సాక్షి, అనంతపురం : జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయా? రాష్ట్ర విభజన నిర్ణయం ఆ పార్టీని పూర్తిగా తుడిచి పెట్టుకునిపోయేలా చేసిందా? ఈ ప్రశ్నలకు మంగళవారం హిందూపురంలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభను చూస్తే అవుననిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభ నిర్వహించింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విచ్చేసిన ఈ సభకు జన సమీకరణ కోసం ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అష్టకష్టాలు పడ్డారు. జిల్లా నుంచి జనం తరలివచ్చే అవకాశం లేకపోవడంతో కర్ణాటక నుంచి జనాన్ని తరలించారు.
అదీ రెండు, మూడు వేలలోపే వచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి కర్ణాటకలోని బాగేపల్లి, గౌరీ బిదనూరు, పావగడ, మధుగిరి తాలూకాల్లోని పలు ప్రాంతాల నుంచే కాకుండా మడకశిర, హిందూపురం నియోజకవర్గాల్లో జనసమీకరణ చేశారు. రాహుల్ సభతో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊతం వస్తుందనుకుంటే సభ సక్సెస్ కాకపోవడంతో ఆ పార్టీ నేతలు నిస్తేజంలో మునిగిపోయారు. ఆశించిన జనం రాకపోయేసరికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా కంగుతిన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సారధి చిరంజీవి మాత్రం వచ్చిన జనాన్ని చూసి మురిసిపోయారు. ఆయన ప్రచారం చేస్తుంటే పదుల సంఖ్యలో కూడా జనం రాకపోవడం.. రాహుల్ సభకు రెండు, మూడు వేల మంది జనం రావడంతో అదే మహాప్రసాదం అన్నట్టు ఇక కాంగ్రెస్ పార్టీ బలపడిపోయిందని వ్యాఖ్యానించారు.
ఇది విన్న ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకున్నారు. సభలో ఓ వైపు రాహుల్ ప్రసంగిస్తుండగానే వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.500 చొప్పున పంపిణీ చేయడం కన్పించింది. ఇదిలావుండగా రాహుల్ గాంధీ ఆంగ్లంలో ప్రసంగిస్తుండగా దాన్ని రఘువీరారెడ్డి తెలుగులోకి అనువదించారు. ఈ సమయంలో రాహుల్ చెప్పినదాని కంటే రెండు వాక్యాలు ఎక్కువ జోడించి చెప్పడంతో కొందరు ‘ఇదేంటి.. ఆయన చెప్పిందేంటి.. ఈయన చెబుతోందేంటి’ అని చర్చించుకోవడం కన్పించింది. పైగా రాహుల్ ప్రసంగం కూడా జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. ఆయన ప్రసంగిస్తుండగానే కొందరు సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకున్నా ఎవరూ వారి మాట వినలేదు. దీంతో నాయకులు కూడా పక్క చూపులు చూడడం మినహా వారిని వారించే ప్రయత్నం చేయలేదు. ఒక దశలో ప్రసంగం ముగిస్తే బాగుంటుందన్న రీతిలో రాహుల్ గాంధీ చెవిలో దిగ్విజయ్ సింగ్ చెబుతున్నట్లు కన్పించింది. ఆ కొద్ది సేపటికే రాహుల్ ప్రసంగం ముగించారు.
రాష్ట్ర విభజన వల్ల అన్ని ప్రాంతాల కంటే అనంతపురం జిల్లా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నా ఆ అంశాల గురించి, ఇక్కడి అభివ ృద్ధి గురించి రాహుల్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. తరలివచ్చిన జనానికి షామియానాలు, తాగునీటి వసతి కల్పించక పోవడంతో వారు చాలా ఇబ్బందులు పడ్డారు. సభా ప్రాంగణంలో వేసిన కుర్చీల్లో సగానికి పైగా ఖాళీగానే దర్శనమిచ్చాయి. సభ ప్రారంభానికి ముందు చాలా మంది మద్యం షాపుల వద్దకు క్యూ కట్టారు. కాగా రాహుల్ సభకు శింగనమల , తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థులు శైలజానాథ్, విశ్వనాథరెడ్డి గైర్హాజరయ్యారు.