* జగన్ ప్రభుత్వ ఏర్పాటుపైనే భారీ పందేలు
* వందపైగా సీట్లొస్తాయని ఒకటికి రెండు రెట్లు
* టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కదని బెట్టింగులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పందేలు మొదలయ్యాయి. రాష్ర్టవ్యాప్తంగా కోట్ల రూపాయల్లో బెట్టింగులు సాగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాలుగా పెద్ద ఎత్తున పందేలు నడుస్తున్నట్లు సమాచారం. ఇక వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ లక్షల్లో బెట్టింగ్‌లు సాగుతున్నాయి.
కొన్ని బెట్టింగులు బుకీల ద్వారా సాగుతుండగా, చాలావరకూ స్థానికంగా మధ్యవర్తుల ద్వారానే నడుస్తున్నాయి. బీరు, బిర్యానీ మొదలు కోటి రూపాయల వరకు పందాలు సాగుతున్నాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో సుమారు వంద కోట్ల రూపాయలకుపైగా లావాదేవీలకు ఒప్పందాలు కుదిరాయి. సీట్ల సంఖ్య, పార్టీలు, నేతలపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి.
► పందెపురాయుళ్లలో అత్యధికులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే దానిపైనే ఎక్కువగా దృష్టి సారించారు. ఒకటికి మూడు చొప్పున పందేలకు సై అంటున్నారు. వైఎస్సార్‌సీపీకి వందకుపైగా సీట్లు వస్తాయంటూ ఒకటికి రెండు చొప్పున పందెం కాస్తున్నారు.
► కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓడతారా? గెలుస్తారా?, మెజారిటీ 20 వేలలోపు ఉంటుందా? ఎక్కువ ఉంటుందా? అనే దానిపై గుంటూరు, విజయవాడలో పందేలు సాగుతున్నాయి.
► మాచర్లకు చెందిన మూడెకరాల రైతు తన యావదాస్తిని పందెం కాశారు. నూజివీడుకు చెందిన మామిడిరైతు ఐదెకరాల తోటను పందెంలో ఒడ్డారు.
► టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదనే దానిపై పొన్నూరు 15వ వార్డుకు చెందిన ఓ మైనారిటీ నేత రూ. 25వేలు, గుంటూరు సంగడిగుంటకు చెందిన ఓ ముఠామేస్త్రీ ఏకంగా 50 వేలు పందెం కాయడం విశేషం.
► వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఒక వస్త్ర వ్యాపారి వైఎస్సార్ కాంగ్రెస్‌కు వంద సీట్లు వస్తాయంటూ ఒకటికి రెండు చొప్పున రూ. 20 లక్షలు, కడపకు చెందిన ఒక నగల వ్యాపారి ఒకటికి మూడు చొప్పున రూ. 40 లక్షలు పందెం కాశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని విశాఖలో ఓ పారిశ్రామికవేత్త ఒకటికి మూడు చొప్పున రూ. కోటి పందెం కాశారు.