‘నోముల’ టీఆర్‌ఎస్‌కు జంప్
‘నోముల’ టీఆర్‌ఎస్‌కు జంప్
Published Wed, Apr 9 2014 3:04 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నకిరేకల్ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన నోముల నర్సింహయ్య సీపీఎం శాసనసభా పక్షనేతగా కూడా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నర్సింహయ్య పార్టీ మారే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం జరిగింది. తాను సీపీఎంలోనే కొనసాగుతున్నానని, ఆ వార్తలను ఖండించారు. కాగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి హుజూర్‌నగర్ నుంచి టికెట్ ఆశించారు. కానీ, ఆయా డివిజన్ల నేతల మెజారిటీ అభిప్రాయం మేరకు నర్సింహయ్యకు టికెట్ నిరాకరించారు. చివరకు ఆలేరు నుంచైనా పోటీ చేయడానికి నోముల సిద్ధపడినట్లు చెబుతున్నారు. కానీ, స్థానిక నాయకత్వం వైపే సీపీఎం వర్గాలు మొగ్గు చూపాయి.
సోమవారం సాయంత్రం వరకూ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలోనే ఉన్న నోముల తనకిక ఏ స్థానం నుంచి టికెట్ రాదని రూఢీ చేసుకున్నాక, రాత్రికి రాత్రి రాజీనామా లేఖను పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి పంపించారు. ముందు నుంచీ కేసీఆర్‌తో ఉన్న సంబంధాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరానని నర్సింహయ్య చెబుతున్నారు. ఇప్పటి దాకా అభ్యర్థిని ఖరారు చేయని నాగార్జునసాగర్ టికెట్‌ను నర్సింహయ్యకు కేసీఆర్ కట్టబెట్టారు. కాంగ్రెస్ నేత కె.జానారెడ్డిపై మరో సీనియర్ నాయకుడు, అదీ వెనకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థి అయితే కలిసి వస్తుందని టీఆర్‌ఎస్ నాయకత్వం భావించినట్లు చెబుతున్నారు. నిన్నా మొన్నటి దాకా మెడలో ఎర్ర కండువాతో కనిపించిన నర్సిం హయ్య మంగళవారం మాత్రం గులాబీ కండువా వేసుకుని కనిపించారు. ‘నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డితో పోటీ పడేది నేను కాదు. అక్కడి ఓట్లరు..’ అని నోముల మీడియాతో వ్యాఖ్యానించారు.
భువనగిరికి ‘పైళ్ల’ ఖరారు
భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ఇటీవల టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న పైళ్ల శేఖర్‌రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. ఆలేరు నియోజకవర్గంలో పోటీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న పైళ్లకు ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచీ పోటీ చేసే అవకాశం దక్కేలా వీలులేకపోవడంతో భువనగిరికి వలస వచ్చారు. కేసీఆర్ హామీతో పార్టీలో చేరిన ఆయన చివరకు భువనగిరి టికెట్‌ను దక్కించుకున్నారు. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న ఎలిమినేటి కృష్ణారెడ్డి, కొనపురి రాములకు చివరకు నిరాశే మిగిలింది.
Advertisement
Advertisement