ముగిసిన 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానం | Nomula Narsaiah Passed Away Special Story In Nalgonda | Sakshi
Sakshi News home page

ముగిసిన 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానం

Published Wed, Dec 2 2020 9:28 AM | Last Updated on Wed, Dec 2 2020 9:58 AM

Nomula Narsaiah Passed Away Special Story In Nalgonda - Sakshi

నోముల నర్సింహయ్య.. ఉమ్మడి జిల్లా వాసులకు పరిచయం అక్కర లేని పేరు. న్యాయవాదిగా.. ఎమ్మెల్యేగా, ఓ పార్టీ అసెంబ్లీ ఫ్లోర్‌ లీడర్‌గా ఆయన అందించిన సేవలు మరువలేనివి. వివిధ అంశాలపై మంచి వాగ్ధాటి కలిగిన నేతగా గుర్తింపు. విద్యార్థి దశ నుంచే రాజకీయ అరంగేట్రం చేసిన నర్సింహయ్య ఎంపీపీగా, ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన కొంత కాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీంతో ఉమ్మడి జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాను తుదిశ్వాస విడిచే వరకు ప్రజాసేవకే అంకితమవుతానని ఎప్పుడూ చెప్పే నోముల.. అన్నట్లుగానే ప్రజా జీవితంలోనే ఉంటూ ప్రాణం విడిచారు. 64 ఏళ్ల జీవన ప్రయాణంలో 35ఏళ్లపాటు రాజకీయంలో ఉన్నారు. 

సాక్షి, హలియా (నాగార్జునసాగర్‌): ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇక లేరంటూ నియోజకవర్గ ప్రజలు కంటతడి పెట్టారు. నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మంగళవారం తెల్లవారు జామున గుండె పోటుతో మరణించాడన్న వార్త తెలియడంతో  నియోజక వర్గంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతదేహాన్ని  నియోజకవర్గ కేంద్రమైన హాలియాకి తరలించారు.

సొంతింటి వద్ద ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.  ఎమ్మెల్యే నర్సింహయ్య ఇకలేరని తెలియడంతో కడసారి చూపుకోసం నాయకులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు ఆయన ఇంటి వద్దకు చేరుకొని   అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు.  నర్సింహయ్య భౌతి కకాయాన్ని సందర్శించుకునేందుకు నియోజకవర్గం నుంచే కాక జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు. 9:10 నిమి షాలకు నోముల పార్థివదేహాన్ని కామినేని ఆస్పత్రికి తరలించారు.

కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (ఫైల్‌)
పలువురి ఘన నివాళి..
విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇరిగి సునిల్‌కుమార్, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్యయాదవ్, జెడ్పీ బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఎస్పీ రంగనాథ్, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా అద్యక్షుడు శ్రీనివాస్, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్, డీఈఓ భిక్షపతి, జిల్లా మత్స్యశాఖ అధికారి సుచరిత, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, ఇస్లావత్‌ రాంచందర్‌ నాయక్, కుందూరు రఘువీర్‌రెడ్డి, జయవీర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, యడవెల్లి మహేందర్‌రెడ్డి, హాలియా, నందికొండ మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు వెంపటి పార్వతమ్మశంకరయ్య, కర్ణా అనూషరెడ్డి తదితరులు ఘనంగా నివాళులరి్పంచారు.

నాటి సీఎం వైఎస్సార్‌తో నర్సింహయ్య (ఫైల్‌), టీఆర్‌ఎస్‌లో చేరాక సీఎం కేసీఆర్‌తో (ఫైల్‌)
విద్యార్థి దశ నుంచే..

  • ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేసిన నోముల నర్సింహయ్య నల్లగొండ, నకిరేకల్‌ కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. 
  • దివంగత సీపీఎం సీనియర్‌ నేత నర్ర రాఘవరెడ్డి ప్రోత్సాహంతో 1985లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన 1987 నుంచి 1999 వరకు 12 ఏళ్ల పాటు నకిరేకల్‌ ఎంపీపీగా పనిచేశారు. 
  • 1999, 2004లో నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ పార్టీ శాసన సభా పక్ష నేతగా పనిచేశారు. 
  • 2009లో రిజర్వేషన్‌ మారడంతో అప్పుడే ఏర్పడిన భువనగిరి లోక్‌ సభ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 
  • 2014 ఎన్నికల సమయంలో సీపీఎం నుంచి హుజూర్‌నగర్‌ సీటు కోసం ప్రయత్నించిన ఆయన టికెట్‌ రాకపోవడంతో టీఆర్‌ఎస్‌లో చేరారు. 
  • ఆ పార్టీ నుంచి టికెట్‌ సాధించి 2014లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 
  • 2018 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి జానారెడ్డిపై విజయం సాధించారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
     

పదేళ్ల పాటు సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌గా..
1999 నుంచి 2009 వరకు పదిఏళ్ల పాటు శాసనసభా పక్ష నేత సేవలందించి అసెంబ్లీలో బలమైన వాగ్ధాటిగా ముద్ర వేసుకున్నారు. ప్రధానంగా సీఎం చంద్రబాబునాయుడు హయాంలో విద్యుత్‌ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా అధికార పక్షాలను అసెంబ్లీ సాక్షిగా కడిగిపారేయడంలో ఆయనకు ఆయనే సాటి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయంటే చాలు అటు అధికార, ప్రతిపక్షాలు సైతం వాణిని వినేందుకు ఆత్రుతగా ఎదురుచూసేవారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయాల్లో ఇద్దరు సీఎంలు చంద్రబాబు, వైఎస్సార్‌తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. 2009 నుంచి 2014 వరకు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు.

సాగర్‌లో నోముల రాజకీయ ప్రస్థానం..
2014లో సీపీఎం పార్టీ నుంచి టికెట్‌ రాకపోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన నోముల నర్సింహయ్య నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో మాజీ సీఎలీ్పనేత కుందూరు జానారెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచే నోముల నర్సింహయ్య హాలియాలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని ఒక పక్క టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేయడంతో పాటు మరో పక్క పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఏ ఆపద వచ్చిన వారి వెన్నంటే నేను ఉన్నానంటూ భరోసా కల్పించారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మరో సారి పోటీ చేసిన నోముల నర్సింహయ్య కుందూరు జానారెడ్డిపై 8వేలపైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. 

‘సాగర్‌’నియోజకవర్గ అభివృద్ధిలో సాటిలేని నోముల..
నాగార్జున సాగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నోముల నర్సింహయ్య నియోజకవర్గ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపారు. నందికొండ, హాలియా మున్సిపాలిటీల ఏర్పాటు చేసిన ఘనత నోముల నర్సింహయ్యదే. నియోజకవర్గంలో పలు మండలాల్లో వాగులపై చెక్‌ డ్యాంలు నిర్మించి భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషి చేశారు.నియోజకవర్గంలోని మారు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైయినేజీ కాల్వల నిర్మాణాలతో పాటు అనేక అభివృద్ధి పనులు చేయించారు.

ఎవుసం మరువని నేత
నోముల నర్సింహయ్య మూడు దఫాలుగా ఎమ్మెల్యే పనిచేసినప్పటికీ వ్యవసాయ పనులను మరువలేదు. తన స్వగ్రామమైన నకిరేకల్‌ మండలం పాలెం గ్రామం శివారులో 50ఎకరాల వ్యవసాయక్షేత్రం ఉంది. నకిరేకల్‌కు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయాల్లో రాజకీయాల్లో ఎంత బిజీబిజీగా ఉన్న ప్రతి రోజు తెల్లవారుజామునే తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఉండని రోజు లేదు అనిచెప్పవచ్చు. ఆయనతో పాటు భార్య లక్ష్మి కూడా వ్యవసాయంలో నిమగ్నమైపోతారు. 

అభివృద్ధిలో తనదైన ముద్ర
నకిరేకల్‌కు రెండు సార్లు ఎంపీపీగా, రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా, శాసన సభా పక్ష నేతగా పని చేసిన  నర్సింహయ్య నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. హైదారాబాద్‌ నుంచి విజయవాడ రహదారిపై ఎక్కడ లేని తరహాలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఒప్పించి మినీ, ఇండోర్‌ స్టేడియాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. షిరిడీ తరహాలో  సాయి మందిర నిర్మాణంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయా మండలాలు, గ్రామాల్లో కూడా అభివృద్ధిలో తన వంతు కృషి చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి సాన్నిహిత్యంతో నకిరేకల్‌కు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు మంజూరు చేయడంతో సఫలీకృతులు అయ్యారు. అనేక గ్రామాల్లో పాఠశాలల భవనాలు, కమ్యూనిటీ హాల్, రోడ్లు, పత్తి మార్కెట్, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంలో కూడా కీలకపాత్ర పోషించారు.

రేపు పాలెంలో ‘నోముల’ అంత్యక్రియలు
నకిరేకల్‌: సాగర్‌ ఎమ్మెల్యే నోమలు నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం నకిరేకల్‌ మండలం పా లెం గ్రామంలో జరగనున్నాయి. అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌ వచ్చే అవకాశం ఉండటంతో మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్, ఎస్పీ రంగనాథ్‌లు పాలెం గ్రామాన్ని సందర్శించారు. వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించే స్థలాన్ని, నర్సింహయ్య ఇంటిని, హెలీపాడ్‌ స్థలాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు.  వారి వెంట నల్ల గొండ ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి ఉన్నారు.

మొదటి, చివరిసారిగా...
నిడమనూరు (నాగార్జునసాగర్‌): ఎమ్మెల్యేగా నోముల నర్సింహయ్య నియోజకవర్గంలో తన మొదటి, చివరి సారి కార్యక్రమాన్ని నిడమనూరులోనే నిర్వహించారు. మండలంలోని కోటమైసమ్మ గుడి వద్ద అమ్మగారికి పూజ చేసి 2018లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నోముల రాజ్యాంగ దినోత్సవం (నవంబర్‌ 26) సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులరి్పంచారు. తర్వాత తహసీల్దార్‌ కార్యాలయంలో నిడమనూరులో వరద బాధితులకు నష్ట పరిహారం చెక్కులను అందజేశారు. ఆ కార్యక్రమం కాగానే నేరుగా హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఆయన మృతికి మండల నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు. వారిలో ఎంపీపీ జయమ్మ, జెడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, మార్కెట్‌ చైర్మన్‌ కామర్ల జానయ్య, పార్టీ మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement