వామపక్షానికి వరం | History of about politics | Sakshi
Sakshi News home page

వామపక్షానికి వరం

Published Sat, Apr 12 2014 2:26 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

వామపక్షానికి వరం - Sakshi

వామపక్షానికి వరం

చిన్ననాడే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యమబాట పట్టారు. ఖాకీల కాఠిన్యాన్నీ చూశారు. కవుల లాలిత్యాన్నీ ఆస్వాదించారు. మంచి చదువరి. ఉత్తమ వక్త. ఒకప్పటి సమైక్యవాది, నేటి తెలంగాణ వాది. ఓ జాతీయ పార్టీని నడిపిస్తున్న తెలుగువాడు.. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి.
 
 ఎ.అమరయ్య
 దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి పదేళ్లయింది. స్కూలుకు బ్లాక్‌బోర్డు, చాక్‌పీసులు, నోటు పుస్తకాలు ఎందుకివ్వరని  పదిహేనేళ్లు కూడా లేని బాలుడు.. అధికారులను నిలదీశాడు. ఆ  బాలుడి నినాదం కర్నూలు జిల్లా విద్యాశాఖను కదిలించింది. ప్రతి పాఠశాలకు నల్లబోర్డులు ఏర్పాటు చేసింది. అతనే నేటి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి. ఆ స్కూలే కర్నూలులోని మున్సిపల్ హైస్కూలు. 1957లో జరిగిన ఈ సంఘటన అధికార యంత్రాంగాన్ని మునికాళ్లపై నిలబెట్టింది. సుధాకర్‌రెడ్డి 1942 మార్చి 25న సమరయోధుల ఇంట జన్మించారు.
 
 ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. తల్లి ఈశ్వరమ్మ. ఇద్దరు సోదరులు, ఒక సోదరి. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం కంచుపాడు స్వగ్రామం. సురవరం హైస్కూ లు విద్యను కర్నూలులోనే పూర్తి చేశారు. ఉస్మానియా కళాశాలలో బీఏ చదివారు. 1967లో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కోర్సులో చేరారు. అప్పటికే కమ్యూనిస్టు రాజకీయాలతో ఉన్న అనుబంధం కారణంగా 19 ఏళ్లకే ఏఐఎస్‌ఎఫ్ కర్నూలు టౌన్ కార్యదర్శిగాను, 1960లో జిల్లా కార్యదర్శిగా ఎదిగారు. ప్రతి విద్యార్థికి చదువు, పోరాటం.. రెండు కళ్లని చెప్పే సురవరం జీవితంలో రెండు మరచిపోని సంఘటనలున్నాయి.
 
 ఒకటి బ్లాక్‌బోర్డుల ఉద్యమమైతే, మరొకటి 1962లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన 62 రోజుల నిరవధిక సమ్మె. ఆయన నాయకత్వంలోనే జరిగింది. ఆ  తర్వాత  ఆయన ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. ఆ మరుసటి ఏడాది జాతీయ కార్యదర్శిగా ఎన్నిక య్యారు. ప్రధాన కార్యదర్శి పదవిని రెండుసార్లు నిర్వహించిన సురవరం ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 1972లో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ పలు అంతర్జాతీయ సదస్సులకు ప్రాతినిధ్యం వహించారు. ఈ కాలంలో జై ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా చురుగ్గా పనిచేశారు. కొచ్చిన్‌లో జరిగిన సీపీఐ 9వ జాతీయ మహాసభలో జాతీయ కౌన్సిల్‌కు ఎంపికయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చిన సురవరం పార్టీ రాష్ట్ర వ్యవహారాలలో క్రియాశీలకమయ్యూరు. 1974 ఫిబ్రవరి 19న బీవీ విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు.
 
 ఎన్నికల ప్రస్థానం ...
 1985లో తొలిసారి, 1990లో రెండోసారి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 1994లో కర్నూలు జిల్లా డోన్ నుంచి ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిపై పోటీకి దిగారు. అసెంబ్లీకి వరుసగా మూడుసార్లు ప్రయత్నించి విఫలమైన సురవరం .. 1998లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి  విజయం సాధించారు. ఈ కాలంలోనే  పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా పనిచేశారు.
 
 ఎంపీగా ఉంటూ పార్టీ కార్యదర్శి పదవిని నిర్వహించిన వ్యక్తి కూడా సురవరమే. 2000వ సంవత్సరంలో చంద్రబాబు సర్కార్ విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బషీర్‌బాగ్ ఘటనలో లాఠీ దెబ్బలు తిని ఆస్పత్రి పాలయ్యారు. 2004 ఎన్నికల్లో నల్లగొండ నుంచి  రెండోసారి ఎన్నికై... కార్మిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘ చైర్మన్‌గా పనిచేశారు. చండ్ర రాజేశ్వరరావు తర్వాత సీపీఐకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయిన రెండో తెలుగు వ్యక్తి సురవరమే.
 
 ప్రొఫైల్
 పేరు:    సురవరం సుధాకర్‌రెడ్డి
 తల్లిదండ్రులు:    ఈశ్వరమ్మ, వెంకట్రామిరెడ్డి
 పుట్టిన తేదీ:    25-03-1942
 పుట్టిన ఊరు:    కొండ్రావ్‌పల్లె
 స్వగ్రామం:    కంచుపాడు,
                మానవపాడు మండలం,
               మహబూబ్‌నగర్ జిల్లా
 విద్య:  బీఏ, ఎల్‌ఎల్‌బీ
 భార్య:    డాక్టర్ బీవీ విజయలక్ష్మి
 సంతానం: ఇద్దరు కుమారులు
 ప్రస్తుత హోదా:    సీపీఐ ప్రధాన కార్యదర్శి
 నిర్వహించిన పదవులు:    పార్లమెంటు  సభ్యుడు సహా అనేకం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement