గృహాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు... పేదలకు కలర్‌టీవీలు... ఇంటీర్మీడియెట్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు... ఆడపిల్లలకు పుట్టిన వెంటనే వందగజాల ఇంటిస్థలం...
ఇదీ ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో
సాక్షి, హైదరాబాద్: గృహాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు... పేదలకు కలర్‌టీవీలు... ఇంటీర్మీడియెట్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు... ఆడపిల్లలకు పుట్టిన వెంటనే వందగజాల ఇంటిస్థలం... ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంపు... శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివి. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ పీసీసీ రూపొందించిన మేనిఫెస్టోను కేంద్రమంత్రి జైరాం రమేష్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవిష్కరించారు.
కేంద్రమంత్రి చిరంజీవి, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఆనం రామనారాయణరెడ్డి, ఏఐసీసీ ఎస్సీసెల్ ఛైర్మన్ కొప్పుల రాజు, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్, శైలజానాధ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను రఘువీరా వివరిస్తూ రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్‌గా మార్చడానికి దశసూత్ర ప్రణాళికలను రచించినట్లు చెప్పారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు నిరాటంకంగా విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. విత్తన వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకు సమగ్ర విత్తన చట్టం తేస్తామని పేర్కొన్నారు.