
మేమే నయం
మా విలువలు కాపాడుకునేందుకే రాజకీయాల్లోకి..
మాకు డబ్బు వ్యామోహంలేదు... పొట్టకూటికోసమే భిక్షాటన
ఖమ్మం నుంచి బరిలోకి దిగిన హిజ్రాల సంఘం రాష్ట్ర కార్యదర్శి మేరీ
ఈరగాని భిక్షం, ఖమ్మం
మా ఓట్లు తమకే వేయాలంటూ ఎన్నికలప్పుడు నాయకులు బతిమలాడుతారు. కానీ గెలిచాక మా బాగోగులు ఎవరూ పట్టించుకోరు. స్త్రీ,పురుషులకు వేర్వేరుగా రిజర్వేషన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. కానీ మేం గుర్తుకు రాం. మేమూ భారతీయులమే కదా.. అయినా మమ్మల్ని గుర్తించేవారే కరువయ్యారు. మా విలువలు మేం కాపాడుకోవాలి కదా. అందుకే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి సత్తాచాటాలని నిర్ణయించుకున్నా... అంటున్నారు హిజ్రాల సంఘం రాష్ట్ర కార్యదర్శి దోమల మేరీ. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన ఆమె శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..
అందరిలా ఆడగానో.. మగగానో పుట్టి ఉంటే అందరితో సమానంగా జీవించే వాళ్లం. కానీ విధి వంచితులుగా పుట్టినందుకు ప్రతీ చోట అవమానాలు భరించాల్సి వస్తోంది. చిన్నప్పటి నుంచి బడి, గుడి, బజారు, ఇంటా బయట ఎక్కడైనా చిన్న చూపే. వీటన్నింటినీ తట్టుకొని గురువుల సహకారంతో ఎనిమిదో తరగతి చదివిన నేను ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. నాలాంటి వారందరం ఒక చోటికి చేరి ఒకరికి ఒకరం మనోధైర్యం కల్పించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. జీవించేందుకు ఏ పనిచేయాలన్నా.. ఎవరూ రానివ్వరు అందుకోసమే పొట్టకూటి కోసం భిక్షాటన చేయాల్సి వస్తోంది. ఖమ్మంలో సుమారు ఐదు వందల మందిమి, జిల్లావ్యాప్తంగా రెండువేల మంది ఉన్నాం. మా అందిరి ఓట్లకోసం ఎన్నికలప్పుడు నాయకులు వస్తారు. కనీసం మమ్మల్ని మనుషులుగా గుర్తించే వారు కరువయ్యారు. నాతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న మా హిజ్రాలకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలని డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరం జరిగిన హిజ్రాల రాష్ట్ర మహాసభల్లో రాజకీయంగా ఎదగాలని తీర్మానం చేశాం. అందులో భాగంగానే రాజకీయాల్లోకి వచ్చాం. ఇప్పటి నుంచి ప్రతీ ఎన్నికల్లో పోటీ చేస్తాం.
పట్టించుకోనందుకే..
మాకు ప్రత్యేకమైన గుర్తింపులేదు. ఏ కార్యాలయానికి వెళ్లినా మిమ్మల్ని ఏ జాబితాలో చేర్చాలని అధికారులు అవహేళన చేస్తుంటారు. అందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగ, ఉపాధి మార్గాలు, రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కానీ మా గురించి ఆలోచించేవారు లేరు. అదే మా వర్గం నుంచి ఒక్కరు అసెంబ్లీకి వెళ్లినా మా వాణి విపిస్తారు. మా సమస్యపై చర్చ జరిగేలా చూస్తారు. అందుకోసమే పోటీలోకి దిగా.
ప్రజల నమ్మకమే నన్ను గెలిపిస్తుంది
రాజకీయాల్లో విలువలు లేకుండా పోయాయి. ఎన్నికల ముందు ఒక మాట.. గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారు. అలా మాటతప్పే వారికంటే మేమే నయం. మాకు ఏ ఆపేక్ష లేదు. డబ్బులు సంపాదించుకోవాలనే తపన అస్సలు లేదు. ప్రజలకోసం, మా లాంటి అభాగ్యుల కోసం పనిచేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నాం. విధి వంచితులమైన మాలాంటి వారితోపాటు వివిధ కారణాలతో సమాజం నుంచి బహిష్కరణకు గురైన వారికోసం పాటుపడతాం. సమాజంలో ఎక్కడికి వెళ్లినా చిన్నచూపే. పని దొరకకపోవడంతో పొట్టకూటికోసం భిక్షాటన చేస్తున్నాం. ఏ స్వార్థం లేని మేం ప్రజలకు సేవచేస్తామని వారు నమ్ముతున్నారు. ఆ నమ్మకమే నన్ను విజయ తీరం చేరుస్తుంది.