ఇరానీ అయినా...ఇటాలియన్ అయినా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్ మళ్లీ నోరు జారారు. అమేథీ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన టీవీ నటి స్మృతి ఇరానీపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘ఇరానీ అయినా, పాకిస్థానీ అయినా... ఇటాలియన్ అయినా, అమెరికన్ అయినా... ఎవరు వచ్చినా ‘ఆప్’నే గెలిపించాలని అమేథీ ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. కుమార్ విశ్వాస్‌కు నోరు జారడం ఇదేమీ కొత్త కాదు. ఇదివరకు మొహర్రం వేడుకలపై వ్యంగ్యాస్త్రాలు సంధించి, ముస్లింల ఆగ్రహాన్ని చవిచూశారు. కేరళ నర్సులపై ఒక ముషాయిరాలో కవిత్వం పేరిట ప్రదర్శించిన పైత్యం ‘యూట్యూబ్’కెక్కడంతో విశ్వాస్‌పై దేశవ్యాప్తంగా విమర్శల జడివాన కురిసింది.
అంతకు ముందు హిందూ దేవతలపై, కర్బాలా అమరులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై రామ జన్మభూమి సేవా సమితి కోర్టుకెక్కింది. తాజాగా స్మృతి ఇరానీపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ శ్రేణులు కుమార్ విశ్వాస్‌పై మండిపడుతున్నాయి.