కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. పూర్వ వైభవాన్ని నిలబెట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికం చేజిక్కించుకుని ఆధిక్యాన్ని ప్రద ర్శించింది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక
జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) తొలిసారి సంచలన ఫలితాలు రాబట్టింది.
మండల పరిషత్‌లను కైవసం చేసుకోవడంలో వెనకబడిన గులాబీ దళం జెడ్పీటీసీ స్థానాల విషయంలో మాత్రం ద్వితీయ స్థానంలో నిలిచింది. కాగా, మెజారిటీ మండల పరిషత్‌లలో ఏ పార్టీకి అవసరమైన, స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ ఏర్పడింది.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : స్థానిక సమరంలో విజేతలెవరో తేలిపోయింది. గతంలో మాదిరిగానే, ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం కనబరిచింది. మెజారిటీ మండల పరిషత్‌లను స్పష్టమైన మెజారిటీతో గెలచుకోవడమే కాదు, జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన 30 జెడ్పీటీసీ స్థానాల్లో కడపటి వార్తలు అందేసరికి ఏకంగా 43చోట్ల విజయం సాధించింది. ఆ తర్వాతి స్థానంలో టీఆర్‌ఎస్ నిలిచింది. ఆ పార్టీ 13జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. కాగా, ఈ సారి ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ గల్లంతయ్యింది. జెడ్పీటీసీలకు సంబంధించి ఆ పార్టీ కేవలం రెండు స్థానాలతో తృప్తి పడాల్సి వచ్చింది.
మండల పరిషత్‌లు..
జిల్లాలోని 59 మండలాలకు 835 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికోసం 3311 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. కాగా, కాంగ్రెస్ మెజారిటీ మండల పరిషత్‌లను గెలుచుకుంది. ఫలితాలు వెలువడిన స్థానాల్లో కాంగ్రెస్ 27చోట్ల స్పష్టమైన మెజారిటీ సాధించి, పాలక వర్గాలను ఏర్పాటు చేయనుంది. టీఆర్‌ఎస్ 4, టీడీపీ 2 మండలాల్లో పాలక వర్గాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సాధించాయి. తిరుమలగిరిలో ఇండిపెండెంట్లు అంతా కలిసి మండల పరిషత్‌ను కైవసం చేసుకున్నారు. కాగా, మరో 18 మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక, హంగ్ ఏర్పడింది. వీటిలో సైతం అత్యధిక ఎంపీటీసీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. కాబట్టి ఇతరుల సాయంతో మరికొన్ని మండలాలను కాంగ్రెస్ సొంతం చేసుకునే వీలుంది.
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో... గులాబీ రెపరెపలు
భువనగిరి లోక్‌సభ నియోజవర్గం పరిధిలోని ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ తన ప్రభావం చూపించింది. ఆ పార్టీ గెలచుకున్న జెడ్పీటీసీ స్థానాలు తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనివే కావడం గమనార్హం. అదే మాదిరిగా, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, నాంపల్లి మండలాలు మునుగోడు పరిధిలో ఉన్నాయి. ఇది కాకుండా తిరుమలగిరిలో సైతం టీఆర్‌ఎస్ పాగా వేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న భువనగిరి, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లోనూ కనీసం పోటీ ఇవ్వలేదు. మోతె, మఠంపల్లి మండల పరిషత్‌లను దక్కించుకునేందుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ పొందింది. మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్య విషయంలో మాత్రం కాంగ్రెస్ తర్వాత రెండో స్థానంలో టీడీపీ ఉంది. బీజేపీ అంతంత మాత్రంగానే పోటీ ఇచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనూ ఖాతా తెరిచి కొన్ని ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. మొత్తానికి స్థానిక సమరంలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది.
‘హస్త’గతం
Published Wed, May 14 2014 2:35 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement