
అందరి కళ్లూ మల్కాజ్ గిరి పైనే!
భౌగోళికంగా హైదరాబాద్లోను, పాలనాపరంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోను ఉన్న మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం ఇప్పుడు అందరికీ హాట్ సీటులా కనిపిస్తోంది. దాన్ని ఎగరేసుకుపోవాలని ప్రతి ఒక్కళ్లూ భావిస్తున్నారు. అక్కడి ఓటుబ్యాంకును దృష్టిలో పెట్టుకుని, ఎలాగైనా అక్కడే పోటీ చేయాలని తహతహలాడిపోతున్నారు.
తాజాగా ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ నాగేశ్వర్ చూస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే సన్నిహితులు, మిత్రులతో సంప్రదింపుల పర్వం పూర్తి చేసిన నాగేశ్వర్.. ఏదో ఒక పార్టీ తరపున కాకుండా, తన పంథా, వైఖరి రీత్యా అన్ని వర్గాల మద్దతు పొందేందుకు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన పోటీ చేస్తే మద్దతిస్తామని సీపీఎం బహిరంగంగానే పేర్కొంటుండగా, తమ పార్టీ తరపున పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కోరుతోంది. ఈ స్థానం నుంచి టీడీపీ తరఫున తానంటే, తాను పోటీ చేస్తానని రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక దశలో ఆసక్తి కనబరిచారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా సర్వే సత్యనారాయణ, ఇంకా చాలామంది ఈ స్థానం మీద కన్నేశారు. ఇంతమంది ఆశపడుతున్న మల్కాజ్గిరి, చివరకు ఎవరికి పట్టం కడుతుందో చూడాలి మరి!!