సైబరాబాద్ : ఎన్నికల కోడ్ సందర్భంగా తుపాకులను వెంటనే సరెండర్ చేయాలన్న పోలీసుల ఆదేశాలను ప్రముఖులు బేఖాతరు చేశారు. గడువు ముగిసినా ఇంకా చాలామంది తుపాకులను వారి వద్దే ఉంచుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీసులు 102 మందికి బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ వై.గంగాధర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. నోటీసులు అందుకున్న మూడు రోజుల్లో తుపాకులను అప్పజెప్పాలని... లేకుంటే వాటి లెసైన్సులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.
462 మందికి మినహాయింపు
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 2099 మందికి తుపాకీ లైసన్స్ ఉన్నాయని జాయింట్ సీపీ చెప్పారు. వీరిలో 1535 మంది సరెండర్ చేయగా... 462 మందికి మినహాయింపు ఇచ్చామన్నారు. మినహాయింపు ఇచ్చిన వారిలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్స్, రైఫిల్ షూటింగ్ క్రీడాకారులు ఉన్నారన్నారు. ఇంకా 102 మంది తుపాకులు అప్పజెప్పలేదన్నారు.
మినహాయింపునివ్వండి...
తుపాకులను సరెండర్ చేయకుండా తమవద్దే ఉంచుకొనేందుకు అనుమతినివ్వాలని ఆరుగురు వ్యాపారులు సైబరాబాద్ పోలీసులకు విజ్ఞప్తి చేసుకున్నారు. తమకున్న ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని ఈ మినహాయింపు ఇవ్వాలని కోరినట్టు జాయింట్ సీపీ తెలిపారు. వీరి విన్నపాన్ని పరిశీలించి... ఎలక్షన్ కమిషన్‌కు పంపిస్తామన్నారు. వారు అనుమతిస్తే మినహాయింపు ఉంటుందన్నారు.