వెస్ట్ గోదావరి టీడీపికి 'వేస్ట్' గోదావరిగా మారుతుందా?
వెస్ట్ గోదావరి టీడీపీకి వేస్ట్ గోదావరిగా మారనుందా? ఒక వైపు ఫ్యాను గాలితో ఇప్పటికే సతమతమౌతున్న టీడీపీకి ఇప్పుడు పార్టీ రెబెల్స్ పక్కలో బల్లాలుగా మారారు. అయిదు నియోజకవర్గాల్లో రెబెల్స్ పార్టీకి డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు.సీట్ల కేటాయింపు తీసుకొచ్చిన తంటాతో ఆ పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా పోయింది.
కొవ్వూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావు, నర్సాపురం నుంచి మత్స్యకార నేత మైలా వీర్రాజు, పాలకొల్లులో డాక్టర్ బాబ్జీ, పోలవరంలో చింతా నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ లు పార్టీని ధిక్కరించి, అధికారిక కాండిడేట్ల దుప్పట్లో కుంపట్లై కూర్చున్నారు. ఇక చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే పీతల సుజాతకు టికెట్ ఇవ్వడం పట్ల స్థానికంగా క్యాడర్లో అసంతృప్తి ఉంది.
వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన చెరుకువాడ రంగనాధరాజుకు ఉండి, కొయ్యే మోషేన్ రాజుకు చింతలపూడి, నవుడు వెంకటరమణకు ఉంగుటూరు స్ధానాలిస్తామని హామినిచ్చిన చంద్రబాబు వారెవరికీ టిక్కెట్ ఇవ్వలేదు. వీరంతా ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలంలా ఉన్నారు. చంద్రబాబు టికెట్లిచ్చిన వారిని ఓడించి తీరతామని అంటున్నారు.
అటు రెబెల్స్, ఇటు అసంతృప్తుల నడుమ ఎన్నికల్లో పార్టీ నష్టపోవడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఎన్నో ఆశలతో వ్యూహాల మీద వ్యూహాలు రచించిన చంద్రబాబుకు ఇప్పుడు వెస్ట్ గోదావరి పెద్ద తలనొప్పిగా మారింది.