ఆ ఒక్కటీ మాకే!
Published Wed, Apr 9 2014 2:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
మొదటే అంతంతమాత్రం.. లేని సత్తువను కూడదీసుకొని ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పొత్తుల చిచ్చు రగిల్చి కోలుకోలేకుండా చేస్తున్నారు.. ఇదీ నరసన్నపేట టీడీపీలో రగులుతున్న ఆవేదన జ్వాల. పరాభవాలను దిగమింగుకొని 15 ఏళ్లుగా పార్టీనే నమ్ముకున్న తమ గుండెల్లో అధిష్టానమే పొత్తుల కత్తి దించడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. నరసన్నపేటను బీజేపీకి వదిలేస్తే.. తాము పార్టీనే త్యాగం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు టీడీపీతో కలిసి పని చేయాల్సిన కమలదళ నేతలు పొత్తునే అవకాశంగా తీసుకుని సొంత లాభం ఆశిస్తున్నారు. పైకి ఎవరికి టిక్కెట్ ఇచ్చినా పర్వాలేదని రాగాలు తీస్తున్నా.. అంతర్గతంగా ఎవరికి వారు తమకే టిక్కెట్ రావాలని కోరుకుంటున్నారు. ప్రయత్నాలు చేసుకుం టున్నారు.స
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఉట్టికెక్కలేనమ్మ.. స్వర్గానికెగిరనట్లుంది బీజేపీ నేతల తీరు. జిల్లాలో పార్టీకి ఏ నియోజకవర్గంలోనూ బలం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ టీడీపీతో పొత్తులో భాగంగా జిల్లాలో ఒక సీటు నుంచి పోటీ చేసే అవకాశం రావడంతో దాన్ని తన్నుకుపోవాలని ఎవరికి వారు ఆశపడుతున్నారు. రాష్ట్రస్థాయి పొత్తులో భాగంగా జిల్లా లో నరసన్నపేట అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ ఇవ్వడానికి టీడీపీ నాయకత్వం ప్రతి పాదించిన విషయం.. దానిపై నరసన్నపేట టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్న విషయం తెలి సిందే. దాంతో పనిలేదన్నట్లు బీజేపీలోని ఔత్సాహికులు మాత్రం టిక్కెట్ కోసం పరస్పరం పోటీ పడుతున్నారు. ఈ పరిణామాలతో కమళదళంలో కలకలం రేగుతోంది. విజయవాడలో బుధవారం జరిగే పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి ఆరుగురు నేతలు వెళ్లారు. సమావేశానికి వెళుతున్నామని చెబుతున్నా.. వీరి అసలు ఎజెండా వేరే ఉంది.
పొత్తులో భాగంగా నరసన్నపేట లేదా ఇంకేదైనా గానీ.. పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలని తమకు తెలిసిన రాష్ట్ర నాయకుల ద్వారా ప్రయత్నించడమే వీరి అసలు లక్ష్యం. పొత్తు చర్చల సందర్భంగా జిల్లాలోని నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి బీజెపీకి ఇస్తామని టీడీపీ అధిష్టానం ప్రతిపాదించింది. దీనిపై నరసన్నపేట టీడీపీలో నిరసన పెల్లుబుకడంతో దాని బదులు పాతపట్నం ఇవ్వాలని కింజరాపు కుటుంబం పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం. మరోవైపు బీజెపీకి నరసన్నపేట కేటాయిస్తే ఇటీవలే ఆ పార్టీలో చేరిన బగ్గు లక్ష్మణరావుకు పార్టీ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ ప్రతిపాదనను బీజేపీ జిల్లా నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమలో ఎవరో ఒకరికి ఆ సీటు కేటాయించాలే తప్ప.. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఇవ్వడం సరికాదని రాష్ట్ర నాయకుల వద్ద స్పష్టం చేయాలని నిర్ణయించుకున్నారు.
విజయవాడ సమావేశానికి వె ళ్లిన నాయకుల్లో శవ్వాన ఉమామహేశ్వరి, పైడి వేణుగోపాలం, కోటగిరి నారాయణరావు, అట్టాడ రవిబాబ్జి, సంపతిరావు తేజేశ్వరరావు, కె.వెంకట్రావులు తమలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఓకే అని అందరి సమక్షంలో చెబుతున్నారు. అంతర్గతంగా మాత్రం తమకే టిక్కెట్ దక్కాలని వీరిలో నలుగురు నాయకులు గట్టిగా కోరుకుంటున్నారు. తమకు కాకుండా వేరొకరికి అవకాశమిస్తే సహించేది లేదని గట్టి గా చెబుతున్నారు. రాష్ట్ర నాయకులతో తమకున్న పరిచయాల ఆధారంగా ఎలాగైనా టిక్కెట్ దక్కించుకోవాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నరసన్నపేట కాకుంటే పాతపట్నం ఇచ్చే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుసుకున్న జిల్లా బీజేపీ నేతలు సీటు ఏదైనా అవకాశం మాత్రం తమకే దక్కాలని కోరుకుంటున్నారు. టీడీపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఆ పార్టీతో సమన్వయం, ప్రచార వ్యూహం వంటి అంశాలపై చర్చించేం దు బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తుండగా.. సీట్ల కేటాయింపు.. అభ్యర్థులకు అవకాశం..ఆశావహుల ఒత్తిళ్లతో రాష్ట్ర నేతలకు తలనొప్పి తప్పేలా లేదు.
Advertisement