స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నజశ్వంత్ సింగ్!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో చివరిసారి తన స్వరాష్ట్రమైన రాజస్థాన్‌లోని బార్మర్ నుంచి బరిలోకి దిగాలనుకున్న బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌సింగ్ ఆశలపై ఆ పార్టీ అధిష్టానం నీళ్లుచల్లింది. ఆయనకు శుక్రవారం టికెట్ నిరాకరించింది. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కల్నల్ సోనారామ్ చౌధరిని బార్మర్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీచేసేలా గురువారం బలవంతంగా ఒప్పించిన అధిష్టానం ఆయనకు సన్నిహితుడిగా ముద్రపడిన జశ్వంత్‌కు ఆ మర్నాడే టికెట్ నిరాకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో జశ్వంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏ హయాంలో మంత్రిగా పనిచేసిన జశ్వంత్ తన పాకిస్థాన్ సందర్శనపై రాసిన పుస్తకంలో ఆ దేశ పితామహుడు మొహమ్మద్ అలీ జిన్నాను పొగడటం ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టింది. గుజరాత్‌లో అయితే ఈ పుస్తకాన్ని నిషేధించారు. ఈ వివాదం కారణంగా కొంతకాలంపాటు ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది.