హైదరాబాద్ ఆదాయమంతా తెలంగాణకే
కేంద్రమంత్రి జైరాం రమేష్
కోదాడ , న్యూస్‌లైన్: హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని తెలంగాణకే కేటాయిస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. నల్లగొండ జిల్లా కోదాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోడ్‌షో నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి 20నుంచి 30వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, ఈ నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చేందుకు కేంద్రం నాలుగువేల మెగావాట్లతో నూతన విద్యుత్ కేంద్రాన్ని మంజూరు చేయనున్నట్లు చెప్పారు.
సింగరేణిలో తెలంగాణకు 51శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉండే విధంగా పంపకాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి సీమాంధ్రతో సమానంగా రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. 50ఏళ్ల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం దళితుడైన దామోదర సంజీవయ్యను ముఖ్యమంత్రిని చేసిందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ, సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండే విధంగా ప్రజలు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.