c.ramachandra reddy
-
నేడు నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించేలా లేవు. పలుచోట్ల స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు పోటీకీ సిద్ధమవుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు శనివారంతో ముగుస్తుంది. దీంతో టిక్కెట్లు దక్కిన అభ్యర్థుల గుండెల్లో రె‘బెల్స్’ మోగుతున్నాయి. తిరుగుబావుటా ఎగురవేసిన డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. బోథ్ నుంచి నామినేషన్ వేసిన కొమురం కోటేశ్వర్, ఖానాపూర్ బరిలోకి దిగాలని నిర్ణయించిన భరత్‌చౌహాన్‌లు శనివారం నిర్ణయం తీసుకోనున్నారు. సీపీఐ స్థానంలోనూ.. సీపీఐతో పొత్తులో భాగంగా బెల్లంపల్లి స్థానాన్ని కాంగ్రెస్ ఆ పార్టీకి కేటాయించింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా మల్లేష్ సీపీఐ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ స్థానంపై కూడా కాంగ్రెస్ నేతలు కన్నేశారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చిలుముల శంకర్ పోటీకి సిద్ధమయ్యారు. ఆయనను పోటీలో ఉండాలని జిల్లా కాంగ్రెస్‌లోని ఓ కీలక నేత ప్రోత్సహిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తమకు కేటాయించిన స్థానంలో కాంగ్రెస్ నాయకులు ఎలా పోటీ చేస్తారని సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని చిలుముల శంకర్‌పై టీ కాంగ్రెస్ ముఖ్యనాయకులు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. చెన్నూరు స్థానానికి నామినేషన్ వేసిన కాంగ్రెస్ నాయకుడు దాసారపు శ్రీనివాస్ మాత్రం ఉపసంహరణకు అంగీకరించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో.. సిర్పూర్ స్థానానికి టీఆర్ఎస్ మహిళా నాయకురాలు పాల్వయి రాజ్యలక్ష్మి తన కుమారుడు హరీష్‌రావుతో నామినేషన్ వేయించారు. ఆమె తన కుమారుడితో నామినేషన్ ఉపసంహరింప చేయాలనే నిర్ణయానికి వచ్చినప్పటికీ, టీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యకు మద్దతుగా ఎన్నికల్లో పనిచేయడం ప్రశ్నార్థకమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రేంసాగర్‌రావుకే పరోక్ష మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు జబ్బార్‌ఖాన్ పోటీలో ఉండే అవకాశాలే ఉన్నాయి. మంచిర్యాలలో టీఆర్ఎస్ రెబల్‌గా నామినేషన్ వేసిన సిరిపురం రాజేష్ శనివారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్ స్థానానికి నామినేషన్ వేసిన టీఆర్ఎస్ నాయకులు పెందూరు గోపి మాత్రం బరిలో ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖానాపూర్ స్థానానికి నామినేషన్ వేసిన విజయలక్ష్మిచౌహాన్ బరి నుంచి తప్పుకునే అవకాశాలు కనిపించడం లేదు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన స్థానాల్లో నామినేషన్లు వేసిన టీడీపీ నాయకులు దుర్గం నరేష్ (చెన్నూరు), నారాయణరెడ్డి (ముథోల్), ఓం ప్రకాష్లడ్డా (ముథోల్)లు శనివారం నామినేషన్లు ఉపసంహరించుకోనున్నారు. సిర్పూర్ స్థానానికి నామినేషన్ వేసిన బుచ్చిలింగం ఉపసంహరణపై శనివారం నిర్ణయం తీసుకోనున్నారు. -
అభ్యర్థుల గుండెల్లో రెబల్స్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అభ్యర్థులెవరో తేలడంతో అన్ని పార్టీల్లోనూ అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. భంగపడిన ఆశావహులు.. టిక్కెట్లు దక్కిన నేతలకు దీటుగా నామినేషన్లు వేశారు. ఏకంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి రెబల్‌గా బరిలోకి దిగుతుండటంతో ఆ పార్టీ అధిష్టానం ఇరకాటంలో పడినట్లయింది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కూడా రెబల్స్ బెడద తప్పడం లేదు. రెండు, మూడు నియోజకవర్గాలు మినహా దాదాపు అన్నిచోట్ల టిక్కెట్ రాకుండా భంగపడిన టీఆర్ఎస్ నాయకులు బుధవారం చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. పొత్తులో భాగంగా టీడీపీ-బీజేపీలు సీట్లు సర్దుబాటు చేసుకున్నా.. ఇరు పార్టీల నాయకులు మాత్రం ఎవరికి వారే అన్న చందంగా నామినేషన్లు వేశారు. దీంతో అన్ని పార్టీలకు బుజ్జగింపుల తలనొప్పులు తప్పేలా లేవు. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ టిక్కెట్ భార్గవ్‌దేశ్‌పాండేకు దక్కింది. ఆయనతోపాటు, టిక్కెట్ రాకుండా భం గపడిన డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి కూడా నామినేషన్ వేయడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నరేష్‌జాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించగా, ఆయన బుధవారం నామినేషన్ వేశారు. కాంగ్రెస్‌లోని మరో వర్గం నాయకులు జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతిని తెరపైకి తెచ్చిన విషయం విధితమే. బోథ్ (ఎస్టీ) స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అనిల్జాదవ్తోపాటు, ఆ పార్టీ టిక్కెట్ ఆశించిన కొమ్రం కోటేశ్వర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి నియోజకవర్గ ఇన్చార్జి రాములునాయక్ నామినేషన్ వేయగా, టీఆర్ఎస్ టిక్కెట్ మాత్రం రాథోడ్ బాపురావుకు దక్కింది. పొత్తులో భాగంగా సోయంబాపు రావు టీడీపీ తరఫున బోథ్ నియోజకవర్గానికి నామినేషన్ వేయగా, ఈ స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ ఆశించిన మడావి రాజు తన కోడలు మడావి సుమలతతో నామినేషన్ వేయించారు. అలాగే ముథోల్ స్థానం బీజేపీకి దక్కింది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా రమాదేవి నామినేషన్ వేశారు. ఇందుకు ధీటుగా టీడీపీ నాయకులు ఓం ప్రకాష్ లడ్డా, టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జి నారాయణరెడ్డి కూడా బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా జిల్లాలోని బెల్లంపల్లి స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌కు ధీటుగా, కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన చినుముల శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎ.శ్రీదేవిలు బరిలోకి దిగాలని నిర్ణయించారు. పొత్తులో ఈ స్థానం టీడీపీకి దక్కగా పాటి సుభద్ర నామినేషన్ వేశారు. టీడీపీ నాయకులు శీలం రాజలింగు, పి.వెంకటిలతోపాటు, బీజేపీ నాయకుడు గందం రమేష్ కూడా పోటీ చేయాలని నిర్ణయించారు. సిర్పూర్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కావేటి సమ్మయ్య బరిలో దిగుతుండగా, ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన జబ్బార్‌ఖాన్ కూడా నామినేషన్ దాఖలు చేశా రు. టీఆర్ఎస్ మహిళా నాయకురాలు పాల్వయి రాజ్యలక్ష్మి తన కుమారుడు హరీష్‌రావుతో ఇప్పటికే నామినేషన్ వేయించిన విషయం విధితమే. టీడీపీ అభ్యర్థిగా రావి శ్రీనివాస్ పోటీ చేస్తుండగా, ఈ టిక్కెట్ దక్కని టీడీపీ సీనియర్ నాయకుడు బుచ్చిలింగం కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. మంచిర్యాల స్థానం నుంచి బీజేపీ నుంచి ఎం.మల్లారెడ్డి పోటీ చేయాలని నిర్ణయించగా, ఇందుకు ధీటుగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి సత్యం నామినేషను వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు బరిలో దిగుతుండగా, ఆ పార్టీ నాయకులు డాక్టర్ రమణ, ఎస్.రాజేష్ కూడా పోటీ చేయాలని నిర్ణయించారు. ఖానాపూర్ కాంగ్రెస్ టిక్కెట్ అజ్మీరా హరినాయక్‌కు దక్కగా, భరత్‌చౌహాన్, శ్రావణ్నాయక్లు కూడా నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి రేఖ శ్యాంనాయక్‌కు ధీటుగా, విజయలక్ష్మిచౌహాన్, ప్రేమలతలు పోటీ చేస్తున్నారు. ఆసిఫాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కోవ లక్ష్మిని ప్రకటించినప్పటికీ, ఆ పార్టీ నాయకుడు పెందూరు గోపి కూడా నామినేషన్ వేశారు. చెన్నూరు కాంగ్రెస్ టిక్కెట్ జి.వినోద్‌కు దక్కగా, ఈ టిక్కెట్ ఆశించిన దాసారపు శ్రీనివాస్ కూడా పోటీలో ఉండాలని భావిస్తున్నారు. బీజేపీ తన అభ్యర్థిగా రాంవేణును ప్రకటిం చింది. అయితే ఈ టిక్కెట్ రాకుండా భంగపడిన బోడ జనార్దన్ కూడా బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి దుర్గం నరేష్ కూడా పోటీ చేస్తుండటం గమనార్హం. ఈ తిరుగుబాటు అభ్యర్థులు గడువు ఈనెల 12లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారో వేచి చూడాల్సిందే. -
13న కాంగ్రెస్ జైత్రయాత్ర
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ‘తెలంగాణ ఇచ్చేది మేమే. తెచ్చేది మేమే.. అన్న మాటను నిలబెట్టుకున్నాం. ఈ విషయాన్ని తెలంగాణ వాదులు గుర్తించాలి. ఇందులో భాగంగా ఈనెల 13న నిర్మల్‌లో కృతజ్ఞత సభ, జైత్రయాత్ర, విజయోత్సవ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ వాదులు ఈ కార్యక్రమాల్లో భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి’ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన స్వగృహంలో ఇతర నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేశారని, మాట తప్పకుండా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని స్పష్టం చేశారు. యూపీఏ మిత్ర పక్షాలు, సీడబ్ల్యూసీ సమావేశంలో, కేబినెట్ తెలంగాణ తీర్మానం చేశారని, ఇందుకు సహకరించిన అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఈనెలలో జరిగే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. జైత్రయాత్ర కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ కమిటీ నాయకులు, తెలంగాణవాదులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. అంతకుముందు కృతజ్ఞత సభ పోస్టర్‌ను విడుదల చేశారు. తెలంగాణ ఏర్పాటు గురించి ప్రజలకు తెలిసేవిధంగా బస్టాండ్‌లో, రైల్వేస్టేషన్, మార్కెట్లలో, ముఖ్య కూడళ్లలో వాల్‌పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపధ్యక్షుడు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, మల్లేపూల నర్సయ్య, సుఖేందర్, అశోక్, భోజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.