ప్రజా చైతన్యం
సాక్షి, ఒంగోలు: ‘మీ రాజన్న కూతుర్ని.. జగనన్న చెల్లెల్ని.. మీ ముందుకు వచ్చాను. మీకు చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తూ కోరుతున్నాను. రాష్ట్రం దశాదిశ మారే ఎన్నికల పోలింగ్ రోజు మరి కొద్ది రోజుల్లో వచ్చేస్తోంది. ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం మన తలరాతలు మార్చేస్తుంది. ఒక్క అవకాశం ఇవ్వండి.. జగనన్న జీవితాంతం మీ సేవకి అంకితమౌతాడు.’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల పిలుపునిచ్చారు.
వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం జిల్లాలోని యర్రగొండపాలెం, దర్శి, పర్చూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన షర్మిల రోడ్‌షోలు, బహిరంగ సభలకు భారీ స్పందన లభించింది. ప్రజా చైతన్యం ప్రస్ఫుటమైంది. యర్రగొండపాలెంలో వైఎస్సార్ సెంటర్ బహిరంగ సభకు జనం పోటెత్తగా ..దర్శి గడియార స్తంభం సెంటర్ నాలుగు రోడ్ల కూడలి జనసంద్రమైంది. పర్చూరు నియోజకవర్గంలో మార్టూరులో బహిరంగ సభ విజయవంతం అయింది.
జనభేరి ఆద్యంతం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ప్రచార రథంపై ఆయా నియోజకవర్గాల లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, డాక్టర్ వరికూటి అమృతపాణి, పాలపర్తి డేవిడ్‌రాజు, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి భరత్, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ తదితరులు ప్రసంగించారు.
షర్మిల ప్రసంగిస్తూ విశ్వసనీయతకు మారు పేరైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.
మైనార్టీల స్వాగతోత్సాహం..
‘అమ్మా.. మీ నాయన మాకెంతో మేలు చేశాడమ్మా.. ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ తెచ్చిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని కడవరకు దేవుడుగా కొలుస్తామమ్మా...’అంటూ యర్రగొండపాలెంలో ముస్లిం మైనారిటీ మహిళలు షర్మిలతో మాట్లాడారు. నియోజకవర్గంలోని కొమరోలులో బస కేంద్రం నుంచి బయలుదేరిన షర్మిలకు జనం బ్రహ్మరథం పట్టారు. బేస్తవారిపేట, కంభం, మార్కాపురం బైపాస్ రోడ్డు, తోకపల్లి జంక్షన్, కుంట, గురిజేపల్లి, గ్రామాల మీదుగా రోడ్‌షో జరిగింది.
యర్రగొండపాలెం సెంటర్‌లో బహిరంగ సభకు జనం భారీగా తరలి వచ్చారు. ప్రధానంగా షర్మిల ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగటం.. ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. అనంతరం కొత్తగోళ్ల విడిపి, అయ్యబొట్లపల్లి, త్రిపురాంతకం, రామసముద్రం, మిట్టపాలెం, మేడపి, వినుకొండ అడ్డరోడ్డు మీదుగా కురిచేడు చేరుకుని అక్కడ నుంచి దర్శికి వచ్చారు. పల్లె పల్లెన ప్రజలు రోడ్ల వెంట నిలుచుని షర్మిలకు చేతులెత్తి జై కొట్టగా.. ఆమె చిరునవ్వుతో అభివాదం చేశారు.