ఉత్కంఠకు తెర
Published Wed, Apr 2 2014 3:44 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
9న మున్సిపల్ ఓట్ల లెక్కింపు చేపట్టాలన్న హైకోర్టు
స్ట్రాంగ్ రూముల వద్ద భారీ బందోబస్తుకు చర్యలు
దేశం నియోజకవర్గ ఇన్‌చార్జిల్లో భయాందోళన
చైర్మన్ ఎన్నిక తేదీపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
సాక్షి, గుంటూరు :మున్సి‘పోల్స్’ ఓట్ల లెక్కింపుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 9వ తేదీనే పురపాలక సంఘ ఓట్ల లెక్కింపు నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. పురపాలక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ రెండున అన్ని మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో లెక్కింపు నిలిచిపోతుందని ప్రచారం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా ఉన్న అభ్యర్థులు ఓట్ల లెక్కింపు వెంటనే జరిగితే తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తే, ఓటమి భయం ఉన్న అభ్యర్థులు మాత్రం సార్వత్రిక
ఎన్నికల తరువాత లెక్కింపు చేపడితే బాగుంటుందని కోరుకున్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికల అనంతరం వెల్లడించేలా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికనుగుణంగా మున్సిపల్ ఓట్ల లెక్కింపు కూడా సార్వత్రిక ఎన్నికల తరువాతనే చేపట్టేలా హైకోర్టు తీర్పు ఇస్తుందని అంతా భావించారు. అయితే హైకోర్టు అనూహ్యంగా ఈ నెల 9న లెక్కింపు చేపట్టాలనివెల్లడించడంతో 368 వార్డుల్లో 1456 మంది అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది.వీఎంలు భద్రం.. ఇదిలావుండగా, హైకోర్టు తీర్పుతో జిల్లా అధికారులు ఎక్కడి ఈవీఎంలను అక్కడే భద్రంగా ఉంచి ఆయా ప్రాంతాల్లోనే ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతతోపాటు లెక్కింపు రోజు భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ఐజీ సునీల్ కుమార్ నేతృత్వంలో అర్బన్, రూరల్ ఎస్పీలు గోపినాధ్ జెట్టి, జె.సత్యనారాయణలు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
‘దేశం’ భయాందోళన...
సార్వత్రిక ఎన్నికలకు ముందు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైతే తమ సీట్లకే ఎసరు వస్తుందనే ఆందోళనలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఉన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు వాయిదా పడడంతో ఊరట చెందిన టీడీపీ నేతలకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి ఈ నెల 9న వెలువడే ఫలితాలతో తుడిచిపెట్టుకుపోతుందనే భయాందోళనలో టీడీపీ నేతలు ఉన్నారు.
చైర్మన్ ఎన్నిక తేదీపై ప్రతిష్టంభన
ఆదివారం జరిగిన 12 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు ఈనెల 2న వెలువడి, 7న చైర్మన్ అభ్యర్థి ఎన్నిక జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ ఓట్ల లెక్కింపు ఈ నెల 9న నిర్వహించనున్నారు. చైర్మన్ అభ్యర్థి ఎన్నిక ఎప్పుడు అనేది ఇంకా తెలియలేదని మున్సిపల్ ఆర్డీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో చైర్మన్ ఎన్నిక తేదీపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ఊపందుకున్న బెట్టింగులు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జోరుగా పందేలు కాస్తున్నారు. ఏ మున్సిపాలిటీని ఏ పార్టీ గెలుచుకుంటుంది, ఏ పార్టీకి ఎన్ని వార్డులు వస్తాయి, ఏ వార్డులో ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీ వస్తుంది, అనే అంశాలపై బెట్టింగ్‌లు కడుతున్నారు. 9న ఓట్ల లెక్కింపు జరగనుండటంతో ఎనిమిది రోజుల సమయం వుందని పందేల జోరు పెంచారు.
Advertisement
Advertisement