సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఈనెల 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరిరోజైన బుధవారం జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజు నామినేషన్లు దాఖలు చేయడంతో నియోజకవర్గ కేంద్రాలు పార్టీల ర్యాలీలు, డప్పుచప్పుళ్లు, నినాదాలతో హోరెత్తిపోయాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నుంచి టికెట్టు ఆశించి భంగపడిన వారు, పలువురు ఇండిపెండెట్లు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థులుగా పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, వైరా నుంచి మదన్‌లాల్, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు నుంచి డాక్టర్ రవిబాబు నాయక్, సత్తుపల్లి నుంచి డాక్టర్ మట్టా దయానంద్ నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ఆయాప్రాంతాలలో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు భారీర్యాలీలు నిర్వహించి సందడి చేశాయి.
కాగా, జిల్లా కేంద్రమైన ఖమ్మంలో నామినేషన్ల దాఖలుకు చివరిరోజున అగ్రనాయకులంతా నామినేషన్లు వేశారు. ఖమ్మం పార్లమెంటుకు... సీపీఐ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.
ఖమ్మం అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ తరపున పువ్వాడ అజయ్‌కుమార్, టీఆర్‌ఎస్ నుంచి ఆర్‌జేసీ కృష్ణ తదితరులు నామినేషన్లు వేయడంతో జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది. అయితే, నామినేషన్ల దాఖలు సమయంలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య అవగాహన కొరవడినట్టు కనిపించింది. సీపీఐ తరపున ఎంపీ, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయా పార్టీల నేతలనే వెంట తీసుకెళ్లి నామినేషన్లు వేశారు. నారాయణ దాఖలు చేసే సమయంలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా లేకపోవడం గమనార్హం. టీడీపీ ఎంపీ అభ్యర్థి నామా కూడా తన వర్గం నేతలను మాత్రమే వెంటబెట్టుకువెళ్లి నామినేషన్ వేశారు. తుమ్మల వర్గీయులెవరూ వెళ్లలేదు. అయితే, ఆయన మాత్రం స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ కార్యక్రమానికి వెళ్లి తన చేతుల వీదుగా పత్రాలను ఎన్నికల అధికారికి అందజేయడం గమనార్హం.
నామినేషన్ల చివరి రోజు హైలైట్స్
తన నామినేషన్ కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లిన నామా నాగేశ్వరరావుపై బాలసాని అనుచరులు ఫైర్ అయ్యారు. మానాయకునికి టికెట్ రాకుండా చేశావంటూ ఆయనను దూషించారు. ఇంటికి వెళ్లినా బాలసాని ఆయనను కలవలేదు. దీంతో చేసేదేమీలేక నామా వెళ్లిపోయారు.
ఇల్లెందు టీడీపీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య టీఆర్‌ఎస్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ అధినేత అంగీకరించకపోవడంతో ఆయన పార్టీ మారి మళ్లీ బరిలో నిలిచారు.
సత్తుపల్లి నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవి వెంట జలగం వెంకట్రావు వర్గీయులెవరూ కనిపించలేదు. రవి మాత్రం జలగం వెంగళరావు విగ్రహానికి పూలమాలలు వేసి నామినేషన్ సమర్పించారు.
భద్రాచలంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మారిపోయారు. మంగళవారం రాత్రి విడుదల చేసిన జాబితాలో అక్కడి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థినిగా ఝాన్సీరాణి పేరును ప్రకటించారు. కానీ బీ-ఫాం మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన మానె రామకృష్ణకు ఇచ్చారు. దీంతో ఝాన్సీరాణి విలేకరుల ఎదుట తన ఆవేదనను వెళ్లబుచ్చారు.
ఇల్లెందులో అత్యధికంగా రెబల్స్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి 8 మంది, టీడీపీ నుంచి ఆరుగురు, టీఆర్‌ఎస్ నుంచి ముగ్గురు అభ్యర్థులు రెబల్స్‌గా ఉన్నారు.
మధిరలో నామినేషన్లు వేస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థి మల్లుభట్టి విక్రమార్క రోడ్డుపై మీటింగ్ ఏర్పాటు చేయడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది.
ఖమ్మం పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళుతున్న జై సమైక్యాంధ్ర అభ్యర్థి చెరుకూరి నాగార్జునరావుపై తెలంగాణవాదులు దాడి చేశారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ తరపున ఎలా నామినేషన్ వేస్తావంటూ ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరుకాలేదు. రేణుక, అజయ్‌లు ర్యాలీలో ఉన్నా నామినేషన్ వేసే సమయంలో లేరు.
సొంతపార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు కూడా నారాయణ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు.
టీడీపీకి చెందిన మాళోతు రాందాసు నాయక్ వైరా, కొత్తగూడెం రెండు స్థానాల్లో రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు.