న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, నవీన్ గుప్తా పేర్లను ఆప్ ఖరారు చేసింది. బుధవారం కేజ్రీవాల్ నివాసంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆప్ ఈ ముగ్గురి పేర్లను రాజ్యసభ సభ్యత్వం కోసం ఖరారు చేసినట్లు ప్రకటించింది. కాగా సుశీల్ గుప్తా ఢిల్లీలో పేరున్న వాణిజ్య వేత్త అగ్రసేన్ హాస్పిటల్, అగ్రసేన్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఆయనకు నగరంలో ఆసుపత్రులు, కాలేజీలు ఉన్నాయి. సుశీల్ గుప్తా నెల రోజుల క్రితం వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. అలాగే ఎన్డీ గుప్తా పేరున్న చార్టెడ్ అకౌంటెంట్. ఆయన ప్రస్తుతం ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఉపాధ్యక్షునిగా ఉన్నారు.
కుమార్ విశ్వాస్‌కు మొండిచేయి
పార్టీ సీనియర్ నేత కుమార్ విశ్వాస్‌కు తీవ్ర ఆశాభంగం కలిగింది. కుమార్ విశ్వాస్‌ను రాజ్యసభకు పంపాలని ఆయన మద్దతుదారులు పార్టీపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కుమార్ విశ్వాస్ మద్దతుదారులు రజాయిలు, పరుపులతో పార్టీ కార్యాలయంలో తిష్ట వేసి తమపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించడం పార్టీ నేతలకు రుచించలేదు కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్‌ల మధ్య పెరిగిపోయిన విబేధాల దృష్ట్యా కూడా ఆయనకు రాజ్యసభ సీటు దక్కలేదు. మరోవైపు అశితోష్‌మిశ్రా పేరును కూడా పార్టీ పక్కన పెట్టేసింది. కాగా రాజ్యసభలో మూడు ఢిల్లీ సీట్లకోసం జనవరి 16న ఎన్నిక జరుగనుంది. నామినేషన్లు దాఖలుచేసే తేదీ జనవరి 5న ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment