టీ విద్యార్థి జేఏసీ నేతలకు కాంగ్రెస్ టికెట్లు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థి జేఏసీ నాయకులకు కూడా ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోంది. జేఏసీ నేతలకు టికెట్లు ఇస్తామని గతంలోనే ఏఐసీసీ వర్గాలు ప్రకటించాయి. ఎస్సీ నియోజకవర్గాల్లో జేఏసీ నేతలకు టికెట్లు కేటాయించే అంశాన్ని పార్టీ జాతీయ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు పర్యవేక్షిస్తున్నారు. ఇదే సందర్భంలో విద్యార్థి జేఏసీ నేతల పేర్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించినట్టు తెలిసింది. ఇందులో మునుగోడు లేదా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పున్నా కైలాశ్, మహబూబ్‌నగర్ నుంచి కె.విజయ్‌కుమార్, సత్తుపల్లి నుంచి మానవతారాయ్, మిర్యాలగూడ నుంచి మరో విద్యార్థి నేత పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
టీఆర్‌ఎస్‌లో ఆకుల రాజేందర్ చేరిక
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ శుక్రవారం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ నుంచి పోటీ చేయాలని రాజేందర్‌కు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అవమానించినందువల్లే మనస్తాపానికి గురై రాజేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు రాజేందర్‌తో రాజీ యత్నాలు చేసినా వారి ప్రయత్నాలు ఫలించలేదు.
‘మహబూబ్‌నగర్’ అభ్యర్థి నేనే!: విఠల్‌రావు
సాక్షి, న్యూఢిల్లీ: మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం టికెట్ తనకే దక్కుతుందన్న ఆశాభావాన్ని మాజీ ఎంపీ డి.విఠల్‌రావు వ్యక్తం చేశారు. శుక్రవారం ఏఐసీసీ కార్యాలయంలో దిగ్విజయ్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘మహబూబ్‌నగర్ స్థానం నాకే ఇస్తారన్న నమ్మకం ఉంది. గతంలో రాజ్యసభ సీటు ఆశించినప్పుడు సోనియాను కలిశాను. తక్కువ తేడాతో ఓడిపోయినందున ఈ సారి లోక్‌సభకే పోటీచేయాలని ఆమె సూచించారు. అందువల్ల ఈ సారి సీటు ఇస్తారన్న నమ్మకం ఉంది. చేనేత కార్మిక వర్గం నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఏకైక అభ్యర్థిని కాబట్టి వేరేవారికి ఇస్తారనుకోను. అయితే అధిష్టానానికి కట్టుబడి ఉంటా..’ అని పేర్కొన్నారు.
సీమాంధ్ర కాంగ్రెస్ టికెట్లకు గట్టి పోటీ: డొక్కా
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెస్ టికెట్ల కోసం నాయకులు పోటీపడుతున్నారని ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ కోచైర్మన్ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. బస్సుయాత్రతో పార్టీలో నూతనోత్సాహం పెరిగిందన్నారు. శుక్రవారం ఇందిరాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సామాజిక న్యాయం కాంగ్రెస్ వల్లనే సాధ్యమని.. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం తమ పార్టీతోనే వస్తుందన్నారు. గతంలో భూ సంస్కరణల సమయంలో జై ఆంధ్ర ఉద్యమాన్ని రాజేశారని గుర్తుచేశారు. ఇపుడు బీసీ, ఎస్సీలకు రాజ్యాధికారం వస్తుందనే సమయానికి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదం ముసుగేసుకొని ముందుకు వస్తున్నారని విమర్శించారు.
ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలి: గద్దర్
హైదరాబాద్, న్యూస్‌లైన్: ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించాలని ప్రజా గాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం మొఘల్‌పురా ఉర్దూఘర్‌లో ‘తెలంగాణ ఉద్యమంలో ముస్లింల పాత్ర’ అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు. తెలంగాణ కోరుతూ అనేక మంది ముస్లింలు ఉద్యమించి అమరులయ్యారని, వారి త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణలో జనాభా ప్రాతిపదికన సముచిత ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్, ఆలిండియా ముస్లిం సంఘం అధ్యక్షుడు హయాత్ హుస్సేన్ హబీబ్ తదితరులు పాల్గొన్నారు.
‘మంద కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి’
హైదరాబాద్. న్యూస్‌లైన్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని శుక్రవారం ఓయూలో జరిగిన ఓయూ, కేయూ జేఏసీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయుకులు వూట్లాడుతూ.. అణగారిన వర్గాలవారి హక్కుల కోసం ఉద్యమించి, బడుగులలో చైతన్యం కల్గించిన నేత వుంద కృష్ణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన ఆయనను ఉద్యమనేతగా గౌరవించి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు బండారు వీరబాబు, వట్టికూట రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల తరుణంలో పార్టీలవారీగా నేతల అభిప్రాయాలు
Published Sat, Mar 29 2014 4:26 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement