సీపీఎంకు నోముల రాజీనామా
* టికెట్ ఖరారు కానందున మనస్తాపం!
* టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సీపీఎం సీనియర్ నేత, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, సీపీఎం శాసన సభాపక్షనేతగా పనిచేసిన నోముల నర్సింహయ్య పార్టీకి రాజీనామా చేశారు. నల్లగొండ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచీ ఆయనకు టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోమవారం జిల్లా సీపీఎం ఆఫీసులో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరైన జిల్లా సెక్రటేరియట్ సమావేశంలో కూడా నోముల పాల్గొన్నారు. కారణాలు ఏవీ చెప్పడం లేదు కానీ, ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాత్రం పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు.
‘ సీపీఎంకు రాజీనామా చేస్తున్నానని పార్టీ ఆఫీసుకు లేఖ పంపాను. ఫోన్లో కూడా సమాచారం ఇచ్చాను. కారణాలు ఏమీ లేవు. సామాజిక తెలంగాణ కోసం, నవ తెలంగాణ నిర్మాణం కోసం పనిచేసే ఉద్యమకారులు ఎక్కడి నుంచి పోటీ చేసినా వారి తరపున పనిచేసి వారి గెలుపు కోసం కృషి చేస్తా..’ అని నోముల నర్సింహయ్య ‘సాక్షి’కి వివరించారు. జిల్లాలో సీపీఎం తరపున పోటీ చేసే అవకాశం రాకపోవడం వల్లే రాజీనామా చేశారా? అని ప్రశ్నించగా, ‘నాకు టికెట్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి..’ అని మాత్రమే స్పందించారు.
టీఆర్‌ఎస్ వైపు ... నోముల చూపు ?
ఈ తాజా పరిణామాన్ని విశ్లేషిస్తున్న వారు మాత్రం నోముల తెలం‘గానం’ వెనుక కారణం వేరే ఉందని అంచనావేస్తున్నారు. ఆయన టీఆర్‌ఎస్ తరపున నాగార్జునసాగర్, లేదా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాలో భువనగిరి, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. నాగార్జునసాగర్‌కు ఆ పార్టీకి అభ్యర్థే లేరు. దీంతో ఈ ప్రచారం నిజమని నమ్మడానికి ఊతం లభిస్తోంది. కాగా, నోముల మంగళవారం తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.