పోలీసుల తనిఖీల్లో భారీమొత్తంలో నగదు స్వాధీనం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమంగా తరలిస్తున్న నగదును ప్రతిరోజూ భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోలనే ఇప్పటి వరకు మూడు కోట్ల రూపాయలకుపైగా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్ల బంగారం, వెండిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఓ వ్యక్తి నుంచి పోలీసులు 7 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో మరో వ్యక్తి నుంచి లక్షా ఆరు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. కారులో తరలిస్తున్న 7లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు బైపాస్ రోడ్డుపై కారులో తరలిస్తున్న రెండు లక్షల 70ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో గత ఆదివారం ఆటోలో తరలిస్తున్న 9 లక్షల 50 వేల రూపాయిలు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హవలి చెక్‌పోస్ట్ వద్ద ఒక వ్యక్తి నుంచి లక్షా 10 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ జిల్లాలోని పరిగి చెక్పోస్ట్ వద్ద గత ఆదివారం కారులో తరలిస్తున్న 9 లక్షల రూపాయిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.