
'గంటాను ఓడించడానికి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తా'
విశాఖ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలకు వరుస షాక్ లు ఇస్తున్నారు. టికెట్ పై గతంలో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకోవడం ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు తీరుతో భంగపడ్డ నేతల జాబితాలో అనిత సక్రు కూడా చేరిపోయారు. విశాఖ జిల్లాలోని భీమిలి అసెంబ్లీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నఅనితకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చకున్న గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ కేటాయించడంతో వివాదం రాజుకుంది. గంటా వల్లే తనకు టికెట్టు రాలేదని ఆమె మీడియా ముందు ఏకరువు పెట్టారు. పార్టీకి సేవ చేసిన వారికి టికెట్లు ఇవ్వకుండా పార్టీలో అప్పుడే చేరిన వారికి టికెట్టు ఇవ్వడంపై ఆమె మండిపడ్డారు. గంటాను ఓడించడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది. ఇక తనముందు టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగటమేనని టీడీపీ అధినాయకత్వాన్ని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆయనకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. అక్కడి టికెట్ ను రామకృష్ణారెడ్డికి కాకుండా వేరేవారికి ఇవ్వడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆ టికెట్ ను రాష్ట్ర సర్పంచ్ లు మాజీ అధ్యక్షుడు పడాల రామారెడ్డి సతీమణి సునీతకు ఆ సీటును కేటాయించడంతో రామకృష్ణారెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం ఆందోళన బాటపట్టారు. పార్టీ కోసం కష్టపడే వారికి బాబు టికెట్లు ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు.