* అన్ని పార్టీల్లోనూ ఇదే లేటెస్టు ట్రెండ్.. అర్ధరాత్రి దాకా చర్చలు
* వారి కోసం వేచి చూసి మరీ టికెట్లు కేటాయిస్తున్న పార్టీలు
* ఆఖరి క్షణంలో పార్టీ తీర్థం పుచ్చుకుని బీ-ఫారంతో బరిలోకి
* చివరి నిమిషం వరకు పార్టీల జాబితాల్లో ఖాళీలు
* టీఆర్‌ఎస్‌లోకి అత్యధికంగా చేరికలు.. వెనువెంటనే టికెట్లు
* 36 గంటల్లో మూడు పార్టీలు మారిన మైనంపల్లి హన్మంతరావు
సాక్షి, హైదరాబాద్: మునుపెన్నడూ లేని విధంగా.. అన్ని పార్టీలూ జంప్ జిలానీల కోసం నిరీక్షిస్తున్న దృశ్యాలు.. వారి కోసం అభ్యర్థుల జాబితాల్లో ఖాళీలు.. నామినేషన్ల గడువు ముగుస్తున్నా అర్ధరాత్రి దాకా మంతనాలు.. ఏ పార్టీ నాయకుడు ఏ గంటలో ఏ పార్టీ శిబిరంలోకి వెళ్లాడో, ఏ పార్టీ తీర్థం పుచ్చుకుని, ఏ స్థానానికి టికెట్టు పొందాడో అర్థం కాని పరిస్థితి! గత పదీ పదిహేను రోజులుగా అన్ని శిబిరాల్లోనూ ఈ తంతు కొనసాగుతున్నా సోమ, మంగళవారాల్లో ఇది పరాకాష్టకు చేరుకుంది.
ఇలా వచ్చి కండువా కప్పుకోవడం, అలా పార్టీ బీ- ఫామ్ తీసుకుని వెళ్లిపోవడం..! ఈ వరుసలో కొత్త రికార్డులు బద్దలవుతున్నాయి.. ఒక శాసనసభ్యుడైతే 36 గంటల్లో మూడు పార్టీలు మారిపోయాడు. అసెంబ్లీ కోసం ప్రయత్నిస్తే ఏకంగా పార్లమెంటు స్థానమే దక్కింది. మరో నాయకుడి స్థానం పొత్తులో గల్లంతు కావడమే కాదు.. అనుకోకుండా దక్కిన పార్టీ జిల్లా అధ్యక్ష పదవీ గంటలోపే జారిపోయింది! గెలుపు గుర్రమా, కాదా.. అనేదే ప్రాతిపదిక..! రాజకీయ సమీకరణాలు, కులాల వారీ ఓట్ల లెక్కలు, ప్రత్యర్థుల బలాబలాలు.. ఈ అంచనాల్లోనే ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ తలమునకలైపోయాయి! పార్టీ జంప్ చేయ్.. మా పార్టీ తీర్థం పుచ్చుకో.. ఆ వెంటనే టికెట్ అందుకో..! ఇదీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఆఖరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి తమతమ పార్టీల్లో చేరే అభ్యర్థులకు ఇస్తున్న బంపర్ ఆఫర్! ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించగానే.. ఆ నియోజకవర్గాల్లోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకుంటున్నారు.
రాజకీయంగా బలమైన నాయకులు లేని నియోజకవర్గాల్లో అసంతృప్త నాయకులను చేరదీసి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు దీటుగా రంగంలోకి దించే ఎత్తులు వేస్తున్నారు. నిన్నటి వరకు ప్రత్యర్థి పార్టీలో ఉన్నాసరే.. మరుసటి రోజు పార్టీ మారితే చాలు టికెట్ ఖాయమైపోతోంది. తెలంగాణలో ఇలాంటి జంప్ జిలానీల హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా.. అన్ని పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చివరి నిమిషంలో చేరికలు అధికంగా ఉన్నాయి. మంగళవారం అంతటా టీఆర్‌ఎస్ శిబిరంలో ఇదే సందడి నెలకొంది. అలా చేరిన వారందరికీ టికెట్లు కేటాయించడం గమనార్హం. సోమ, మంగళవారాల్లోని పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే...
* సీపీఎం పార్టీకి సోమవారం గుడ్‌బై చెప్పిన నోముల నర్సింహయ్య.. మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరి నాగార్జునసాగర్ టికెట్ పొందారు.
* కాంగ్రెస్ నుంచి వచ్చిన గుర్నాథరెడ్డికి కోడంగల్, టీడీపీ నుంచి వచ్చిన ముఠాగోపాల్‌కు ముషీరాబాద్, కొలను హన్మంతరెడ్డికి కుత్బుల్లాపూర్, టీడీపీ నుంచే వచ్చిన ప్రేమ్‌కుమార్‌ధూత్‌కు గోషామహల్, మనోహర్‌రెడ్డికి మహేశ్వరం, కాంగ్రెస్ నుంచి వచ్చిన రామ్మోహన్‌గౌడ్‌కు కండువా కప్పేసి ఎల్‌బీనగర్ టికెట్లు ఇచ్చేశారు.
* సీపీఐ నుంచి వచ్చిన చంద్రావతికి టీఆర్‌ఎస్ వెంటనే టికెట్ కేటాయించింది.
* కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన వనమా వెంకటేశ్వరరావుకు కొత్తగూడెం స్థానం కేటాయించారు.
* తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు వుంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి వరంగల్ జిల్లాలో ఏ స్థానం లేకపోవడంతో వరంగల్ మేయర్ పదవి ఇస్తావుని ఆశచూపినట్లు సమాచారం.
* కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఫిరోజ్‌ఖాన్‌కు నాంపల్లి, ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహాం టీడీపీలో చేరిన తరువాత అదే నియోజకవర్గం టికెట్‌ను కేటాయించారు.
* టీఆర్‌ఎస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావుకు బోథ్ స్థానం కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు.
* వైఎస్సార్ సీపీ నుంచి వచ్చిన పుట్ట మధుకు టీఆర్‌ఎస్ మంథని టికెట్ కేటాయించింది.
* మెదక్ పార్లమెంటు స్థానం పరిస్థితీ ఇదే. ఈ స్థానంలో వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించారు. సిట్టింగ్ ఎంపీ విజయశాంతిని తప్పించి మెదక్ అసెంబ్లీకి పంపించటం విశేషం.
* ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రఘునందన్‌రావుకు మంగళవారం దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ కేటాయించింది.
* తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వివిధ జేఏసీ నేతలకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు టికెట్లు పంపిణీ చేశాయి. టీఆర్‌ఎస్ ఐదుగురికి, కాంగ్రెస్ ముగ్గురికి టికెట్లు కేటాయించింది. గతంలో వీరు ఏ పార్టీలో లేకపోయినా కొత్తగా వీరికి టికెట్లు ఇచ్చారు. టీఆర్‌ఎస్ నుంచి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, శ్రీనివాస్‌గౌడ్, సహోదర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, పిడమర్తి రవిలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, గజ్జెల కాంతం, కత్తి వెంక టస్వామి ఉన్నారు.
* గత 15, 20 రోజుల్లో జరిగిన పార్టీ ఫిరాయింపులనూ లెక్కలోకి తీసుకుంటే అన్ని పార్టీల్లోనూ కలిపి.. ఇలా వేరే పార్టీల్లోకి జంప్ చేయుగానే టికెట్లు దక్కించుకున్న వారి సంఖ్య దాదాపు 35- 40 వరకూ ఉంటుందని అంచనా!
* వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన భట్టి జగపతికి మెదక్ అసెంబ్లీ టికెట్ దక్కింది.
36 గంటల్లో మూడు పార్టీలు
టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు 36 గంటల్లో మూడు పార్టీలు మారి చివరాఖరుకు తెలంగాణ రాష్ట్ర సమితిలో తేలారు. ఆయనకు మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఆదివారం నాడు టీడీపీ - బీజేపీ పొత్తులో భాగంగా మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో టీడీపీకి రాజీనామా చేసి, సోమవారం తెల్లవారే సరికల్లా మైనంపల్లి హనుమంతరావు ఢిల్లీలో వార్‌రూమ్‌లో దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి కాంగ్రెస్‌లో చేరిపోవడం జరిగిపోయింది.
కానీ.. సోమవారం సాయంత్రానికి కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో పేరు కనపడకపోయేసరికి దిమ్మతిరిగిన హన్మంతరావు ఆ వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో మంతనాలు జరిపారు. ఇంకేముంది మంగళవారం సాయంత్రానికి టీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం.. ఆ వెంటనే మల్కాజిగిరి టీఆర్‌ఎస్ లోక్‌సభ టికెట్ ఖాయమైనట్టు తెలిసింది.
జంపింగ్‌లదే జోరు!
Published Wed, Apr 9 2014 1:59 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM
Advertisement