
'యూపీఏ విధానాలు ప్రజలకు నచ్చకే ఎన్డీఏకు పట్టం'
లక్నో:గత పదేళ్లలో యూపీఏ చేపట్టిన విధానాలు ప్రజలకు నచ్చకపోవడంతోనే ఎన్డీఏకు పట్టంకట్టారని బీఎస్పీ చీఫ్ మాయావతి అభిప్రాయపడ్డారు. దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీలు కూడా ఘోర ఓటమికి కారణం మాత్రం యూపీఏ అవలంభించిన విధానాలేనని తెలిపారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన మాయావతి తన ఓటమిని అంగీకరిస్తూనే.. తమపార్టీకున్న దళిత ఓటు బ్యాంకు ఏ మాత్రం చెక్కుచెదరలేదన్నారు. కేవలం ఒక్క యూపీఏ వ్యతిరేకత కారణంగానే దేశంలోని ప్రముఖ పార్టీలు ఓటమి చూడాల్సి వచ్చిందన్నారు. యూపీఏకు మద్దతిచ్చిన పార్టీలను ప్రజలు అసహ్యించుకుని మాత్రమే బీజేపీ కూటమికి పట్టంకట్టారన్నారు.
దేశంలోని ప్రజలను గందరగోళానికి గురి చేసి మతతత్వ పార్టీ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. బీజేపీ ప్రభంజనంలో ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్వాది పార్టీ చిత్తయింది. కాషాయ పార్టీ దెబ్బకు మాయావతి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. సీతాపూర్ నియోజకవర్గంలో మాత్రమే బీఎస్పీ అభ్యర్థి కైసర్ జహాన్ తొలి రౌండ్లో ఆధిక్యం కనబరిచారు. తర్వాత ఆమె వెనుకబడిపోయారు. 34 స్థానాల్లో మాత్రమే బీఎస్పీ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ సానుకూల పవనాలు వీయడంతో బీఎస్పీ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది.