మన మినిస్టర్స్.. | our ministers | Sakshi
Sakshi News home page

మన మినిస్టర్స్..

Published Thu, Apr 24 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM

our ministers

ఆదిలాబాద్ : నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, విజయభాస్కరరెడ్డి ప్రభుత్వాల్లో చిలుకూరి రాంచంద్రారెడ్డి మార్కెటింగ్, చిన్న నీటి పారుదల శాఖల మంత్రిగా పనిచేశారు. రాంచంద్రారెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పడాల భూమన్న కూడా చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు.

 నిర్మల్ : జిల్లా రాజకీయ కేంద్రంగా నిర్మల్‌కు పేరుంది. ఇక్కడి నాయకులు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిం చారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పదవులు చేపట్టారు. పి.నర్సారెడ్డి 1964లో పీసీసీ చీఫ్‌గా వ్యవహరించడమే కాకుండా రెండుసార్లు మంత్రి పదవులను సైతం చేపట్టారు. నర్సారెడ్డి రాష్ట్ర భారీ నీటి పారుదల, రెవె న్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. 1985, 1989, 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సముద్రాల వేణుగోపాలాచారి మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు.

ఈ కాలంలో ఆయన సమాచార శాఖ, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో, 1998లో జరిగిన మధ్యంతర, 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎంపీగా గెలుపొంది మరోసారి హ్యాట్రిక్ సాధించా రు. ఈ మూడు పర్యాయాలు రెండు సార్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ, కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1983 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన  అయిండ్ల భీంరెడి ్డకి తెలుగుదేశం అధికారంలోకి రావడంతో డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది.

 మంచిర్యాల : లక్సెట్టిపేట నియోజకవర్గంలో భాగంగా ఉన్న మంచిర్యాల 2009లో పునర్విభజన అనంతరం మంచిర్యాల నియోజకవర్గంగా మారింది. 1967, 1972 ఎన్నికల్లో జేవీ నర్సింగారావ్ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. జీవీ సుధాకర్ రావు 1985-1989 మధ్యకాలంలో స్వతంత్రంగా, 1989లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జీవీ సుధాకర్‌రావ్ రాష్ట్రంలో నీటి పారుదల శాఖ, రవాణా, చక్కెర శాఖ మంత్రి పదవులను పొందారు.

 చెన్నూర్ : 1967లో నియోజకవర్గం నుంచి గెలుపొందిన కోదాటి రాజమల్లు ఆర్యోగ శాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో టీడీపీ నుంచి గెలుపొందిన బోడ జనార్దన్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అదే కార్మిక శాఖను 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన గడ్డం వినోద్ చేపట్టారు.

 ముథోల్ : నియోజకవర్గానికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత గడ్డెన్నది. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం పొందిన గడ్డెన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కోట్ల విజయ భాస్కరరెడ్డి మంత్రి వర్గంలో పని చేశారు.

 బోథ్ : లంబాడా వర్గం తొలి ఎమ్మెల్యే అమర్‌సింగ్ తిలావత్. 1978 నుంచి 1983 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. రాష్ట్రంలో పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. టీడీపీ తరఫున గేడాం రామారావు 1985లో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు నగేష్ కూడా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, జీసీసీ చైర్మన్‌గా వ్యవహరించారు.

 ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ నుంచి రెండో ఎమ్మెల్యేగా పనిచేసిన కొట్నాక భీంరావు రాష్ట్రంలోనే తొలి గిరిజన శాఖ మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉంది. నిజాం సర్కార్‌తో పోరాడిన స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యే కావడం గర్వకారణం.

 సిర్పూర్ :  కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన కేవీ కేశవులు 1972, 78 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978లో చేనేత మంత్రిగా పనిచేశారు. 1983, 85లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన కేవీ నారాయణరావు 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా వ్యవహరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement