పల్లెసీమలు విలక్షణమైన తీర్పునిచ్చాయి. పట్టణ ఓటర్లు టీడీపీకి కొద్దిపాటి మొగ్గు చూపగా.. గ్రామీణులు వైఎస్సార్‌సీపీని అక్కున చేర్చుకున్నారు. పుర పోరులో తెలుగుదేశం దూకుడుకు పరిషత్ ఫలితాల్లో కళ్లెం పడింది. నువ్వా - నేనా అన్నట్టుగా ‘దేశం’కు దీటుగా వైఎస్సార్ సీపీ దూసుకొచ్చింది. ఎక్కడికక్కడ ‘దేశం’ స్పీడుకు బ్రేకులేస్తూ ఫ్యాన్ గాలి జోరు కన్పించింది. చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా సాగింది. బ్యాలట్ బాక్సుల్లోకి నీరు చేరడంతో కాకినాడ, రామచంద్రపురం కేంద్రాల్లో కలకలం రేగింది. కాకినాడ సెంటర్‌లో కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొవ్వొత్తుల వెలుగులోనే కౌంటింగ్ కొనసాగించారు.
సాక్షి, కాకినాడ :జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రామచంద్రపురం, పెద్దాపురం, రంపచోడవరంలలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కౌంటింగ్ చేపట్టారు. ఉదయం ఎనిమిది గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ తొమ్మిది గంటలకు కానీ చాలాచోట్ల బ్యాలట్ బాక్సులు తెరవడమే ప్రారంభించలేదు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా బ్యాలెట్ బాక్సులు తెరవడం.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను వేరు చేయడం..జంబ్లింగ్ పద్దతిలో వాటిని కలిపి కట్టలు కట్టడం వంటి ప్రక్రియ పూర్తయ్యేందుకు మధ్యాహ్నం 12 గంటలయింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఫలితాలు ప్రకటించారు. తమను కౌంటింగ్ కేంద్రంలోకి ఎందుకు అనుమతించడం లేదంటూ పెద్దాపురం కౌంటింగ్ సెంటర్ వద్ద ఏజెంట్లు ఆందోళన చేశారు. ఆర్డీఓ కూర్మనాథ్ వచ్చి వారితో చర్చలు జరిపి లోనికి అనుమతించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇక్కడ మధ్యాహ్నం మూడు గంటల వరకు కౌంటింగ్ ప్రారంభం కాలేదు.
తడిసిపోయిన బ్యాలట్ పత్రాలు
కాకినాడ, రామచంద్రపురం కౌంటింగ్ కేంద్రాల్లో పలు బ్యాలట్ బాక్సుల్లో నీరు చేరడంతో బ్యాలట్ పత్రాలు తడిసిపోయాయి. దీంతో ఈ రెండుసెంటర్లలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ప్రజాతీర్పును భద్రపర్చడంలో ఇంత నిర్లక్ష్యమా అంటూ అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. కాకినాడలోని వీఎస్ లక్ష్మీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌లలో ఉంచిన పెదపూడి మండలం పెద్దాడకు చెందిన మూడు బాక్సుల్లో 2222, రాజుపాలెంకు చెందిన ఒక బాక్సులో 1300, జి.మామిడాడ-2కు సంబంధించి రెండుబాక్సుల్లో 1607, జి.మామిడాడ-3కు సంబంధించి రెండు బాక్సుల్లో 1693, జి.మామిడాడ 4కు సంబంధించి రెండు బాక్సు ల్లో 1661 చొప్పున మొత్తం 8483 బ్యాలట్ పత్రాలు తడిసిపోయాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలట్ పత్రాలు ఒకదానికొకటి అంటుకుపోయాయి.
చిరిగిపోకుండా వీటిని విడదీయడానికి సిబ్బంది కొంత ఇబ్బంది పడ్డారు. ఫోన్‌లో విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూప్రసాద్‌కు తెలియజేయగా, ఆమె హుటాహుటిన కేంద్రానికి చేరుకొని బ్యాలట్ పత్రాలను పరిశీలించారు. అప్పటికప్పుడు మార్కెట్ నుంచి డ్రయ్యర్స్ రప్పించి ఆరబెట్టి బ్యాలట్ పత్రాలు విడదీశారు. ఆరిన అనంతరం వాటిపై ఓటర్లు వేసిన స్వస్తిక్ ఓటు ముద్రలను అభ్యర్థులకు చూపించారు. అన్నీ సవ్యంగా ఉండడంతో లెక్కించేందుకు అభ్యర్థులు అంగీకరించారు. బాగా ఆరిన తర్వాత వాటి లెక్కింపు చేపట్టారు. రామచంద్రపురం వీఎస్‌ఎం కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపర్చిన కపిలేశ్వర పురం మండలం వడ్లమూరు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి 41/9 బ్యాలట్‌బాక్స్‌లో కూడా ఇదే రీతిలో 535 బ్యాలట్ పత్రాలు తడిసిపోయాయి. ఇక్కడ కూడా వీటిని ఆరబెట్టిన అధికారులు రాత్రి తొమ్మిది గంటల సమయంలో అభ్యర్థుల సమక్షంలో లెక్కించారు.
ఆత్రేయపురం మండలం మర్లపాలెంలో రెండు ఓట్ల తేడాతో టీడీపీ నెగ్గినట్టుగా అధికారులు ప్రకటించారు. ఏజెంట్లకు ఇచ్చిన చార్ట్‌లో ఉన్న ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య 40 ఓట్ల తేడా ఉండడంతో ఆ ఓట్లు ఏమయ్యాయంటూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఆందోళన చేపట్టి రీ పోలింగ్‌కు డిమాండ్ చేశారు. అక్కడ రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో రీ పోలింగ్ చేపట్టారు. నార్కెడ్‌మిల్లిలో కూడా ఇదే రీతిలో 10 ఓట్ల తేడాతో టీడీపీ నెగ్గినట్టుగా ప్రకటించారు. రీ కౌంటింగ్ చేయమని వైఎస్సార్ సీపీ ఏజెంట్లు డిమాండ్ చేసినా టీడీపీ నేతలకు కొమ్ముకాసిన అధికారులు ససేమిరా అంటూ ఫలితాన్ని ప్రకటించారు. కాకినాడ కౌంటింగ్ కేంద్రంలో రాత్రి ఏడున్నర గంటల సమయంలో కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెంటర్‌లో పూర్తిగా అంధకారం అలముకోవడంతో కొద్దిసేపు కౌంటింగ్‌ను నిలిపివేశారు.
ఎంతకీ విద్యుత్ రాకపోవడంతో కొవ్వొత్తుల వెలుగులో కౌంటింగ్ కొనసాగించారు. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. దాదాపు అన్ని కేంద్రాల్లో సరైన వసతి సౌకర్యాల్లేక ఏజెంట్లు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.మరుగు సౌకర్యం లేక మహిళా సిబ్బంది ఇబ్బందిపడగా, తాగునీరు, సరైన ఆహార ఏర్పాట్లు లేకపోవడంతో ఎండవేడిమి తట్టుకోలేక అభ్యర్థులు, వారి ఏజెంట్లు తీవ్ర అవస్థలపాలయ్యారు.
ప్రాదేశికంలోనూ..పైచేయి...
Published Wed, May 14 2014 1:27 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement