- జగన్‌కు జనం ఆశీస్సులు
- రైతులు, మహిళలు, యువత,వృద్ధుల బ్రహ్మరథం
- జనసాగరంలా జగ్గయ్యపేట జనభేరి
- జిల్లాలో ఊపందుకున్న ‘ఫ్యాన్’ స్పీడ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ముస్లింలు పెద్దఎత్తున వచ్చి వైఎస్సార్ సీపీలో చేరారు. వేదపండితులు ఎదురొచ్చి ఆశీస్సులు అందించారు. క్రైస్తవులు నిండు మనస్సుతో ప్రార్థనలు చేశారు. జననేత వైఎస్.జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటూ.. వారంతా ధీమా వ్యక్తంచేశారు. మహిళలు, యువత, వృద్ధులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయం మనదేనంటూ.. జగన్‌మోహనరెడ్డికి బ్రహ్మరథం పట్టారు.
‘వైఎస్సార్ సీపీ జనభేరి’ కార్యక్రమం శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్‌షోకు, బహిరంగ సభకు అపూర్వ స్పందన లభించింది. వృద్ధులు, పిల్లలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు వేలాదిగా తరలిరావడంతో జగ్గయ్యపేట జనసాగరాన్ని తల పించింది. సామినేని ఉదయభాను ఇంట్లో బస చేసిన జగన్‌మోహనరెడ్డిని ముస్లింలు కలిసి వైఎస్సార్ సీపీలో చేరారు.
గట్టు భీమవరం ఉప సర్పంచి షేక్ ఇమాం ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు చెందిన ముస్లింలు జగన్‌మోహనరెడ్డిని కలిసి వైఎస్సార్ సీపీలో చేరారు. గోపినేనిపాలెంలో అక్బర్, ఎస్‌కే రఫీ ఆధ్వర్యాన పది కుటుంబాల ముస్లింలు ఆ పార్టీలో చేరారు. ముస్లింలను ఊచకోత కోసిన నరేంద్రమోడీతో చంద్రబాబు జట్టు కట్టడం దారుణమని, ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిని ముస్లింలు ఓడిస్తారని పలువురు పెద్దలు ప్రకటించారు.
జగన్‌ను కలిసిన నేతలు
వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రెహ్మాన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తాతినేని పద్మావతి, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సహాయ కో-ఆర్డినేటర్ జొన్నాల శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు తదితరులు జగన్‌మోహనరెడ్డిని కలిశారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం సారసింహపల్లి సర్పంచి రవికుమార్‌రెడ్డి, పీవీ శివారెడ్డి, లక్ష్మీపతిరెడ్డి, రాజేంద్రరెడ్డిలతోపాటు ఆ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు నూర్‌బాబా కూడా జగన్‌ను కలిశారు.
ఐదు రోజులు..
వైఎస్సార్ జనభేరి పేరుతో ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి అందరినీ ఆకట్టుకున్నారు. ఎండలు మండిపోతున్నా... క్షణం విశ్రమించక ఆయన ప్రజల్లోకి వెళ్లి పార్టీ అభ్యర్థుల విజయం కోసం నిర్వహించిన ప్రచారానికి అద్భుత ప్రజాదరణ లభించింది. ఐదు రోజులపాటు జిల్లాలో మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తొలి రోజున గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించిన జగన్ మిగిలిన నాలుగు రోజులు చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరు, బంటుమిల్లి, కైకలూరు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేటలలో సభలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఆయన నిర్వహించిన రోడ్‌షోలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. సభలకు వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను మచిలీపట్నం, విజయవాడ, ఏలూరు ఎంపీ అభ్యర్థులు కొలుసు పార్థసారథి, కోనేరు రాజేంద్రప్రసాద్, తోట చంద్రశేఖర్‌లను గెలిపించాలని జగన్‌మోహనరెడ్డి కోరారు.
గన్నవరం, అవనిడ్డ, పామర్రు, పెనమలూరు, పెడన, కైకలూరు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థులు దుట్టా రామచంద్రరావు, సింహాద్రి రమేష్‌బాబు, ఉప్పులేటి కల్పన, కేవీఆర్ విద్యాసాగర్, బూరగడ్డ వేదవ్యాస్, ఉప్పాల రామ్‌ప్రసాద్, కొక్కిలిగడ్డ రక్షణనిధి, జోగి రమేష్, సామినేని ఉదయభానును గెలిపించాలంటూ ఓటర్లను కోరారు.
జగన్‌మోహనరెడ్డి తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించినప్పటికీ జిల్లాలో మిగిలిన మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, నందిగామ, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలోనూ ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నిండింది. జిల్లా అంతటా జగన్‌మోహనరెడ్డి ప్రచార ప్రభావం పడటంతో ఫ్యాన్‌గాలి మరింత వేగం పెరిగిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఐదు రోజుల్లో మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన చేసిన ఎన్నికల పర్యటనతో ఫ్యాన్ గాలి మరింత పెరిగింది.
వాడివేడిగా ఉపన్యాసం..
నడినెత్తిన మండుతున్న ఎండను తలపిస్తూ వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఉపన్యాసం వాడివేడిగా సాగింది. జగ్గయ్యపేట సభలో ప్రచండభానుడిలా జగన్‌మోహనరెడ్డి తన ఉపన్యాసంలో మోడీ, చంద్రబాబు, సుష్మస్వరాజ్‌లపై నిప్పులు చెరిగారు. తెలంగాణ తెచ్చింది తామేనని అక్కడ చెప్పిన చంద్రబాబు, చిన్నమ్మను గుర్తుపెట్టుకోవాలంటూ పార్లమెంటు సాక్షిగా కోరిన సుష్మస్వరాజ్ ఇప్పుడు మాట మార్చి రాష్ట్ర విభజన పాపం తనకు అంటగడుతున్నారని మండిపడ్డారు.
సోనియా, మోడీ, సుష్మ, చంద్రబాబు ఓట్లు.. సీట్ల కోసం ఏ గడ్డి అయినా కరుస్తారని, రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీలుస్తారని, ఎంతకైనా తెగిస్తారని ధ్వజమెత్తారు. విలువలు, విశ్వసనీయత ఒకవైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉన్నాయని, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఒక్క క్షణం ఆలోచించి ఓటేయాలని కోరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జయం మనదేనని ప్రకటించారు.
తనకు అవకాశం ఇస్తే దివంగత వైఎస్ ఆశీస్సులతో రాష్ట్ర దశ దిశ మారుస్తానని చెప్పారు. ఐదు సంతకాలతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, రైతులు, కార్మికులు అన్నివర్గాల వారి తలరాత మారుస్తానని జగన్ మోహనరెడ్డి భరోసా ఇచ్చారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఉదయభానుకు ఓటేసి గెలిపిస్తే ఐదేళ్లు నిస్వార్థ సేవచేస్తారని తెలిపారు.