సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో మరో అసమ్మతి రేగింది. గూడూరు స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాదరావుకు నిరాకరించి కొత్త అభ్యర్థి డాక్టర్ జ్యోత్స్నకు ఇవ్వడంపై బల్లి గుర్రుమన్నారు. ఆరునూరైనా శనివారం నామినేషన్ వేసి తీరుతానని ఆయన ప్రకటించారు. సూళ్లూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే పరసా రత్నం కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఎదుర్కునే వరకు వెళ్లి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకుని ఊపిరి పీల్చుకున్నారు.
టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరసా రత్నం, బల్లి దుర్గాప్రసాదరావుకు ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం అనుమానమేనని గత ఆర్నెల్లుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇందుకు తగినట్లుగానే నాలుగు జాబితాల్లో వీరిద్దరికీ చోటు దక్కలేదు. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల నిర్వహణ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న కాంట్రాక్టర్ గంగాప్రసాద్ సైతం ఈ ఎన్నికల్లో వీరిద్దరికీ చెక్ పెట్టాలని గట్టిగా పట్టుబట్టి కొత్త అభ్యర్థులను తెర మీదకు తెచ్చారు. తొలి జాబితా ప్రకటనలోనే సిట్టింగ్‌లైన తమకు చోటు ఉంటుందని ఇద్దరు నాయకులు ఆశించారు. అయితే నాలుగు జాబితాల్లో ఆ ఊసే కనిపించలేదు. ఇద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాపకం సంపాదించడానికి శతవిధాల ప్రయత్నించారు.
సూళ్లూరుపేట నుంచి మాజీ ఎంపీ నెలవలసుబ్రమణ్యంను బరిలోకి తేవడానికి గంగాప్రసాద్ తీవ్రంగానే ప్రయత్నించారు. ఒక దశలో టికెట్ ఆయనకే ఖరారవుతుందనే వాతావరణం కనిపించింది. అయితే పరసారత్నం అనేక రకాలుగా చంద్రబాబును ఒప్పించగలగడంతో చివరకు కాస్త అయిష్టంగానే పరసాకు ఆయన టికెట్ ఇచ్చారు. శుక్రవారం ప్రకటించిన చివరి జాబితాలో ఆయన పేరు ప్రకటించారు. ఇదే కోవలో ఎదురు చూసిన గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. ఇక్కడి నుంచి కాంట్రాక్టర్ గంగాప్రసాద్ బలపరచిన డాక్టర్ జ్యోత్స్నకు టికెట్ దక్కింది.
శుక్రవారం నాటి జాబితాలో ఈమె పేరు ప్రకటించి బీ ఫారం కూడా అందజేశారు. ఈ పరిణామం బల్లికి ఊహించిందే అయినా సాయంత్రం దాకా తేరుకోలేకపోయారు. తనకు టికెట్ ఇస్తే ఓడిపోతానని చంద్రబాబుకు కొందరు పంపిన నివేదికలే తనకీ పరిస్థితి తెచ్చాయని ఆయన తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 7 గంటల సమయంలో నియోజకవర్గంలోని తన మద్దతుదారులు, ముఖ్య నేతలతో దుర్గాప్రసాద్ సమావేశమయ్యారు. కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదని ఆయన తేల్చి పారేశారు.
శనివారం టీడీపీ అభ్యర్థిగానే తాను నామినేషన్ దాఖలు చేస్తాననీ, అధిష్టానం మనసు మారి టికెట్ ఇస్తే సరేననీ, లేకపోతే తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉంటానని దుర్గాప్రసాద్ కుండబద్ధలు కొట్టారు. ఈ పరిణామంతో గూడూరు టీడీపీలో తీవ్ర అసంతృప్తి, అసమ్మతి సెగలు ఎగసి పడ్డాయి. దుర్గాప్రసాద్‌ను శాం తింపజేయడానికి చంద్రబాబు తన కోటరీలోని ఇద్దరు ముఖ్యులను రంగంలోకి దించారు. శనివారం నాటికి లేదా నామినేషన్ల ఉపసంహరణ సమయానికి దుర్గాప్రసాద్ బరి నుంచి తప్పుకుంటారనే ధీమా చంద్రబాబు కోటరీ వ్యక్తం చేస్తోంది.
టీడీపీలో రె‘బెల్స్’
Published Sat, Apr 19 2014 2:33 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement