సాక్షి, అనంతపురం : రాహుల్ గాంధీ సభకు జన సమీకరణ చేసేందుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి నానా పాట్లు పడుతున్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుతో జిల్లా వాసులు ఆ పార్టీ అంటేనే మండిపడుతున్నారు. విభజన నిర్ణయం తర్వాత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న రాహుల్‌ను ప్రసన్నం చేసుకునేందుకు రఘువీరా తలపట్టుకుంటున్నారు. జిల్లా నుంచి ఎలాగూ జనం రారన్న అంచనాకొచ్చిన రఘువీరా.. పక్క రాష్ర్టం నుంచి జనాన్ని తరలించేనిలో పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం హిందూపురంలో రాహుల్ గాంధీ సభ జరగనుంది.
విభజన తర్వాత అనంతలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడింది. అనంతరం ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారంతా దాదాపు కొత్త ముఖాలే. కనీసం ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఆ పార్టీ అభ్యర్థులను ఆదరించేవారే కరువయ్యారు. కాంగ్రెస్‌లో కొనసాగితే భవిష్యత్ ఉండదని గ్రహించిన90 శాతం మంది ద్వితీయ శ్రేణి చీదరించుకుంటున్నారు. పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. తనకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నా ఎవరూ స్పందించడం లేదు. సమైక్య ఉద్యమకారులు, ఉద్యోగులు రఘువీరా మాటల్ని గుర్తుకు తెచ్చుకుని ‘అప్పుడలా అన్నారు.. ఇప్పుడేమో కుటుంబ సభ్యులంతా రోడ్లమీదకొచ్చి ఓట్ల కోసం పాకులాడుతున్నారు’ అని వ్యాఖ్యానిస్తున్నారు. తన ప్రచారానికి అనుకున్నంత స్పందన లేకపోయేసరికి ఓటర్లకు డబ్బు ఎర వేస్తున్నారు.
కొంత మంది పోలీసులను లోబరుచుకుని ఓటర్లకు డబ్బు పంపిణీ యథేచ్ఛగా సాగిస్తున్నారు. పుట్టపర్తి సత్యసాయి మృతి చెందినపుడు చోటుచేసుకున్న హైడ్రామా వల్ల, పెనుకొండ కాళేశ్వర్ మృతి ఘటనల్లో ఈ మాజీ మంత్రి భారీగా లబ్ధి పొందారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఇపుడా డబ్బులో రెండు మూడు శాతం ఖర్చు చేసి అయినా సరే విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన అనుచరులు కొందరు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం నేపథ్యంలో ఆయన ఖర్చుకు వెరవకుండా డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా సీమాంధ్రలో తానొక్కడినైనా గెలవకపోతే ‘అమ్మ’ వద్ద పరువుపోతుందని ఆయన వాపోతున్నారట.
ఇందులో భాగంగా ఒక వైపు బెదిరింపులు.. మరో వైపు డబ్బు ఆశ చూపుతున్నా గ్రామ స్థాయి నేతలు, ఓటర్లు కన్నెత్తి చూడక పోవడం ఆయనను ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తినేతలను గుర్తించి భారీ ప్యాకేజీలతో తన వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు అధిష్టారం పార్టీ ఫండ్ పంపినా ఆ మొత్తాన్ని ఇతర అభ్యర్థులకు ఇవ్వకుండా తన నియోజకవర్గంలో ఖర్చు పెట్టి ఎలాగైనా విజయం సాధించాలన్న ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. అయితే చాలా మంది ఓటర్లు తిరస్కరిస్తుండటంతో ఏం చేయాలో ఆయన వర్గీయులకు పాలుపోవడం లేదు.
కాగా, టీడీపీ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి తిరిగి పోటీ చేస్తున్నారు. ఆయనపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2009 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది టీడీపీ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శంకరనారాయణ విజయానికి కృషి చేస్తున్నారు. మహానేత వైఎస్ పథకాలు, జననేత జగన్ నాయకత్వంలో శంకరనారాయణ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ పెనుకొండలో పర్యటించినప్పుడు.. శంకరనారాయణను గెలిపిస్తే క్యాబినెట్‌లోకి తీసుకుంటానని ప్రకటించడం కీలకంగా మారింది. అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతం ఆయన మంత్రి అయితే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లు యూ టర్న్ తీసుకుని ఫ్యాన్ జోరును పెంచుతున్నారు. డబ్బుతో ఏదైనా సాధించవచ్చనుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరాకు, అభివృద్ధి గురించి పట్టించుకోని టీడీపీ అభ్యర్థి పార్థసారధికి తగిన శాస్తి చేస్తామని స్థానికులు బాహాటంగా చెబుతున్నారు.
పరువు కోసం పాకులాట!
Published Wed, Apr 30 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
Advertisement