నరసన్నపేట... నాలుగు స్తంభాలాట
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నరసన్నపేట నియోజకవర్గంలో ఆది నుంచి నాలుగు కుటుంబాల మధ్యే ఎన్నికల పోరు సాగుతోంది. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంత వరకూ ఒక సారి తప్ప మిగిలిన ఎన్నికల్లో శిమ్మ ప్రభాకరరావు, ధర్మాన ప్రసాదరావు, డోల సీతారాములు, బగ్గు లక్ష్మణరావు కుటుంబాల వారే బరిలో దిగుతున్నారు.
తాజా ఎన్నికల్లో కూడా వీరే పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి బగ్గు లక్ష్మణరావు దూరపు బంధువు ఈ సారి పోటీ చేస్తుండడంతో కొత్త ముఖం వచ్చినట్లు అయింది. ఈ నాలుగు కుటుంబాల వారు ఒక్కోసారి ఒకరిపై ఒకరు, మరోసారి ఒకే వర్గంగా ఉంటూ ఎన్నిల్లో తలపడుతన్నారు. శిమ్మ ప్రభాకరరావు రెండు సార్లు, ఆయన తండ్రి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా పదవి చేపట్టగా, ధర్మాన ప్రసాదరావు, ఆయన అన్న కృష్ణదాసులు ఐదు పర్యాయాలు ఎన్నికయ్యారు.
బగ్గు లక్ష్మణరావు, ఆయన తల్లి సరోజనమ్మ ఒక్కోసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. డోల సీతారాములు ఒక పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. 1972లో బగ్గు సరోజనమ్మ ఇండియన్ కాంగ్రెస్ తరఫున, ధర్మాన లజపతిరాయ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో రాజకీయాల్లోకి మరో రెండు కుటుంబాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో శిమ్మ జగన్నాథంపై సరోజనమ్మ గెలిచారు. 1978లో శిమ్మ జగన్నాధం, బగ్గు సరోజనమ్మలతో పాటు డోల సీతారాములు పోటీకి దిగారు.
దీంట్లో అనూహ్యంగా సీతారాములు విజయం సాధించారు. 1985లో కాంగ్రెస్ టిక్కెట్ యువకుడైన లజపతిరాయ్ సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు లభించింది. అప్పట్లో స్వల్ప తేడాతో శిమ్మ ప్రభాకరరావు విజయం సాదించారు. 1989లో మరోసారి వీరిద్దరి మధ్యే పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో బగ్గు లక్ష్మణరావు ధర్మాన శిబిరంలో చేరారు. దీంతో ధర్మాన సునాయాసంగా విజయం సాధించారు.
1994 ఎన్నికల్లో టీడీపీ శిమ్మ ప్రభాకరరావుకు బదులు బగ్గు లక్ష్మణరావుకు టిక్కెట్ ఇచ్చింది. శిమ్మ, బగ్గు కుటుంబాలు ఎన్నికల్లో కలిశారు. దీంట్లో ధర్మానకు రెండో ఓటమి ఎదురైంది. అప్పటి నుంచి 2009 వరకూ ధర్మాన, బగ్గు కుటంబాల మధ్యే పోటీ జరిగింది.
1999లో ధర్మాన, బగ్గు లక్ష్మణరావులు పోటీ పడగా 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రసాదరావు అన్న కృష్ణదాసు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయగా ధర్మాన శ్రీకాకుళం వెళ్లి అక్కడ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కృష్ణదాసు విజయం సాధించారు.
అనంతరం 2009లో కూడా వీరిద్దరి మధ్యే పోటీ జరిగింది. ప్రజారాజ్యం తరఫున సీతారాములు కుమారుడు జగన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కృష్ణదాసు, శిమ్మ ప్రభాకరరావులు ఒకే శిబిరంలోకి వచ్చారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో కృష్ణదాసుతో బగ్గు లక్ష్మణరావు అల్లుడు శిమ్మ స్వామిబాబు తలపడ్డారు. తాజా ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాసు, బగ్గు రమణమూర్తి, డోల జగన్ పోటీ చేస్తున్నారు.