అడ్డంగా దొరికిన జగ్గారెడ్డి
సెల్‌ఫోన్లు, కుక్కర్లు, మిక్సీలు పంపిణీ చేస్తూ దొరికిపోయిన వైనం
నిషేధిత ప్రాంతంలో అనధికారిక సమావేశం
కంటోన్మెంట్ ఎన్నికల స్క్వాడ్ దాడి
వెంటనే జారుకున్న నేతలు
టీవీ 9 స్టిక్కర్ అంటించిన టవేరా సహా పలు వాహనాలు, మద్యం, ఖరీదైన వస్తువులు స్వాధీనం
సమావేశంలో పాల్గొన్న గజ్జెల కాంతం!
సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి చిక్కుల్లో పడ్డారు. నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో సెల్‌ఫోన్లు, ఖరీదైన వస్తువులు పంచుతూ ఎన్నికల అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. సంగారెడ్డి ప్రాంత ప్రజలు, కార్యకర్తలతో ఆయన శనివారం ఇక్కడి గన్‌రాక్ గార్డెన్‌లో సమావేశమయ్యారన్న సమాచారంతో కంటోన్మెంట్ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి లక్ష్మి ఆధ్వర్యంలో పోలీసుల బృందం అక్కడకు చేరుకుంది. ఆ సమయంలో మహిళలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి చర్చిస్తున్నారు. రిటర్నింగ్ అధికారులను గుర్తించిన కార్యకర్తలు, నేతలు ఒక్క ఉదుటన బయటికి లంఘించారు.
వీరితో పాటే జగ్గారెడ్డి సైతం బయటికి వెళ్లిపోయారు. వెంటనే గార్డెన్ ప్రధాన ద్వారాన్ని మూసేసిన అధికారులు.. క్షుణ్నంగా తనిఖీలు జరిపి ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసుకున్న పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 80 సెల్‌ఫోన్లు, సెల్‌ఫోన్లకు సంబంధించిన సుమారు 600 ఖాళీ డబ్బాలు, ఎనిమిది మైక్రోవేవ్ ఓవెన్లు, 3 డీవీడీలు, 8 గ్యాస్‌స్టౌవ్‌లు, 8 మిక్సీలు, ఖరీదైన ఎనిమిది మద్యం బాటిళ్లు, ప్రెషర్ కుక్కర్లు, ఫంక్షన్ హాల్‌కు సంబంధించిన వంటసామగ్రి, వెజిటబుల్ కట్టర్లు, ప్లాస్టిక్ టీపాయ్‌లు తదితరాలు ఉన్నాయి. టీవీ 9 స్టిక్కర్ అంటించిన (ఏపీ 31 టీయూ 839) టవేరా వాహనంతో పాటు పలు వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఏసీపీ మహేందర్, కార్ఖానా, మారేడ్‌పల్లి సీఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
గేటుకు బర్త్‌డే బ్యానర్: గన్‌రాక్ గార్డెన్‌లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు.. గార్డెన్ గేటుకు మాత్రం పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన బ్యానర్ క ట్టారు. తీరా ఎన్నికల అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. బీ-3 కేటగిరీకి చెందిన స్థలంలోని ఓల్డ్ గ్రాంట్ బంగళా అయిన గన్‌రాక్ గార్డెన్‌ను కమర్షియల్ అవసరాలకు వినియోగించడం నిషేధం. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు గతంలోనే స్పష్టం చేసింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గజ్జెల కాంతం రెండు రోజులుగా ఈ గార్డెన్‌లోనే కార్యకర్తలు, నేతలతో మంతనాలు జరుపుతున్నారు. శనివారంనాటి జగ్గారెడ్డి సమావేశంలో కూడా గజ్జెల కాంతం పాల్గొన్నారు. అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ దాడి చేయడానికి కొద్ది క్షణాల ముందు ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.