ఓటెత్తిన చైతన్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :ఏలూరు నగరపాలక సంస్థ, 7 ముని సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఆది వారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 5,68,448 మంది ఓటర్లు ఉండగా, 4,33,354 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76.38 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పాలకొల్లులో 82.57 శాతం ఓట్లు పోల య్యాయి. నరసాపురం, కొవ్వూరు మునిసిపాలిటీల్లోనూ 80 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో అత్యల్పంగా 73.85 శాతం ఓట్లు పోల య్యాయి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచి జనం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పేద, మధ్యతరగతి వర్గాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉదయం వేళల్లో మహిళా ఓట ర్లు, వృద్ధులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఏలూరు నగరంలో ఉదయం నుంచే పోలింగ్ భారీగా నమోదైంది. తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లులో ఉదయం మందకొడిగా పోలింగ్ జరగ్గా, మధ్యాహ్నం నుంచి ఊపందుకుంది. ఏలూరు 24వ డివిజన్‌లోని సెయింట్ గ్జేవియర్ హైస్కూల్‌లో జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఉదయూన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అంతా ప్రశాంతం
పోలింగ్ సందర్భంగా జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. చిన్నపాటి వివాదాలు మినహా పోలింగ్ ఆద్యంతం అధికారుల నియంత్రణలోనే ప్రశాంతంగా సాగింది. భీమవరంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
కొవ్వూరులో దొంగ ఓట్ల కలకలం
కొవ్వూరు మునిసిపాలిటీలోని 10వ వార్డులో టీడీపీ కార్యకర్త దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించి దొరికిపోయాడు. మరో వ్యక్తి కూడా తన కుమారుడి ఓటును తాను వేసేం దుకు ప్రయత్నించి అధికారుల కంటపడ్డాడు. అయితే వారిని హెచ్చరించి వదిలేశారు. కొవ్వూరు, నరసాపురం మునిసిపాలిటీలు మినహా మిగిలిన 7 పట్టణాల్లో సాయంత్రం 5గంటలకల్లా పోలింగ్ ముగి సింది. కొవ్వూరు 20వ వార్డులోని జనం సాయంత్రం 4 గంటలకు ఒకేసారి పోలింగ్ కేంద్రానికి రావడంతో రాత్రి 8.15 గంటల వరకు పోలింగ్ జరిగింది. నరసాపురం 15వ వార్డులో రెండు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఒకటే ఏర్పాటు చేయడంతో పోలింగ్ రాత్రి 8గంటల వరకూ కొనసాగింది. తణుకులో 01, 14, 34 వార్డుల్లో ఉదయం కాసేపు ఈవీఎంలు మొరాయించాయి. జంగారెడ్డిగూడెం 14 వ వార్డులో దాదాపు గంటపాటు ఈవీఎం పనిచేయలేదు. నిడదవోలు 23వార్డు గాంధీనగర్‌లో పోలింగ్ 20 నిమిషాలు ఆల స్యంగా ప్రారంభమైంది. కిరణా మర్చంట్స్ హాల్, 4వ వార్డులోని ఐటీఐ కాలేజీలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఎండలోనే నిలబడి ఓటు వేశారు. చాలాచోట్ల పోలీసులు హడావుడి చేయడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్లలోపు జనాన్ని ఉండనీయకూడదనే నిబంధన వల్ల సాధారణ జనం ఓటు వేయడానికి జంకుతూ వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
