kumar viswas
-
కేజ్రీవాల్ దారిలోనే ఆప్ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నడిచిన అడుగుజాడల్లోనే ఆప్ నేతలు పయనిస్తున్నారు. ఇటీవల కేజ్రీవాల్‌పై ఉన్న పరువు నష్టదావా నుంచి తప్పించుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ సారీల పర్వం ముగియగానే ఆప్ నేతలు కూడా అదేపందాను అనుసరిస్తున్నారు. తాజాగా మరో ఆప్‌నేత కుమార్ విశ్వాస్ తాను చేసిన అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నట్లు, తన మీద ఢిల్లీ హైకోర్టులో వేసినే పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవాలని అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. కుమార్ లేఖకు స్పందించిన జైట్లీ పరువు నష్టం దావాను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. గతంలో కూడా కేజ్రీవాల్‌తో సహా ఆప్ నేతలు సంజయ్ సింగ్, అశుతోష్, దీపక్, రాఘవ్ చంద్రాలపై తన మీద అసత్య ఆరోపణలు చేసినందుకు పదికోట్లు చెల్లించాల్సిందిగా 2015లో ఢిల్లీ హైకోర్టులో జైట్లీ పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌తో సహా ఇతర నేతలు క్షమాపణలు కోరడంతో పిటిషన్‌ను జైట్లీ వెనక్కి తీసుకున్నారు. -
'విచారకరం.. నేను చెప్పినా వినలేదు'
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ రాష్ట్రపతికి సిఫారసు చేయడం దురదృష్టకరం, విచారకరం అని ఆ పార్టీ సీనియర్ నేత కుమార్ విశ్వాస్ అన్నారు. ఆప్‌లో తాజా సంక్షోభంపై ఆయన శనివారం స్పందించారు. 'ఈ సంఘటన దురదృష్టకరం, విచారకరం. లాభదాయక పదవులను ఎమ్మెల్యేలకు కట్టబెట్టొద్దని నేను గతంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సలహాలు ఇచ్చాను. ఆయన పట్టించుకోలేదు. నియామకాలు జరపడం ముఖ్యమంత్రికి ఉన్న విశేష అధికారం అని నాకు చెప్పడం వల్లే నేను మౌనంగా ఉండిపోయాను' అని విశ్వాస్ అన్నారు. 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు లాభదాయక పదవులను నిర్వహిస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని, వారిని శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని సిఫారసు చేసిన విషయం తెలిసిందే. -
రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన ఆప్
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, నవీన్ గుప్తా పేర్లను ఆప్ ఖరారు చేసింది. బుధవారం కేజ్రీవాల్ నివాసంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆప్ ఈ ముగ్గురి పేర్లను రాజ్యసభ సభ్యత్వం కోసం ఖరారు చేసినట్లు ప్రకటించింది. కాగా సుశీల్ గుప్తా ఢిల్లీలో పేరున్న వాణిజ్య వేత్త అగ్రసేన్ హాస్పిటల్, అగ్రసేన్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఆయనకు నగరంలో ఆసుపత్రులు, కాలేజీలు ఉన్నాయి. సుశీల్ గుప్తా నెల రోజుల క్రితం వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. అలాగే ఎన్డీ గుప్తా పేరున్న చార్టెడ్ అకౌంటెంట్. ఆయన ప్రస్తుతం ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఉపాధ్యక్షునిగా ఉన్నారు. కుమార్ విశ్వాస్‌కు మొండిచేయి పార్టీ సీనియర్ నేత కుమార్ విశ్వాస్‌కు తీవ్ర ఆశాభంగం కలిగింది. కుమార్ విశ్వాస్ను రాజ్యసభకు పంపాలని ఆయన మద్దతుదారులు పార్టీపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కుమార్ విశ్వాస్ మద్దతుదారులు రజాయిలు, పరుపులతో పార్టీ కార్యాలయంలో తిష్ట వేసి తమపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించడం పార్టీ నేతలకు రుచించలేదు కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్‌ల మధ్య పెరిగిపోయిన విబేధాల దృష్ట్యా కూడా ఆయనకు రాజ్యసభ సీటు దక్కలేదు. మరోవైపు అశితోష్‌మిశ్రా పేరును కూడా పార్టీ పక్కన పెట్టేసింది. కాగా రాజ్యసభలో మూడు ఢిల్లీ సీట్లకోసం జనవరి 16న ఎన్నిక జరుగనుంది. నామినేషన్లు దాఖలుచేసే తేదీ జనవరి 5న ముగియనుంది. -
ఆప్ నేత కుమార్ విశ్వాస్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఫిర్యాదుపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆప్ నేత కుమార్‌విశ్వాస్‌కు జారీ చేసిన సమన్లపై స్టే విధించడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. తనతో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు వస్తోన్న పుకార్లను కుమార్ విశ్వాస్ ఖండించడం లేదని ఓ ఆప్ మహిళా కార్యకర్త ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో తన ఎదుట హాజరై సంజాయిషీ ఇవ్వాలని మహిళా కమిషన్ విశ్వాస్ను మే 4న తిరిగి 6న ఆదేశించిన సంగతి తెలిసిందే ఈ సమన్లను సవాలుచేస్తూ కుమార్ విశ్వాస్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఆయన అప్పీలును తిరస్కరించింది. ఇదిలా ఉండగా కుమార్ విశ్వాస్‌కు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ బర్ఖాసింగ్‌ను ఎందుకు చైర్సర్సన్ పద వి నుంచి తొలగించరాదో తెలియచేయాలని కోరుతూ ఢిల్లీ సర్కారు ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
'సంబంధం' కేసులో ఆప్ నేతకు ఎదురుదెబ్బ
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త అతడిపై చేసిన వివాహేతర సంబంధం ఆరోపణల విసయంలో ఢిల్లీ మహిళా కమిషన్ జారీచేసిన సమన్లపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తనతో వివాహేతర సంబంధం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను కుమార్ విశ్వాస్ ఖండించట్లేదని, దానివల్ల తన కాపురంలో కలతలు వచ్చాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే దానిపై కుమార్ విశ్వాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఆమె బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఆపాలని, అలాగే తనకు సమన్లు జారీచేసే అధికారం ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఉందా అంటూ ఆయన ఈ పిటిషన్ వేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కుమార్ విశ్వాస్ తన భార్య, మరో ఇద్దరితో కలిసి కమిషన్ ఎదుట హజరు కావాలంటూ గతంలో సమన్లు జారీచేసింది. తనను నోర్మూసుకుని ఉండాలని, లేనిపక్షంలో సంతోష్ కోలిలాగే హత్యకు గురవుతావంటూ బెదిరించారని ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన కోలీ, 2013లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. -
ఇరానీ అయినా...ఇటాలియన్ అయినా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్ మళ్లీ నోరు జారారు. అమేథీ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన టీవీ నటి స్మృతి ఇరానీపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘ఇరానీ అయినా, పాకిస్థానీ అయినా... ఇటాలియన్ అయినా, అమెరికన్ అయినా... ఎవరు వచ్చినా ‘ఆప్’నే గెలిపించాలని అమేథీ ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. కుమార్ విశ్వాస్‌కు నోరు జారడం ఇదేమీ కొత్త కాదు. ఇదివరకు మొహర్రం వేడుకలపై వ్యంగ్యాస్త్రాలు సంధించి, ముస్లింల ఆగ్రహాన్ని చవిచూశారు. కేరళ నర్సులపై ఒక ముషాయిరాలో కవిత్వం పేరిట ప్రదర్శించిన పైత్యం ‘యూట్యూబ్’కెక్కడంతో విశ్వాస్‌పై దేశవ్యాప్తంగా విమర్శల జడివాన కురిసింది. అంతకు ముందు హిందూ దేవతలపై, కర్బాలా అమరులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై రామ జన్మభూమి సేవా సమితి కోర్టుకెక్కింది. తాజాగా స్మృతి ఇరానీపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ శ్రేణులు కుమార్ విశ్వాస్‌పై మండిపడుతున్నాయి.