మాచర్లలో రెండు వార్డులకు పోలింగ్
మాచర్ల టౌన్, న్యూస్‌లైన్: పట్టణంలోని 21, 22వ వార్డుల్లో శనివారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రెండు వార్డుల్లో మొత్తం 3,611 మంది ఓటర్లు ఉన్నారు. 21వ వార్డులో 1762 మందికి గాను 1459 మంది, 22వ వార్డులో 1849 మందికి గాను 1428 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 21వ వార్డులో 82.8 శాతం, 22వ వార్డులో 77.2 శాతం నమోదైంది. మార్చి 30న పోలింగ్ జరగాల్సిన రెండు వార్డులకు సంబంధించి అన్ని పార్టీల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కారానికి గురికావడంతో రీ నోటిఫికేషన్ ఇచ్చి శనివారం ఎన్నికలు నిర్వహించారు. 21వ వార్డులో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ముక్కా శ్రీనివాసరావు, టీడీపీ అభ్యర్థిగా వీర్ల జ్ఞానయ్య, ఇండిపెండెంట్లుగా మంజుల శ్రీను, వీర్ల నీలమయ్య పోటీపడ్డారు. 22వవార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి బెజ్జం నాగలక్ష్మి, టీడీపీ అభ్యర్థి నక్కా సైదమ్మ, సమాజ్‌వాదిపార్టీ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థి గుంజర్ల లక్ష్మి పోటీలో ఉన్నారు. రెండు వార్డుల్లో ఏడుగురు అభ్యర్థులు తలపడినా వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ తీవ్ర పోటీ నెలకొంది. పోటాపోటీగా అభ్యర్థులు ప్రచార కార్యక్రమం నిర్వహించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేశారు.