సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎంగా పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నియమితులైతేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష మాజీ ఉపనేత కొప్పుల ఈశ్వర్ ఇక్కడ మీడియా తో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఆంక్షలతో కూడిన తెలంగాణ జూన్ 2న ఏర్పాటవుతుందని, ఆ ఆంక్షలను తొలగించడం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌కు రాజకీయ అవసరాలు తప్ప తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే 12 వందల ఆత్మహత్యలు జరిగేవి కావన్నారు. సకల సౌకర్యాలను సీమాంధ్రకు ఇచ్చి వట్టి తెలంగాణ ఏర్పాటు కావడానికి కాంగ్రెస్, బీజేపీ కారణమని ఈశ్వర్ విమర్శించారు. చేవెళ్ల-ప్రాణహితకు జాతీయ హోదా కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు.
కేసీఆర్‌ను కలిసిన టీఎన్‌జీవో నేతలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)ను టీఎన్‌జీవో నేతలు మంగళవారం ఇక్కడ కలిశారు. టీఎన్‌జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవీప్రసాద్, కారం రవీందర్ రెడ్డితో పాటు కేంద్ర, జిల్లా సంఘం నేతలు అభినందనలు తెలియజేశారు. జూన్ 2 దాకా టీఎన్‌జీవో కార్యవర్గ పదవీకాలాన్ని పొడిగించిన విషయాన్ని వారు కేసీఆర్‌కు వివరించారు. టీఆర్‌ఎస్ నేతలు నాయిని నర్సింహారెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, బాలమల్లు, వి.శ్రీనివాస్‌గౌడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, షకీల్ తదితరులు కూడా కేసీఆర్‌ను కలిశారు.