ప్రైవేటీకరణపై బాబు విచారణకు సిద్ధపడాలి
వైఎస్సార్ సీపీ డిమాండ్
ప్రభుత్వరంగ సంస్థలను చంద్రబాబు సొంతవారికి పప్పుబెల్లాల్లా కట్టబెట్టారు
ఈ విషయాన్ని ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి పరేఖ్ తన పుస్తకంలో వెల్లడించా్టరు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వరంగ సంస్థలను ఆయనకు సంబంధించిన వారికి పప్పు బెల్లాల్లా కట్టబెట్టిన వ్యవహారాలపై విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశం మొత్తంమీద వందకు పైగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే, చంద్రబాబు పాలనలో ఒక్క మన రాష్ట్రంలోనే 54 సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి పి.సి.పరేఖ్ రాసిన ‘యుద్ధ సైనికుడా.. కుట్రదారా..? (క్రుసేడర్ ఆర్ కాన్‌స్పిరేటర్?)’ అనే పుస్తకంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యవహారాలను వెల్లడించారని తెలిపారు. వాటిని సొంత వారికి కట్టబెట్టడానికి బాబు ఎలా కుట్రలు చేసిందీ, ఆయన ప్రయత్నాలను అడ్డుకోవడానికి తానెలా విఫలయత్నం చేసిందీ కూడా వివరించారన్నారు.
పంచబ్యాంకు షరతులకు పాదాక్రాంతుడైన చంద్రబాబు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి, అదేదో ఆయన విజయగాథలా చెప్పుకున్న వైనాన్ని గుర్తుచేశారన్నారు. చంద్రబాబు చేపట్టిన ప్రైవేటీకరణ వల్ల 26,000 మంది ఉద్యోగాలు కోల్పోతే, దాన్ని ఘనతగా చెప్పుకొన్నారని, అదే బాబు.. ఆయన తొమ్మిదేళ్ల పరిపాలనను ప్రజారంజకమైనదని ఏ ముఖం పెట్టుకుని చెప్పగలరని దుయ్యబట్టారు. బాబు హయాంలో ప్రైవేటీకరించిన సంస్థల జాబితాను ఆమె విలేకరుల సమావేశంలో చూపిస్తూ కొన్నింటిని చదివి వినిపించారు. నిజాం షుగర్స్, చాగల్లు డిస్టిలరీస్, మెట్‌పల్లి షుగర్ ఫ్యాక్టరీ, ఏపీ షుగర్స్ లిమిటెడ్, ఆల్విన్ ఫ్యాక్టరీ, నెల్లూరు సహకార స్పిన్నింగ్ మిల్లు, ఏపీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కరీంనగర్ సహకార స్పిన్నింగ్ మిల్లు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని అన్నారు. చక్కెర తయారీ రంగంలో ఏమాత్రం అనుభవం లేని టీడీపీ నేత నామా నాగేశ్వరరావుకు పాలేరు షుగర్ ఫ్యాక్టరీని, సీఎం రమేష్‌కు నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును, విశాఖపట్టణం మూర్తికి మరో సంస్థ.. ఇలా ఇచ్చుకుంటూ పోయారని చెప్పారు. చంద్రబాబు చేసిన ఈ నిర్వాకంపై వివరణ ఇచ్చే దమ్మూ, ధైర్యం ఆయన పార్టీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా దక్కించుకున్న వైనంపై టీడీపీ నేతలు విచారణకు సిద్ధపడాలని సవాలు విసిరారు.
జగన్‌పై దుమ్మెత్తి పోస్తేనే ఈనాడుకు వార్తా...!
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గ్రాఫ్ (ప్రతిష్ట) ప్రజల్లో బాగా తగ్గిపోయిందంటూ విశాఖ ఎంపీ సబ్బం హరి ఇచ్చిన ఇంటర్వ్యూను ఈనాడు పత్రిక ప్రముఖంగా ప్రచురించడాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దానిని ప్రముఖంగా ప్రచురించడాన్ని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో సంక్షేమం బాగా జరిగిందని రాసుకునే చేవ ఈనాడుకు లేదని అన్నారు. చంద్రబాబు గ్రాఫ్ ప్రజల్లో పెరుగుతోందని రాసుకోలేక, జగన్‌పై ఎవరు మాట్లాడినా రాస్తోందన్నారు. చెప్పేవాడికి బుద్ధి లేకపోతే రాసేవాడికి అసలే బుద్ధి లేని విధంగా ఉందని విమర్శించారు. సమైక్యాంధ్ర పార్టీ నాయకుడైన సబ్బం హరి ఆయన పార్టీ గురించి, విభజన గురించి మాట్లాడకుండా జగన్‌పైనే వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్, సబ్బం హరిలాంటి వారు ఇతర అంశాలపై మాట్లాడిన మాటలు ఈనాడు ప్రచురించదని, కేవలం జగన్‌ను తిడితేనే ప్రముఖంగా ప్రచురిస్తారని అంటూ ఆమె పలు ఉదాహరణలు చెప్పారు.