
కరుణానిధికి పార్టీలో వేధింపులు
మధురై: డీఎంకే పార్టీ బహిష్కృత నేత అళగిరి మరోమారు ఆ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీ అధ్యక్షుడు, తన తండ్రి అయిన కరుణానిధిని పార్టీలో కొన్ని శక్తులు వేధింపులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. తన తండ్రి అధ్యక్ష స్థానానికి భంగం వాటిల్లే విధంగా వారు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో భాగంగానే ఆయన్ను పార్టీ సమావేశాలకు దూరంగా ఉంచుతున్నారని ఆరోపించారు. ఆయన సోమవారం మద్దతుదారులతో సమావేశం అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొన్ని శక్తులు కొన్ని శక్తులు కరుణానిధిని వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.
కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నఆయన ముందుగా తన సొంత నియోజకవర్గం మదురైలో తన మద్దతుదారులతో సమావేశం అవుతూ పార్టీ పెడితే ఎలా ఉంటుందన్నదానిపై మంతనాలు జరుపుతున్నారు. క్రమశిక్షణ రాహిత్యం ఆరోపణలతో జనవరిలో పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన అళగిరి, పార్టీ పెట్టే విషయాన్నికొన్నిరోజుల క్రితమే సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే, లోక్సభ ఎన్నికల తర్వాతే ఈ విషయమై నిర్ణయం తీసుకుంటానంటారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటికే కళైంగర్ డీఎంకే అనే పేరును కొత్త పార్టీకి పెడుతూ మదురైలో పోస్టర్లు కూడా వెలిశాయి. ఇంతకుముందే ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు, బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కూడా కలిసిన అళగిరి, ఆ తర్వాత సూపర్స్టార్ రజనీకాంత్తో కూడా భేటీ అయ్యారు.అళగిరి వేరే పార్టీ ఆలోచన విరమించుకుని ఎవరైనా మద్దతు ఇస్తే మాత్రం డీఎంకే కోటకు బీటలు వారే అవకాశాలున్నాయి. అళగిరి కంచుకోట అయిన దక్షిణ తమిళనాడులో ఆయన తీవ్ర ప్రభావం చూపుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.