'సంబంధం' కేసులో ఆప్ నేతకు ఎదురుదెబ్బ
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త అతడిపై చేసిన వివాహేతర సంబంధం ఆరోపణల విసయంలో ఢిల్లీ మహిళా కమిషన్ జారీచేసిన సమన్లపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తనతో వివాహేతర సంబంధం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను కుమార్ విశ్వాస్ ఖండించట్లేదని, దానివల్ల తన కాపురంలో కలతలు వచ్చాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే దానిపై కుమార్ విశ్వాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
ఆమె బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఆపాలని, అలాగే తనకు సమన్లు జారీచేసే అధికారం ఢిల్లీ మహిళా కమిషన్కు ఉందా అంటూ ఆయన ఈ పిటిషన్ వేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కుమార్ విశ్వాస్ తన భార్య, మరో ఇద్దరితో కలిసి కమిషన్ ఎదుట హజరు కావాలంటూ గతంలో సమన్లు జారీచేసింది. తనను నోర్మూసుకుని ఉండాలని, లేనిపక్షంలో సంతోష్ కోలిలాగే హత్యకు గురవుతావంటూ బెదిరించారని ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన కోలీ, 2013లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు.