
ఫలితాలు వచ్చినా...క్యాంపులు తప్పవు
సాక్షి, చిత్తూరు: మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చినా క్యాంపు రాజకీయాలు తప్పేలా లేవు. ఇప్పటివరకు ఎన్నికల్లో గెలిస్తే చాలనుకున్న ప్రధాన రాజకీయ పార్టీలకు మరో కష్టం వచ్చి పడింది. మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను జూన్ మొదటి వారంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాతే చేపట్టాల్సి ఉంది. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే, ఎంపీలకు ఓటు హక్కు ఉండడంతో కొత్త అసెంబ్లీ, లోక్‌సభ ఏర్పడిన తరువాతే ఈ ఎన్నిక జరపాల్సి ఉంది.
దీంతో చైర్మన్ పదవులు ఆశిస్తున్న వారికి గెలిచిన అభ్యర్థులు జారిపోకుండా క్యాంపు రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత గెలిచిన అభ్యర్థులు జారిపోకుండా చూసుకోవడం, అదే సమయంలో సంఖ్యపరంగా తమకు ఎక్కడైనా తేడా వస్తే స్వతంత్రుల మద్దతు కూడగట్టుకోవడం వంటివి అవసరం. ఈ క్రమంలో దాదాపు 20 రోజుల పాటు అభ్యర్థులను బయటి ప్రాంతాల్లో తిప్పుతూ ప్రత్యర్థులకు దొరక్కుండా చేయటం కూడాప్రధాన రాజకీయ పార్టీలకు ముఖ్యమైన అంశంగా ఉంది.
క్యాంపు రాజకీయాలకు ఊపు
జిల్లాలో ఒక్కసారిగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. ఫలితాల అనంతరం ఆధిపత్యం సాధించాలంటే క్యాంపు రాజకీయాలు తప్పనిసరి. దీంతో గతంలో జరిగిన తరహాలోనే ఈసారి కూడా క్యాంపు రాజకీయాలకు రాజకీయ పార్టీలు తెరలేపనున్నాయి. గెలిచే అభ్యర్థులను తీర్థయాత్రలకు తీసుకెళ్లటమా, పర్యాటక ప్రాంతాలకు పంపటమా ? లేదా జిల్లాలోనే ఒక క్యాంపు ఆర్గనైజ్ చేసి అక్కడే గెలిచిన వారిని ఉంచడమా అనే ఆలోచనలతో వివిధ పార్టీల నాయకులు ముఖ్యంగా ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు తర్జనభర్జన పడుతున్నారు. ఇందుకోసం ముందుగానే సన్నాహాలు కూడా ప్రారంభించారు.
ఠారెత్తిపోతున్ననియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు
ఇప్పటికే వరుస ఎన్నికలతో ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. డబ్బులు సర్దలేక తంటాలు పడిన ప్రధానపార్టీల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఇప్పుడు మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను క్యాంపులకు తీసుకెళ్లాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖర్చు వ్యవహారమంతా ఆయా చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ ఆశావహులకే వదిలేయడమా ? లేక పార్టీ తరఫున నిధులు అడగాలా ? అన్న సందేహం లో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేరు. అందరూ వెనుకంజ వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో పార్టీ ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదని, ఇప్పుడు ఎవరో కుర్చీ ఎక్కేందుకు తాము ఎందుకు డబ్బులు ఖర్చు చేయాలని ఒకరిద్దరు టీడీపీ కీలక నాయకులు ఉసూరుమంటున్నారు.