నిన్న కారు జోరు.. నేడు కాంగ్రెస్ హుషారు | peddapalli lok sabha constituency Factsheet | Sakshi
Sakshi News home page

నిన్న కారు జోరు.. నేడు కాంగ్రెస్ హుషారు

Published Tue, Apr 1 2014 5:35 PM | Last Updated on Sat, Jul 6 2019 3:56 PM

నిన్న కారు జోరు.. నేడు కాంగ్రెస్ హుషారు - Sakshi

నిన్న కారు జోరు.. నేడు కాంగ్రెస్ హుషారు

కరీంనగర్: జోరు మీదున్న కారుకు.. ఒక్కసారిగా రివర్స్ గేర్ పడింది. నిన్నటివరకు అభ్యర్థులు కరువై తల్లడిల్లిన కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం రాజకీయం ఒక్క రోజులోనే తారుమారైంది. ఎంపీ డాక్టర్ వివేక్ తిరిగి సొంత గూటికి చేరుకోవటంతో ఇక్కడి రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యూయి. నిన్నటివరకు ఈ సీటుకు అభ్యర్థులు కరువవటంతో ఎవరిని బరిలోకి దింపాలో తెలియని అయోమయం కాంగ్రెస్ పార్టీని వెంటాడింది. ఇప్పుడు సీన్ రివర్సయింది. అక్కడ ఎవరికి టికెట్టు ఇవ్వాలో తేల్చుకోలేక టీఆర్‌ఎస్ పేరు పేరునా అభ్యర్థులను గాలించే పరిస్థితి ఎదురైంది.

కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు రెండింటా విస్తరించిన పెద్దపల్లి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు స్థానం. దీని పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు కరీంనగర్ జిల్లాలో, మూడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ విపత్కర పరిస్థితిని చవి చూస్తున్నాయి. 2004 ఎన్నికల సమయంలోతొలిసారిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వివేక్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సీనియుర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ వెంకటస్వామి (కాకా) వారసుడిగా పోటీలో నిలిచి సునాయాసంగానే గెలుపొందారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ గత ఏడాది టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో సిట్టింగ్ సీటు చేజారిపోయినంత పనైంది. ఎంపీ వివేక్ బరిలోకి దిగితే ధీటుగా ఎవరిని పోటీకి దింపాలనేది కాంగ్రెస్ పార్టీ నాయుకులకు తల పట్టుకున్నంత పనైంది. గత ఎన్నికల్లో వివేక్‌కు ప్రత్యర్థిగా టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన గోవూస శ్రీనివాస్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. పెద్దపల్లి నుంచి టికెట్టు ఇవ్వాలని కోరుతూ రాహుల్ దూతగా జిల్లాకు వచ్చిన పార్టీ పరిశీలకులకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గోమాస పేరు పరిశీనలకు వచ్చింది.

మాజీ ఎమ్మెల్యే గతంలో బీజేపీ తరఫున ఎంపీ సీటుకు పోటీచేసిన అనుభవమున్న కాసిపేట లింగయ్య పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరూ గట్టి పోటీనిచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేతలు డైలమాలో పడ్డారు. తెలంగాణ జేఏసీలో క్రియూశీల పాత్ర పోషించిన వుల్లెపల్లి లక్ష్మయ్య, ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతంను పోటీకి దింపేందుకు కాంగ్రెస్ నేతలు తమవంతు ప్రయత్నాలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ధర్మపురి నుంచి రెండుసార్లు పోటీ చేసిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను పెద్దపల్లికి  తీసుకు వెళ్లేందుకు పార్టీ నేతలు పావులు కదిపారు.

గోమాస, కాసిపేట మినహా మిగతా వారంతా పెద్దపల్లిపై విముఖత ప్రదర్శించారు. చివరి ప్రయత్నంగా మాజీ మంత్రి శ్రీధర్‌బాబు డాక్టర్ సుగుణకువూరి అభ్యర్థిత్వాన్ని సిఫారసు చేశారు. గతంలో ఇదే సీటు నుంచి టీడీపీ నుంచి గెలుపొందిన వూజీ ఎంపీ డాక్టర్ సుగుణకుమారి ఇటీవలే దుబాయ్ నుంచి తిరిగివచ్చారు. గతంలో వరుసగా రెండుసార్లు ఆమె వివేక్ తండ్రి వెంకటస్వామిపై గెలుపొందారు. ఈసారి వివేక్‌కు ప్రత్యర్థిగా ఆమెను బరిలోకి దింపాలని యోచించారు. ఒక దశలో ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరగటంతో సుగుణకుమారి కాంగ్రెస్‌లో చేరటమే తరువాయి అన్నట్లు ప్రచారం జరిగింది.

అదే సమయంలో వివేక్‌ను సొంత గూటికి రప్పించేందుకు పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నం ఫలించింది. మూడ్రోజులుగా ఢిల్లీలోనే ఉన్న వివేక్ సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. తాజా పరిణామాలతో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుంది. వివేక్‌తో పాటు ఆయన సోదరుడు వినోద్ సొంత గూటికి చేరటంతో పెద్దపల్లి సెగ్మెంట్‌లో పార్టీకి కలిసి వచ్చే అవకాశముంది. గత ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన వినోద్ ఈసారి కూడా అదే సీటును ఆశిస్తున్నారు. చెన్నూరు పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఉండటంతో వివేక్ బ్రదర్స్ ప్రభావం.. అటు ఎంపీకి, ఇటు ఎమ్మెల్యేకు ఎలా ఉంటుందనేది అందరి దృష్టిని ఆకర్షించనుంది.

మరోవైపు టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచీ ఎంపీ వివేక్‌కు, మంథని ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు మధ్య అంతర్గత విభేదాలున్నాయి. ఇప్పుడు వివేక్ తిరిగి రావటంతో వీరిద్దరూ కలిసి పని చేస్తారా.. లేదా.. ఒకే సెగ్మెంట్‌లో ఉన్న కీలక నేతల మధ్య అంతర్గత పోరు కొత్త చిక్కులకు దారి తీస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు పెద్దపల్లిలో ధీమాగా ఉన్న టీఆర్‌ఎస్ ఒక్కసారిగా డీలా పడింది. అక్కడ పార్టీ తరఫున ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు పోటీ చేసే ఎస్సీ సామాజిక వర్గం నాయకులు లేకపోవటంతో చిక్కులో పడింది. స్థానికేతరులను రంగంలోకి దించటం అనివార్యంగా భావిస్తోంది.

మానకొండూరు నుంచి అసెంబ్లీ టికెట్టు ఆశిస్తున్న తెలంగాణ ధూం ధాం గాయకుడు రసమయి బాలకిషన్‌ను రూటు మళ్లించి పెద్దపల్లి నుంచి లోక్‌సభ బరిలోకి దింపుతారనే ప్రచారం మొదలైంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన గోవూస శ్రీనివాస్‌ను సొంత గూటికి తీసుకొచ్చి.. వురోసారి వివేక్‌కు ప్రత్యర్థిగా పోటీకి దింపే ప్రయత్నాలు ప్రారంభించింది. అదే జరిగితే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినట్లవుతుంది. దీంతో ఇక్కడ మళ్లీ పాత పోటీ పునరావృతమవుతుందా... అనేది అందరి నోటా చర్చనీయాంశంగా మారింది.
 
చిక్కుల్లో అభ్యర్థులు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో వివేక్ సొంత గూడు చేరటంతో గ్రామీణ ప్రాంతాల్లో రెండు పార్టీలకూ షాక్ తగిలింది. వివేక్ బ్రాండ్‌తో టికెట్లు తెచ్చుకొని బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులందరూ త్రిశంకు స్వర్గంలో పడ్డట్లయింది. తమతో పోటీ పడుతున్న కాంగ్రెస్ ప్రత్యర్థులకు ఇప్పుడు వివేక్ అండగా నిలిస్తే తామేం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement