిక్కెట్ అజ్మీరా హరినాయక్‌కు దక్కగా, భరత్‌చౌహాన్, శ్రావణ్‌నాయక్‌లు కూడా నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి రేఖ శ్యాంనాయక్‌కు ధీటుగా, విజయలక్ష్మిచౌహాన్, ప్రేమలతలు పోటీ చేస్తున్నారు.

 ఆసిఫాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కోవ లక్ష్మిని ప్రకటించినప్పటికీ, ఆ పార్టీ నాయకుడు పెందూరు గోపి కూడా నామినేషన్ వేశారు. చెన్నూరు కాంగ్రెస్ టిక్కెట్ జి.వినోద్‌కు దక్కగా, ఈ టిక్కెట్ ఆశించిన దాసారపు శ్రీనివాస్ కూడా పోటీలో ఉండాలని భావిస్తున్నారు. బీజేపీ తన అభ్యర్థిగా రాంవేణును ప్రకటిం  చింది. అయితే ఈ టిక్కెట్ రాకుండా భంగపడిన బోడ జనార్దన్ కూడా బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దుర్గం నరేష్ కూడా పోటీ చేస్తుండటం గమనార్హం. ఈ తిరుగుబాటు అభ్యర్థులు గడువు ఈనెల 12లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement