
నడిపించే నాథుడేడి?
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరికి వారే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య తలనొప్పిగా మారింది. ఈ ప్రాంతంలో పార్టీని ఏకతాటిపైన నడిపే నాయకుడే కరువయ్యాడు. మరోపక్క టీ కాంగ్రెస్ సీనియర్ నేతల్లోనూ సమన్వయం కొరవడింది. పార్టీ నేతలను ఏకతాటిపైన నడి పించాల్సిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో మునిగిపోగా... పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే నాథుడు లేకుండా పోయారు. మరోవైపు పొన్నాల నాయకత్వాన్ని సీనియర్లెవరూ గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యనేత, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్ష పదవి తమకే వస్తుందని చివరి వరకు ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు కుందూరు జానారెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, కె.ఆర్.సురేష్‌రెడ్డి, వి.హనుమంతరావు, జె.గీతారెడ్డి, అలాగే మరో కేంద్ర మంత్రి సర్వేసత్యనారాయణ, జీవన్‌రెడ్డి తదితరులు పార్టీ కార్యక్రమాల విషయంలో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రచార సారథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేరు మొదటి నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ ఆయన కూడా టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించి భంగపడటంతో ఆయనా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. అలాగే మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నారు. పొన్నాల లక్ష్మయ్య గత కొద్దిరోజులుగా నిర్వహిస్తున్న పార్టీ సమీక్షలకు వారు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి? ఏయే కార్యక్రమాలు చేపట్టాలి? విపక్షాల విమర్శలను ఎండగట్టేందుకు ఏం చేయాలి? కేసీఆర్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహమేంటి? అనే విషయంలోనూ వారు పొన్నాలకు సహకరించడం లేదు. ఇటీవల పొన్నాల సీనియర్ నేతల ఇళ్లకు వెళ్లి సహకరించాలని కోరినా... ఆచరణలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
సీమాంధ్రతీరే వేరు...
ఒకవైపు సీమాంధ్రలో పార్టీ నాయకుల వలసలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తున్నా...ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి తదితరులంతా ఒక్కటై ‘బస్ యాత్ర’ పేరుతో జనంలోకి వెళుతున్నారు. విపక్షాల విమర్శలను ఎండగడుతూ తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ విషయానికొస్తే అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. సీమాంధ్రను పణంగా పెట్టి విభజనపై నిర్ణయం తీసుకున్నా...ఆ క్రెడిట్‌ను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఖాతాలో వేయలేని దుస్థితిలో టీ కాంగ్రెస్ నేతలున్నారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారనే భావన తెలంగాణ ప్రజల్లో ఉన్నప్పటికీ, ఆ సానుభూతిని ఓట్ల రూపంలోకి మార్చుకునే కార్యాచరణ కొరవడింది. ఒకవైపు తెలంగాణ చాంపియన్‌ను తానేనంటూ కేసీఆర్ దూకుడుగా ప్రజలను పూర్తిస్థాయిలో తనవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంటే... కాంగ్రెస్ నేతలు మాత్రం తమ తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఎడారిలో చుక్క నీటి కోసం నానా పాట్లు పడినట్లుగా సీమాంధ్రలో ఒక్క సీటు గెలిచే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించకపోయినా పార్టీ నేతలంతా ఒకే తాటిపైకి వచ్చి జనంలోకి వెళుతుంటే.....తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం మెండుగా ఉందని తెలిసినా దానిని అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఉండటం గమనార్హం.
సోనియాకు కృతజ్ఞతలు చెప్పుకోలేని దుస్థితి!
సోనియాగాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే చివరకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక్క బహిరంగ సభ కూడా పెట్టుకోలేని దుస్థితిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నెలరోజులు దాటినా ఈరోజుకూ భారీ బహిరంగ సభ దిశగా అడుగులు వేయకపోవడం గమనార్హం. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఢిల్లీలో సమావేశమై వారం రోజుల్లో హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చే సి సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెబుతామని ముక్తకంఠంతో ప్రకటించారు. అదే విధంగా తెలంగాణలోని నాలుగు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలు చెబుతామని మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే నెలరోజులు గడుస్తున్నా కనీసం ఒక్క సభను కూడా నిర్వహించలేకపోయారు. సభలు ఎప్పుడు పెట్టాలో తేదీలు కూడా ఖరారు చేయులేకపోయూరు.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా సీనియర్లు
టీపీసీసీ అధ్యక్ష నియామకాన్ని చేపట్టకముందు వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లిన జానారెడ్డి కూడా ఇప్పుడు తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలు, పార్టీ నేతల్లోఉన్న రాజకీయ విబేధాలు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలపై రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డి.శ్రీనివాస్‌కు పూర్తి అవగాహన ఉంది. మొన్నటి వరకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు హైకమాండ్ పెద్దలకు వివరిస్తూ....అక్కడి నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి ఈ ప్రాంత నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేవారు. టీపీసీసీ అధ్యక్ష పగ్గాలను పొన్నాల లక్ష్మయ్యకు అప్పగించడంతో కీలక బాధ్యతల విషయంలో హైకమాండ్ పెద్దలు తనను పక్కనపెట్టారని భావించిన డీఎస్ కూడా తనకెందుకులే అని కినుక వహిస్తున్నారు. దీనికితోడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తనను సంప్రదించలేదనే అసంతృప్తి కూడా డీఎస్‌లో నెలకొంది. సీనియర్ నేతలందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. దీనివల్ల తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నైరాశ్యం నెలకొంది. తెలంగాణ వచ్చిందనే సంతోషం ఉన్నా...ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు గట్టి నాయకత్వం కరువైందని వాపోతున్నారు.