Nomula Narasimhaiah
-
మూడుముక్కలాట.. విజయం ఎవరిదో
సాక్షి, హైదరాబాద్ : ఒకవైపు వరుస ఎదురుదెబ్బలు తగిలిన అధికార టీఆర్ఎస్. పైగా వారికది సిట్టింగ్ స్థానం. మరోవైపు కాంగ్రెస్ అత్యంత సీనియర్ నేతకు రాజకీయంగా జీవన్మరణ సమస్య. దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాలు గాలివాటం కాదని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే క్రమంలో ఉన్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీది. ఇలా అందరికీ ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు ‘పరీక్ష’గా నిలిచి... రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. సాగర్ ఫలితంతో రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండనుందనే విషయంలో ఒక స్పష్టత రానుంది. కాబట్టి సాగర్‌లో విజయం మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు అనివార్యమయిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్తో పాటు మంచి ఊపు మీదున్న బీజేపీకి, ఈ ఎన్నికపై గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వచ్చే ఫలితం అత్యంత కీలకం కానుంది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నేత కె. జానారెడ్డి రాజకీయ భవితవ్యాన్ని కూడా ఈ ఎన్నిక నిర్దేశించనుంది. సానుకూల ఫలితం వస్తే జానా గ్రాఫ్ రాష్ట్ర రాజకీయాల్లో పెరిగిపోతుందని, అనూహ్య ఫలితం వస్తే మాత్రం ఆయన దాదాపు రాజకీయాల నుంచి తప్పుకుంటారనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రాభవానికి పరీక్ష నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అప్పుడే నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభం అయింది. అభ్యర్థి ఎంపికపై కసరత్తు, పార్టీ ద్వితీయశ్రేణి నాయకుల మధ్య సమన్వయం, నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దృష్టి సారించి అధికార టీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందంజలో ఉంది. నోముల సంతాప సభ పేరిట ఇప్పటికే రెండు చోట్ల సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ అభ్యర్థి ఎవరయితే బాగుంటుందన్న కోణంలో సర్వేలు కూడా పూర్తి చేసింది. మొత్తం మీద నర్సింహయ్య కుమారుడు భగత్, గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఎంసీ. కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిల అభ్యర్థిత్వాలను ఆ పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే సాగర్ ఉపఎన్నిక ఫలితం రాష్ట్రంలో టీఆర్ఎస్ చరిష్మాకు పరీక్షగా మారుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే సిట్టింగ్ సీటు దుబ్బాకను కోల్పోయి, జీహెచ్ఎంసీలో ఆశించిన ఫలితం రాని పరిస్థితుల్లో... మరో సిట్టింగ్ స్థానంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్కు అత్యంత అవసరం. పార్టీ ప్రాభవం తగ్గలేదని నిరూపించుకోవాల్సిన అనివార్యత. ఒకవేళ కారు అంచనా ఈ ఎన్నికల్లో తప్పితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాగర్‌ను మళ్లీ దక్కించుకునేందుకు అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డనుంది. పెద్దాయనకు ‘ఇమేజ్’కలిసొస్తుందా! గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి ఎక్కువగా అక్కడే గడుపుతున్నారు. వారానికి కనీసం రెండు రోజులు సాగర్‌లోనే ఆయన మకాం వేస్తున్నారు. ఇక, నోముల మరణం తర్వాత జానా మరింత చురుకుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పార్టీ బూత్ కమిటీల సమావేశాలు ఓ దఫా పూర్తి చేసిన జానా రెండో దశలో ద్వితీయ శ్రేణి నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని, దూరంగా ఉన్న వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకున్న విస్తృత పరిచయాలను ఉపయోగించుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. రెండో విడతలో ఆయనకు కుమారుడు రఘువీర్ కూడా తోడయ్యారు. తండ్రీ కొడుకులిద్దరూ నియోజకవర్గంలోని చెరో మండలంలో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత చరిష్మా కలిగిన నాయకుడిగా, వివాదరహితుడిగా గుర్తింపు పొందిన జానాకు ద్వితీయ శ్రేణి నాయకత్వం పార్టీ నుంచి వెళ్లిపోవడం ప్రతికూలంగా కనిపిస్తోంది. అయితే, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ బలంగానే ఉందని ఆయన విశ్వసిస్తున్నారు. ఈ కోణంలోనే నియోజకవర్గంలోని యువతను ఆకట్టుకుని వారిని నాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆయన ప్రధాన నాయకుడు కావడం, టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉండడం, తాజాగా ఆయన విజ్ఞప్తి మేరకు టీపీసీసీ అధ్యక్ష ఎన్నికను పార్టీ అధిష్టానం వాయిదా వేయడం లాంటి అంశాలు... ఆయనకు సానుకూలంగా మారుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి ఎవరో? ఇక, బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గతంలో ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ పార్టీకి పెద్దగా ఓట్లు రాకపోవడంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తీవ్రంగా కష్టపడాల్సి వస్తుందని రాజకీయ వర్గాలంటున్నాయి. సంస్థాగత నిర్మాణం కూడా బీజేపీ అంతగా లేకపోవడంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదితకు పోలైన ఓట్లలో కేవలం 1.48 శాతం (2.675) ఓట్లే వచ్చాయి. తాజా రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన పోటీదారుల్లో ఒకరుగా నిలువడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఇప్పుడు అక్కడ బీజేపీ టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీపడుతున్నారు. పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి సతీమణి, గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదితతో పాటు కొంతకాలం క్రితం పార్టీలో చేరిన కడారి అంజయ్య యాదవ్ బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇద్దరూ పోటీపోటీగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, అంజయ్య నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాకపోవడం ఆయన అభ్యర్థిత్వానికి ఆటంకం అవుతుందని భావించినా.... సాగర్‌లో ఆయన సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడం కలిసిరానుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ లాగే సాగర్‌లోనూ కమలనాథులు దూకుడుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. ఎన్నికల సమయం సమీపించే కొద్దీ వ్యూహాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని, గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలబెట్టి ఈ ఎన్నికల్లో కూడా సత్తా చాటి తెలంగాణలో తమ రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకోవాలన్నది బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ వస్తుందని, మార్చిలో సాగర్ ఉపఎన్నిక జరుగుతందనే అంచనాతో అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతుండటం గమనార్హం. -
నోముల అంత్యక్రియల్లో పాల్గొన్న కేసీఆర్
నల్గొండ : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో జరిగాయి. అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని నివాళి అర్పించారు. నోముల భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. తమ అభిమాన నాయకుడి అంతిమయాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. (ముగిసిన 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానం) నకిరేకల్ నుంచి పాలెంకు భౌతికకాయం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో భద్రపరిచిన నోముల నర్సింహయ్య భౌతికకాయాన్ని గురువారం ఉదయం 7.30 గంటలకు మొదట నకిరేకల్‌కు తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం 10.30 గంటల వరకు ఉంచారు. ఆ తర్వాత స్వగ్రామమైన పాలెం తీసుకెళ్లారు. కాగా, అమెరికాలో ఉన్న నోముల కుమార్తె బుధవారం రాత్రి 8 గంటలకు స్వగ్రామానికి చేరుకున్నారు. -
ముగిసిన 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానం
నోముల నర్సింహయ్య.. ఉమ్మడి జిల్లా వాసులకు పరిచయం అక్కర లేని పేరు. న్యాయవాదిగా.. ఎమ్మెల్యేగా, ఓ పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా ఆయన అందించిన సేవలు మరువలేనివి. వివిధ అంశాలపై మంచి వాగ్ధాటి కలిగిన నేతగా గుర్తింపు. విద్యార్థి దశ నుంచే రాజకీయ అరంగేట్రం చేసిన నర్సింహయ్య ఎంపీపీగా, ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన కొంత కాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీంతో ఉమ్మడి జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాను తుదిశ్వాస విడిచే వరకు ప్రజాసేవకే అంకితమవుతానని ఎప్పుడూ చెప్పే నోముల.. అన్నట్లుగానే ప్రజా జీవితంలోనే ఉంటూ ప్రాణం విడిచారు. 64 ఏళ్ల జీవన ప్రయాణంలో 35ఏళ్లపాటు రాజకీయంలో ఉన్నారు. సాక్షి, హలియా (నాగార్జునసాగర్): ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇక లేరంటూ నియోజకవర్గ ప్రజలు కంటతడి పెట్టారు. నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మంగళవారం తెల్లవారు జామున గుండె పోటుతో మరణించాడన్న వార్త తెలియడంతో నియోజక వర్గంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతదేహాన్ని నియోజకవర్గ కేంద్రమైన హాలియాకి తరలించారు. సొంతింటి వద్ద ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఎమ్మెల్యే నర్సింహయ్య ఇకలేరని తెలియడంతో కడసారి చూపుకోసం నాయకులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు ఆయన ఇంటి వద్దకు చేరుకొని అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. నర్సింహయ్య భౌతి కకాయాన్ని సందర్శించుకునేందుకు నియోజకవర్గం నుంచే కాక జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు. 9:10 నిమి షాలకు నోముల పార్థివదేహాన్ని కామినేని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (ఫైల్) పలువురి ఘన నివాళి.. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ పారీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇరిగి సునిల్‌కుమార్, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్యయాదవ్, జెడ్పీ బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అద్యక్షుడు శ్రీనివాస్, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్, డీఈఓ భిక్షపతి, జిల్లా మత్స్యశాఖ అధికారి సుచరిత, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, ఇస్లావత్ రాంచందర్ నాయక్, కుందూరు రఘువీర్‌రెడ్డి, జయవీర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, యడవెల్లి మహేందర్‌రెడ్డి, హాలియా, నందికొండ మున్సిపాలిటీల చైర్పర్సన్లు వెంపటి పార్వతమ్మశంకరయ్య, కర్ణా అనూషరెడ్డి తదితరులు ఘనంగా నివాళులరి్పంచారు. నాటి సీఎం వైఎస్సార్‌తో నర్సింహయ్య (ఫైల్), టీఆర్ఎస్లో చేరాక సీఎం కేసీఆర్‌తో (ఫైల్) విద్యార్థి దశ నుంచే.. ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేసిన నోముల నర్సింహయ్య నల్లగొండ, నకిరేకల్ కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. దివంగత సీపీఎం సీనియర్ నేత నర్ర రాఘవరెడ్డి ప్రోత్సాహంతో 1985లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన 1987 నుంచి 1999 వరకు 12 ఏళ్ల పాటు నకిరేకల్ ఎంపీపీగా పనిచేశారు. 1999, 2004లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ పార్టీ శాసన సభా పక్ష నేతగా పనిచేశారు. 2009లో రిజర్వేషన్ మారడంతో అప్పుడే ఏర్పడిన భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల సమయంలో సీపీఎం నుంచి హుజూర్నగర్ సీటు కోసం ప్రయత్నించిన ఆయన టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ నుంచి టికెట్ సాధించి 2014లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి జానారెడ్డిపై విజయం సాధించారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పదేళ్ల పాటు సీపీఎం ఫ్లోర్ లీడర్‌గా.. 1999 నుంచి 2009 వరకు పదిఏళ్ల పాటు శాసనసభా పక్ష నేత సేవలందించి అసెంబ్లీలో బలమైన వాగ్ధాటిగా ముద్ర వేసుకున్నారు. ప్రధానంగా సీఎం చంద్రబాబునాయుడు హయాంలో విద్యుత్ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా అధికార పక్షాలను అసెంబ్లీ సాక్షిగా కడిగిపారేయడంలో ఆయనకు ఆయనే సాటి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయంటే చాలు అటు అధికార, ప్రతిపక్షాలు సైతం వాణిని వినేందుకు ఆత్రుతగా ఎదురుచూసేవారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయాల్లో ఇద్దరు సీఎంలు చంద్రబాబు, వైఎస్సార్‌తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. 2009 నుంచి 2014 వరకు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు. సాగర్‌లో నోముల రాజకీయ ప్రస్థానం.. 2014లో సీపీఎం పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీలో చేరిన నోముల నర్సింహయ్య నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో మాజీ సీఎలీ్పనేత కుందూరు జానారెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచే నోముల నర్సింహయ్య హాలియాలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేయడంతో పాటు మరో పక్క పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఏ ఆపద వచ్చిన వారి వెన్నంటే నేను ఉన్నానంటూ భరోసా కల్పించారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మరో సారి పోటీ చేసిన నోముల నర్సింహయ్య కుందూరు జానారెడ్డిపై 8వేలపైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ‘సాగర్’నియోజకవర్గ అభివృద్ధిలో సాటిలేని నోముల.. నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నోముల నర్సింహయ్య నియోజకవర్గ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపారు. నందికొండ, హాలియా మున్సిపాలిటీల ఏర్పాటు చేసిన ఘనత నోముల నర్సింహయ్యదే. నియోజకవర్గంలో పలు మండలాల్లో వాగులపై చెక్ డ్యాంలు నిర్మించి భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషి చేశారు.నియోజకవర్గంలోని మారు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైయినేజీ కాల్వల నిర్మాణాలతో పాటు అనేక అభివృద్ధి పనులు చేయించారు. ఎవుసం మరువని నేత నోముల నర్సింహయ్య మూడు దఫాలుగా ఎమ్మెల్యే పనిచేసినప్పటికీ వ్యవసాయ పనులను మరువలేదు. తన స్వగ్రామమైన నకిరేకల్ మండలం పాలెం గ్రామం శివారులో 50ఎకరాల వ్యవసాయక్షేత్రం ఉంది. నకిరేకల్‌కు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయాల్లో రాజకీయాల్లో ఎంత బిజీబిజీగా ఉన్న ప్రతి రోజు తెల్లవారుజామునే తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఉండని రోజు లేదు అనిచెప్పవచ్చు. ఆయనతో పాటు భార్య లక్ష్మి కూడా వ్యవసాయంలో నిమగ్నమైపోతారు. అభివృద్ధిలో తనదైన ముద్ర నకిరేకల్‌కు రెండు సార్లు ఎంపీపీగా, రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా, శాసన సభా పక్ష నేతగా పని చేసిన నర్సింహయ్య నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. హైదారాబాద్ నుంచి విజయవాడ రహదారిపై ఎక్కడ లేని తరహాలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి మినీ, ఇండోర్ స్టేడియాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. షిరిడీ తరహాలో సాయి మందిర నిర్మాణంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయా మండలాలు, గ్రామాల్లో కూడా అభివృద్ధిలో తన వంతు కృషి చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి సాన్నిహిత్యంతో నకిరేకల్‌కు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలు మంజూరు చేయడంతో సఫలీకృతులు అయ్యారు. అనేక గ్రామాల్లో పాఠశాలల భవనాలు, కమ్యూనిటీ హాల్, రోడ్లు, పత్తి మార్కెట్, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంలో కూడా కీలకపాత్ర పోషించారు. రేపు పాలెంలో ‘నోముల’ అంత్యక్రియలు నకిరేకల్: సాగర్ ఎమ్మెల్యే నోమలు నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం నకిరేకల్ మండలం పా లెం గ్రామంలో జరగనున్నాయి. అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉండటంతో మంగళవారం సాయంత్రం కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎస్పీ రంగనాథ్‌లు పాలెం గ్రామాన్ని సందర్శించారు. వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించే స్థలాన్ని, నర్సింహయ్య ఇంటిని, హెలీపాడ్ స్థలాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. వారి వెంట నల్ల గొండ ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి ఉన్నారు. మొదటి, చివరిసారిగా... నిడమనూరు (నాగార్జునసాగర్): ఎమ్మెల్యేగా నోముల నర్సింహయ్య నియోజకవర్గంలో తన మొదటి, చివరి సారి కార్యక్రమాన్ని నిడమనూరులోనే నిర్వహించారు. మండలంలోని కోటమైసమ్మ గుడి వద్ద అమ్మగారికి పూజ చేసి 2018లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నోముల రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులరి్పంచారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో నిడమనూరులో వరద బాధితులకు నష్ట పరిహారం చెక్కులను అందజేశారు. ఆ కార్యక్రమం కాగానే నేరుగా హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఆయన మృతికి మండల నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు. వారిలో ఎంపీపీ జయమ్మ, జెడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య, పార్టీ మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్ ఉన్నారు. -
హైదరాబాద్: ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత
-
నోముల కన్నుమూత
సాక్షి, హైదరాబాద్, నకిరేకల్: నాగార్జునసాగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) మంగళవారం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పి, ఆయాసంతో విలవిల్లాడిన ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెంది నట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొంతకాలంగా ఆయన తీవ్రమైన మధుమేహం, స్పాండలైటిస్‌తో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమా ర్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మంత్రులు కేటీఆర్, సబిత, ఈటల సహా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బాల్క సుమన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితోపాటు వివిధ ప్రజాసంఘాల నేతలు కొత్తపేటలోని ఆయన నివాసానికి చేరుకొని నోముల భౌతికకాయానికి నివాళు లర్పించారు. నోముల భౌతికకాయాన్ని నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం హాలియాలోని ఆయన ఇంటికి తరలించగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. అమెరికాలో ఉన్న చిన్న కుమార్తె బుధవారం స్వగ్రామానికి చేరుకోనుండటంతో అప్పటివరకు ఆయన భౌతికకాయాన్ని నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించి భద్రపరిచామని, గురువారం ఉదయం స్వగ్రామమైన పాలెంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నర్రా ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి.. నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో నోముల మంగమ్మ, రాములు దంపతులకు 1956 జనవరి 9న రెండో సంతానంగా నర్సింహయ్య జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో 1981లో ఎల్ఎల్బీ, 1983లో ఎంఏ పూర్తి చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకునిగా పని చేశారు. నల్లగొండ, నకిరేకల్ కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేసి గుర్తింపు పొందారు. సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి ప్రోత్సహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1987 నుంచి 1999 వరకు నకిరేకల్ ఎంపీపీగా పనిచేశారు. రాఘవరెడ్డి వృద్ధాప్యంతో బాధపడుతుండటంతో ఆయన స్థానంలో నకిరేకల్ నియోజకవర్గం నుంచి 1999లో తొలిసారి సీపీఎం నుంచి పోటీ చేసి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లోనూ అదేస్థానం నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పదేళ్లపాటు సీపీఎం శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. పేదలపక్షాన అసెంబ్లీలో గళం విప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వీభజనలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆయన 2009లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీఆర్ఎస్లో చేరిన నోముల నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మరోసారి జానారెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా లెక్కచేయకుండా ప్రజాసేవే లక్ష్యంగా నియోజకవర్గంలో పర్యటించారు. నోముల నర్సింహయ్య మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వాణి వినిపించిన నేత 1999 నుంచి 2009 వరకు శాసనసభాపక్ష నేతగా సేవలందించిన నోముల... అసెంబ్లీలో బలమైన వాగ్ధాటిగల నేతగా ముద్ర వేసుకున్నారు. ప్రధానంగా 1999 నుంచి 2003 వరకు అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో విద్యుత్ సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా అధికార పక్షాన్ని అసెంబ్లీ సాక్షిగా కడిగిపారేయడంలో ఆయనకు ఆయనే సాటిగా పేరుగాంచారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయంటే చాలు అధికార, ప్రతిపక్షాలు నర్సింహయ్య ప్రసంగం వినేందుకు ఆత్రుతగా ఎదురుచూసేవి. విపక్ష నేతగా ఉన్న సమయాల్లో చంద్రబాబుతోపాటు దివగంత సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలిగారు. -
తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. సోమవారం బడ్జెట్ కేటాయింపుల అనంతరం మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ వివిధ పథకాలకు కేటాయింపులు తగ్గించలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయింపులు బాగున్నాయని అన్నారు. ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్ : నోముల నర్సింహయ్య తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెటని, ప్రజారంజకంగా ఉందని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య కొనియాడారు. సోమవారం బడ్జెట్ కేటాయింపుల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని సంక్షేమ రంగాలకు ఉపయోగపడే విధంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. -
జానా.. నీ ఆటలు సాగనియ్యం : నోముల నర్సింహయ్య
సాక్షి, నాగార్జునసాగర్ : నియోజకవర్గంలో జానారెడ్డి ఆటలు ఇక సాగనీయమని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. శుక్రవారం పైలాన్ కాలనీలో ర్యాలీ నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానారెడ్డిని గ్రామాలలోకి ప్రచారా నికి వెళితే నీ సేవలు ఇక చాలు గో బ్యాక్ అంటున్నారన్నారు. అయినా గెలుపు తమదేనని బీరాలు పలుకుతున్నాడని ఈసారి ఆ మాయలను సాగనివ్వవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ ప్రజలు తమకే మెజార్టీ ఇచ్చారని ఈసారి సాగర్ నుంచే ఐదు వేల మెజార్టీ ఇవ్వాలని కాలనీల వాసులను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చలవతో సాగర్‌ను నంది కొండ పేరుతో మున్సిపాలిటీ చేశామని తమను గెలిపిస్తే ఈ మున్సిపాలిటీకి బొడ్రాయిగా ఉండి మీకు సేవచేస్తానని అన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ అభివృద్ధికిగాను రూ.20 కోట్లు మంజూరయ్యాయని కాలనీలలో అంతర్గత రోడ్లు, డ్రెనేజీ లు, నిత్యం తాగునీటి వసతి కల్పించేందుకు నిధులు ఖర్చు చేయవచ్చన్నారు. కాలనీలలోని ఎన్ఎస్పీ క్వార్టర్లను నామినల్ రేటుతో రెగ్యులర్ చేయించే బాధ్యత తమదేనన్నారు. ముస్లింలకు గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలలో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇప్పించే బాధ్యత తమదేనన్నారు. టీఆర్ఎస్లో చేరిక.. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర మైనార్టీ నాయకులు గౌస్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్న బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నోముల నర్సింహయ్య సమక్షంలో పార్టీలో చేరారు. తిరుమలగిరి మండలం రంగుండ్లకు చెందిన 100 మంది కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో బత్తుల సత్యనారాయణ, రామకృష్ణ, శేఖరాచారి, మసీదు రాము తదితరులు పాల్గొన్నారు. గుర్రంపోడు : తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని మొసంగి, తెరాటిగూడెం, ఎరడ్లగూడెం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఆదరించి మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేయాలని అన్నారు. తెలంగాణాపై ఆధిపత్యం కొనసాగించేందుకు ఆంధ్రా పాలకులు ప్రయత్నిస్తున్నారని, ఓటుతో వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే అవకాశం తనకు ఇవ్వాలని అన్నారు. దశాబ్దాలుగా పదవులు అనుభవిస్తున్న వారు ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గాలి రవికుమార్, ఎంపీటీసీల ఫోరం నియోజకవర్గ కార్యదర్శి పాశం గోపాల్‌రెడ్డి, నాయకులు జలగం సుదర్శన్‌రావు, మండల అధ్యక్షుడు గుండెబోయిన కిరణ్‌కుమార్ యాదవ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బల్గూరి నగేష్‌గౌడ్, గజ్జెల చెన్నారెడ్డి, పొనుగోటి నర్సింహారావు, గోలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
‘జానారెడ్డిని ఓడించాలంటే టికెట్ నాకు ఇవ్వాల్సిందే’
సాక్షి, నల్గొండ : గులాబీ పార్టీలో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా తమ ఆగ్రహాన్ని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ఇందులో భాగంగా కొందరు పార్టీని వీడుతుండగా మరికొందరు బీఫామ్‌లు ఇచ్చేంత వరకు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారు. ఈ క్రమంలోనే అసమ్మతి నేత ఎంసీ కోటిరెడ్డి.. నాగార్జున సాగర్ అభ్యర్థి నోముల నరసింహయ్యకు వ్యతిరేకంగా త్రిపురారంలో సోమవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా... నోముల.. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదని, ఆయనకు ఇక్కడి గ్రామ రాజకీయాల మీద అవగాహన లేదని కోటిరెడ్డి వ్యాఖ్యానించారు. జానారెడ్డిలాంటి బలమైన అభ్యర్థిని ఓడించాలంటే.. టీఆర్ఎస్ స్థానిక నేతకు(తనకు) టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఇక్కడి అభ్యర్థిని మార్చాలని, నియోజకవర్గ ప్రజల తరపున మరోసారి అధిష్టానాన్ని కోరతానని ఆయన ప్రకటించారు. అయినా బీఫామ్ ఇచ్చే చివరి నిమిషం వరకు నియోజకవర్గ అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా జరగని పక్షంలో అందరితో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని కోటిరెడ్డి స్పష్టం చేశారు. -
వర్గీకరణపై మా చిత్తశుద్ధిని శంకించొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పనిలేదని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం కేసీఆర్ నిజాయితీతో వ్యవహరించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణపై అఖిలపక్ష బృందానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని సీఎం పలుమార్లు కోరారని గుర్తు చేశారు. అఖిలపక్ష బృందానికి ప్రధాని సమయం ఇవ్వడం లేదంటే ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదనే అనుమానం వస్తోందన్నారు. వర్గీకరణపై నిర్ణయం తీసుకుని అమలు చేయాల్సింది కేంద్రమేనన్నారు. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఏ ఆందోళన చేయాలనుకున్నా ఢిల్లీలోనే చేయాలని సూచించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు తమ రాజకీయ లబ్ధి కోసమే వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారని విమర్శించారు. -
ఆంధ్రా కళ్లతో చూస్తున్న కాంగ్రెస్ నేతలు
టీఆర్ఎస్ నేత నోముల విమర్శ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను గమనించే స్థితిలో కాంగ్రెస్ లేదని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య విమర్శించారు. కేసీఆర్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే ఆయన దిష్టిబొమ్మలు తగులపెట్టిన నీచమైన పార్టీ అని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రా కళ్లతో చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు డిండి ప్రాజెక్టుకు జరిగిన శంకుస్థాపన కూడా కనిపించడం లేదన్నారు. మరో వైపు టీడీపీ నేతలు చివరకు వరద నీళ్లపైనా తగాదాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు నీచ స్థాయికి దిగజారి శవాలపై పేలాలు ఏరుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడానికి కేసీఆర్ నియంతాలనే వ్యవహరిస్తారన్నారు. వికీ లీక్స్ చంద్రబాబు కుట్రలను బయట పెట్టినా వారికి బుద్ధి రావడం లేదని నోముల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అన్నా.. పోగొట్టుకున్నచోటే వెతుక్కుంటా!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఎన్నికల్లో జానారెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం అసెంబ్లీ వద్ద కొచ్చారు. ఈ సందర్భంగా జానారెడ్డి ఎదురవడంతో వారి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘‘అన్నా.. పోయినచోటే వెతుక్కుందామని వచ్చాను. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ సాగర్ నుంచే పోటీ చేస్తా’’ అని నోముల జానాతో అన్నారు. అందుకు జానారెడ్డి ‘‘నువ్వు అక్కడ పోగొట్టుకున్నదేముంది.. వెతుక్కోవడానికి? మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్సీగానో, రాజ్యసభ సభ్యుడిగానో వెళ్లొచ్చు కదా!’’ అని సూచించారు. దీంతో నోముల ‘‘లేదన్నా.. ఎక్కడికి వెళ్లాలనే ఉద్దేశం లేదు. ఒకవేళ మీరేమైనా టీఆర్ఎస్కు దగ్గరైతే.. నేను వేరేది చూసుకుంటా’’అని వ్యాఖ్యానించారు. -
తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దు: నోముల
హైదరాబాద్: తెలంగాణలో ఆస్తులను పంచుకోలేదని చంద్రబాబునాయుడు రెచ్చగొడుతున్నారని, ఇది మంచిది కాదని టీఆర్ఎస్ నాయకుడు నోముల నర్సింహయ్య హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆయన శనివారం మాట్లాడుతూ, అప్పులను మాత్రమే పంచుకున్నామని, ఇంకా ఆస్తులను పంచుకోవాల్సి ఉందంటూ రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. విడిపోయిన తర్వాత అన్నదమ్ములుగా కలసి అభివృద్ధి చెందేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలుండాలన్నారు. సంబంధాలను చెడగొట్టే విధంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. -
కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి : నోముల
నకిరేకల్, న్యూస్‌లైన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. నకిరేకల్‌లో టీఆ ర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వేముల వీరేశం ఆధ్వర్యంలో ఆదివారం నోముల నర్సింహయ్యకు ఆత్మీయసభ ఏర్పాటుచేశారు. ఈ సభలో నర్సిం హయ్య మాట్లాడుతూ తాను పదవి కోసం సీపీఎంను వీడలేదన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పలుమార్లు టీవీ ఛానళ్లలో చర్చించిన సందర్భంగా సీపీఎం పెద్దలు తనకు నోటీసులు పంపారని, అందులో ఒకవర్గం తనను వేధింపులకు గురిచేయడంవల్ల పార్టీని వీడి తెలంగాణ కోసం పోరాడిన టీఆర్ఎస్లో చేరానని వివరించారు. తనతోపాటు జిల్లాలో 6నుంచి 7 అసెంబ్లీ స్థానాలలో, 2 పార్లమెంట్ స్థానాలలో గెలిచి టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందన్నారు. నకిరేకల్ టీఆ ర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ పూజర్ల శంభయ్య, నాయకులు సోమయాదగిరి, సిలివేరు ప్రభాకర్, మారం భిక్షంరెడ్డి, కనుకు సహాని, పన్నాల సావిత్రమ్మ, వీర్లపాటి రమేష్, బొజ్జ సుందర్, గార్లపాటి రవీందర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, పల్రెడ్డి నర్సింహారెడ్డి, వివిధ మండల పార్టీ అద్యక్షులు తదితరులు ఉన్నారు. -
‘నోముల’ టీఆర్ఎస్కు జంప్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నకిరేకల్ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన నోముల నర్సింహయ్య సీపీఎం శాసనసభా పక్షనేతగా కూడా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నర్సింహయ్య పార్టీ మారే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం జరిగింది. తాను సీపీఎంలోనే కొనసాగుతున్నానని, ఆ వార్తలను ఖండించారు. కాగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి హుజూర్నగర్ నుంచి టికెట్ ఆశించారు. కానీ, ఆయా డివిజన్ల నేతల మెజారిటీ అభిప్రాయం మేరకు నర్సింహయ్యకు టికెట్ నిరాకరించారు. చివరకు ఆలేరు నుంచైనా పోటీ చేయడానికి నోముల సిద్ధపడినట్లు చెబుతున్నారు. కానీ, స్థానిక నాయకత్వం వైపే సీపీఎం వర్గాలు మొగ్గు చూపాయి. సోమవారం సాయంత్రం వరకూ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలోనే ఉన్న నోముల తనకిక ఏ స్థానం నుంచి టికెట్ రాదని రూఢీ చేసుకున్నాక, రాత్రికి రాత్రి రాజీనామా లేఖను పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి పంపించారు. ముందు నుంచీ కేసీఆర్‌తో ఉన్న సంబంధాల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరానని నర్సింహయ్య చెబుతున్నారు. ఇప్పటి దాకా అభ్యర్థిని ఖరారు చేయని నాగార్జునసాగర్ టికెట్‌ను నర్సింహయ్యకు కేసీఆర్ కట్టబెట్టారు. కాంగ్రెస్ నేత కె.జానారెడ్డిపై మరో సీనియర్ నాయకుడు, అదీ వెనకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థి అయితే కలిసి వస్తుందని టీఆర్ఎస్ నాయకత్వం భావించినట్లు చెబుతున్నారు. నిన్నా మొన్నటి దాకా మెడలో ఎర్ర కండువాతో కనిపించిన నర్సిం హయ్య మంగళవారం మాత్రం గులాబీ కండువా వేసుకుని కనిపించారు. ‘నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డితో పోటీ పడేది నేను కాదు. అక్కడి ఓట్లరు..’ అని నోముల మీడియాతో వ్యాఖ్యానించారు. భువనగిరికి ‘పైళ్ల’ ఖరారు భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పైళ్ల శేఖర్‌రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. ఆలేరు నియోజకవర్గంలో పోటీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న పైళ్లకు ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచీ పోటీ చేసే అవకాశం దక్కేలా వీలులేకపోవడంతో భువనగిరికి వలస వచ్చారు. కేసీఆర్ హామీతో పార్టీలో చేరిన ఆయన చివరకు భువనగిరి టికెట్‌ను దక్కించుకున్నారు. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న ఎలిమినేటి కృష్ణారెడ్డి, కొనపురి రాములకు చివరకు నిరాశే మిగిలింది. -
జంపింగ్లదే జోరు!
* అన్ని పార్టీల్లోనూ ఇదే లేటెస్టు ట్రెండ్.. అర్ధరాత్రి దాకా చర్చలు * వారి కోసం వేచి చూసి మరీ టికెట్లు కేటాయిస్తున్న పార్టీలు * ఆఖరి క్షణంలో పార్టీ తీర్థం పుచ్చుకుని బీ-ఫారంతో బరిలోకి * చివరి నిమిషం వరకు పార్టీల జాబితాల్లో ఖాళీలు * టీఆర్ఎస్లోకి అత్యధికంగా చేరికలు.. వెనువెంటనే టికెట్లు * 36 గంటల్లో మూడు పార్టీలు మారిన మైనంపల్లి హన్మంతరావు సాక్షి, హైదరాబాద్: మునుపెన్నడూ లేని విధంగా.. అన్ని పార్టీలూ జంప్ జిలానీల కోసం నిరీక్షిస్తున్న దృశ్యాలు.. వారి కోసం అభ్యర్థుల జాబితాల్లో ఖాళీలు.. నామినేషన్ల గడువు ముగుస్తున్నా అర్ధరాత్రి దాకా మంతనాలు.. ఏ పార్టీ నాయకుడు ఏ గంటలో ఏ పార్టీ శిబిరంలోకి వెళ్లాడో, ఏ పార్టీ తీర్థం పుచ్చుకుని, ఏ స్థానానికి టికెట్టు పొందాడో అర్థం కాని పరిస్థితి! గత పదీ పదిహేను రోజులుగా అన్ని శిబిరాల్లోనూ ఈ తంతు కొనసాగుతున్నా సోమ, మంగళవారాల్లో ఇది పరాకాష్టకు చేరుకుంది. ఇలా వచ్చి కండువా కప్పుకోవడం, అలా పార్టీ బీ- ఫామ్ తీసుకుని వెళ్లిపోవడం..! ఈ వరుసలో కొత్త రికార్డులు బద్దలవుతున్నాయి.. ఒక శాసనసభ్యుడైతే 36 గంటల్లో మూడు పార్టీలు మారిపోయాడు. అసెంబ్లీ కోసం ప్రయత్నిస్తే ఏకంగా పార్లమెంటు స్థానమే దక్కింది. మరో నాయకుడి స్థానం పొత్తులో గల్లంతు కావడమే కాదు.. అనుకోకుండా దక్కిన పార్టీ జిల్లా అధ్యక్ష పదవీ గంటలోపే జారిపోయింది! గెలుపు గుర్రమా, కాదా.. అనేదే ప్రాతిపదిక..! రాజకీయ సమీకరణాలు, కులాల వారీ ఓట్ల లెక్కలు, ప్రత్యర్థుల బలాబలాలు.. ఈ అంచనాల్లోనే ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ తలమునకలైపోయాయి! పార్టీ జంప్ చేయ్.. మా పార్టీ తీర్థం పుచ్చుకో.. ఆ వెంటనే టికెట్ అందుకో..! ఇదీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఆఖరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి తమతమ పార్టీల్లో చేరే అభ్యర్థులకు ఇస్తున్న బంపర్ ఆఫర్! ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించగానే.. ఆ నియోజకవర్గాల్లోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకుంటున్నారు. రాజకీయంగా బలమైన నాయకులు లేని నియోజకవర్గాల్లో అసంతృప్త నాయకులను చేరదీసి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు దీటుగా రంగంలోకి దించే ఎత్తులు వేస్తున్నారు. నిన్నటి వరకు ప్రత్యర్థి పార్టీలో ఉన్నాసరే.. మరుసటి రోజు పార్టీ మారితే చాలు టికెట్ ఖాయమైపోతోంది. తెలంగాణలో ఇలాంటి జంప్ జిలానీల హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా.. అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చివరి నిమిషంలో చేరికలు అధికంగా ఉన్నాయి. మంగళవారం అంతటా టీఆర్ఎస్ శిబిరంలో ఇదే సందడి నెలకొంది. అలా చేరిన వారందరికీ టికెట్లు కేటాయించడం గమనార్హం. సోమ, మంగళవారాల్లోని పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే... * సీపీఎం పార్టీకి సోమవారం గుడ్‌బై చెప్పిన నోముల నర్సింహయ్య.. మంగళవారం టీఆర్ఎస్లో చేరి నాగార్జునసాగర్ టికెట్ పొందారు. * కాంగ్రెస్ నుంచి వచ్చిన గుర్నాథరెడ్డికి కోడంగల్, టీడీపీ నుంచి వచ్చిన ముఠాగోపాల్‌కు ముషీరాబాద్, కొలను హన్మంతరెడ్డికి కుత్బుల్లాపూర్, టీడీపీ నుంచే వచ్చిన ప్రేమ్కుమార్ధూత్కు గోషామహల్, మనోహర్‌రెడ్డికి మహేశ్వరం, కాంగ్రెస్ నుంచి వచ్చిన రామ్మోహన్‌గౌడ్‌కు కండువా కప్పేసి ఎల్బీనగర్ టికెట్లు ఇచ్చేశారు. * సీపీఐ నుంచి వచ్చిన చంద్రావతికి టీఆర్ఎస్ వెంటనే టికెట్ కేటాయించింది. * కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన వనమా వెంకటేశ్వరరావుకు కొత్తగూడెం స్థానం కేటాయించారు. * తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు వుంగళవారం టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి వరంగల్ జిల్లాలో ఏ స్థానం లేకపోవడంతో వరంగల్ మేయర్ పదవి ఇస్తావుని ఆశచూపినట్లు సమాచారం. * కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఫిరోజ్ఖాన్కు నాంపల్లి, ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహాం టీడీపీలో చేరిన తరువాత అదే నియోజకవర్గం టికెట్‌ను కేటాయించారు. * టీఆర్ఎస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావుకు బోథ్ స్థానం కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు. * వైఎస్సార్ సీపీ నుంచి వచ్చిన పుట్ట మధుకు టీఆర్ఎస్ మంథని టికెట్ కేటాయించింది. * మెదక్ పార్లమెంటు స్థానం పరిస్థితీ ఇదే. ఈ స్థానంలో వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్గా ఉన్న డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించారు. సిట్టింగ్ ఎంపీ విజయశాంతిని తప్పించి మెదక్ అసెంబ్లీకి పంపించటం విశేషం. * ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రఘునందన్‌రావుకు మంగళవారం దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ కేటాయించింది. * తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వివిధ జేఏసీ నేతలకు కాంగ్రెస్, టీఆర్ఎస్లు టికెట్లు పంపిణీ చేశాయి. టీఆర్ఎస్ ఐదుగురికి, కాంగ్రెస్ ముగ్గురికి టికెట్లు కేటాయించింది. గతంలో వీరు ఏ పార్టీలో లేకపోయినా కొత్తగా వీరికి టికెట్లు ఇచ్చారు. టీఆర్ఎస్ నుంచి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, శ్రీనివాస్‌గౌడ్, సహోదర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, పిడమర్తి రవిలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, గజ్జెల కాంతం, కత్తి వెంక టస్వామి ఉన్నారు. * గత 15, 20 రోజుల్లో జరిగిన పార్టీ ఫిరాయింపులనూ లెక్కలోకి తీసుకుంటే అన్ని పార్టీల్లోనూ కలిపి.. ఇలా వేరే పార్టీల్లోకి జంప్ చేయుగానే టికెట్లు దక్కించుకున్న వారి సంఖ్య దాదాపు 35- 40 వరకూ ఉంటుందని అంచనా! * వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన భట్టి జగపతికి మెదక్ అసెంబ్లీ టికెట్ దక్కింది. 36 గంటల్లో మూడు పార్టీలు టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు 36 గంటల్లో మూడు పార్టీలు మారి చివరాఖరుకు తెలంగాణ రాష్ట్ర సమితిలో తేలారు. ఆయనకు మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఆదివారం నాడు టీడీపీ - బీజేపీ పొత్తులో భాగంగా మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో టీడీపీకి రాజీనామా చేసి, సోమవారం తెల్లవారే సరికల్లా మైనంపల్లి హనుమంతరావు ఢిల్లీలో వార్‌రూమ్‌లో దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి కాంగ్రెస్‌లో చేరిపోవడం జరిగిపోయింది. కానీ.. సోమవారం సాయంత్రానికి కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో పేరు కనపడకపోయేసరికి దిమ్మతిరిగిన హన్మంతరావు ఆ వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో మంతనాలు జరిపారు. ఇంకేముంది మంగళవారం సాయంత్రానికి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం.. ఆ వెంటనే మల్కాజిగిరి టీఆర్ఎస్ లోక్‌సభ టికెట్ ఖాయమైనట్టు తెలిసింది. -
సీపీఎంకు నోముల రాజీనామా
* టికెట్ ఖరారు కానందున మనస్తాపం! * టీఆర్ఎస్లో చేరే అవకాశం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సీపీఎం సీనియర్ నేత, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, సీపీఎం శాసన సభాపక్షనేతగా పనిచేసిన నోముల నర్సింహయ్య పార్టీకి రాజీనామా చేశారు. నల్లగొండ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచీ ఆయనకు టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోమవారం జిల్లా సీపీఎం ఆఫీసులో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరైన జిల్లా సెక్రటేరియట్ సమావేశంలో కూడా నోముల పాల్గొన్నారు. కారణాలు ఏవీ చెప్పడం లేదు కానీ, ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాత్రం పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ‘ సీపీఎంకు రాజీనామా చేస్తున్నానని పార్టీ ఆఫీసుకు లేఖ పంపాను. ఫోన్లో కూడా సమాచారం ఇచ్చాను. కారణాలు ఏమీ లేవు. సామాజిక తెలంగాణ కోసం, నవ తెలంగాణ నిర్మాణం కోసం పనిచేసే ఉద్యమకారులు ఎక్కడి నుంచి పోటీ చేసినా వారి తరపున పనిచేసి వారి గెలుపు కోసం కృషి చేస్తా..’ అని నోముల నర్సింహయ్య ‘సాక్షి’కి వివరించారు. జిల్లాలో సీపీఎం తరపున పోటీ చేసే అవకాశం రాకపోవడం వల్లే రాజీనామా చేశారా? అని ప్రశ్నించగా, ‘నాకు టికెట్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి..’ అని మాత్రమే స్పందించారు. టీఆర్ఎస్ వైపు ... నోముల చూపు ? ఈ తాజా పరిణామాన్ని విశ్లేషిస్తున్న వారు మాత్రం నోముల తెలం‘గానం’ వెనుక కారణం వేరే ఉందని అంచనావేస్తున్నారు. ఆయన టీఆర్ఎస్ తరపున నాగార్జునసాగర్, లేదా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాలో భువనగిరి, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాలకు టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. నాగార్జునసాగర్‌కు ఆ పార్టీకి అభ్యర్థే లేరు. దీంతో ఈ ప్రచారం నిజమని నమ్మడానికి ఊతం లభిస్తోంది. కాగా, నోముల మంగళవారం తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.