ఇంతకీ ఆయన ఏ పార్టీ!
ఏలూరు : ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి పట్టుమని నాలుగు నెలలు కూడా కాలేదు. మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.... నిన్నటి వరకూ బీజేపీలో ఉన్న ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి. పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామ కృష్ణంరాజు గురువారం నరసాపురం ఎంపీ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకటి తెలుగు దేశం తరపున, రెండోది బీజేపీ తరపున వేశారు.
పొత్తుల వ్యూహాల్లో భాగంగా ఆయన ఇలా రెండు పార్టీల తరపున నామినేషన్లు వేసినా ఇంతకీ ఆయన ఏ పార్టీలో ఉన్నారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీకి రాజీనామా చేయలేదు... అలాగని తెలుగుదేశం పార్టీలోనూ చేరలేదు. అయినా రెండు పార్టీల తరపున ఎలా నామినేషన్ వేశారోనని ఆయన అనుచరులే అయోమయంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నదీ ఆయనకే తెలియదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న రఘురామ కృష్ణంరాజు చివరకు సీటు కూడా దక్కించుకోలేకపోయారు. ఏపార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని స్థితికి చేరుకున్నారని ఆయన పక్కనున్న వారే చెవులు కొరుక్కుంటున్నారు.