
లాస్ట్ చాన్స్
చెన్నై, సాక్షి ప్రతినిధి:
ఎన్నికలు, ఓటు విలువపైనా ప్రజల్లో చైతన్యం పెల్లుబుకడంతో ఈ సారి భారీ సంఖ్యలో కొత్త ఓటర్లు జాబితాలో చేరిపోయారు. చరిత్రలో తొలిసారిగా ఎన్నికల షెడ్యూలు వెలువడిన తరువాత సైతం కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించడం విశేషం.
సాధారణ నమోదు కార్యక్రమం గత ఏడాది అక్టోబరులోనే ప్రారంభం కాగా 23.49 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 5.37 కోట్లకు చేరింది. ఈనెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించడంతో మరో 9.5 లక్షల మంది ఓటర్లుగా మారిపోయారు.
ఈనెల 25వ తేదీ (మంగళవారం) నాటికి తుది అవకాశం ఇచ్చారు. ఇంకా అనేక దరఖాస్తులు పరిశీలించాల్సి ఉండగా వాటిని కలుపుకుంటే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 5.50 కోట్లకు చేరువలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ చెబుతోంది.
వచ్చేనెల 24వ తేదీన జరిగే పోలింగ్‌లోగా కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేయలేకుంటే ఫొటోతో కూడిన స్లిప్పును ఈసీ అధికారులు ఇంటి వద్దనే అందజేస్తారు. సదరు స్లిప్పును చూపి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చు.
పట్టుబడుతున్న నగదు
ఈనెల 5వ తేదీన ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే కోడ్ అమల్లోకి వచ్చింది. ఒక మెజిస్టీరియల్ హోదా కలిగిన అధికారి, నలుగురు సాయుధ పోలీసులు, ఒక వీడియో కెమెరామన్‌తో కూడిన 705 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 705 నిఘా బృందాలు 6వ తేదీనే ఎన్నికల విధుల్లో చేరిపోయాయి. ఈ బృందాలు చేపట్టిన వాహనాల తనిఖీల్లో సోమవారం వరకు రూ.13 కోట్ల నగదు పట్టుబడింది.
వాహనాల సోదాలు, భారీగా నగదు పట్టుకోవడం, పట్టుకున్న నగదుపై సరైన డాక్యుమెంట్లు చూపినా తిరిగి అప్పగించక పోవడం వంటి విమర్శలు ఎన్నికల కమిషన్ చెవిన పడ్డాయి. అంతేగాక అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే అధికారులపై ఈసీ దృష్టి సారించింది. రాష్ట్ర మంత్రి సంపత్ బహిరంగంగా డబ్బులు పంచినట్లు డీఎంకే ఫిర్యాదు చేసేవరకు స్థానిక అధికారులు ఈసీకి చెప్పలేదు.
దీంతో ఈ రాష్ర్ట పోలీసులు, అధికారులు పక్షపాత ధోరణికి పాల్పడతున్నారనే ఆరోపణలు వెల్లువె త్తుతున్న తరుణంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్ పొరుగు రాష్ట్రాల అధికారులపై దృష్టి సారించారు. తమిళనాడు ఎన్నికలు పారదర్శకంగా సాగాలంటే అధికారులను మార్చక తప్పదన్న నిర్ణయంతో 32 బెటాలియన్ల పోలీసులను రప్పించారు.
వారంతా సోమవారం నుంచే విధుల్లో చేరిపోయారు. జిల్లాకో బెటాలియన్ చొప్పున పోలింగ్ ముగిసే వరకు రాష్ట్రంలోనే ఉంటారు. ఇదిలా ఉండగా ఎన్నికల పరిశీలకులుగా వివిధ రాష్టాల నుంచి 39 మంది ఐఏఎస్ అధికారులు తమిళనాడుకు చేరుకోనున్నారు. వీరు సైతం 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతూ అభ్యర్థుల కదలికలు, ఓటర్లను మభ్యపెట్టే చర్చలను అరికడతారు.