బాన్సువాడ, న్యూస్‌లైన్ : ఎన్నికల నియమావళిని అధికారులు కట్టుదిట్టంగా అమలు చేస్తుండడంతో ప్రచార సరళిలో అభ్యర్థుల దూకుడు తగ్గింది. మున్సిప ల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్నప్పటికీ ఎన్నికల కోడ్ దడ పుట్టిస్తుండడంతో నాయకులు ఆర్భాటాల జోలికి వెళ్లడం లేదు. ఈసారి ఎన్నికల్లో ఫ్లెక్సీలు, కరపత్రాలు కనిపించడం లేదు. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా మందకొడిగా ప్రచారం సాగుతోంది.
సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ప్ర కటనలు లేకుండా అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికే పరిమితం అవుతున్నారు.ఎన్నిక లు వచ్చాయంటే నెలరోజుల ముందు నుంచే కరపత్రాలు, వాల్ పెయింటింగ్స్, స్టిక్కర్లు, లౌడ్ స్పీకర్లు తదితర ప్రచార సాధనాలతో సందడిగా కనిపించేది. దీంతో చిరు వ్యాపారులకు ఎంతో లబ్ధి చేకూరేది. కానీ ప్రస్తుతం వారికి కనీసం ఉపాధి కరువైంది. సాధారణ ఎన్నికల షెడ్యూ ల్ విడుదల కాకముందే, దసరా, దీపావళి, బక్రీద్, క్రిస్మస్ తదితర పండుగల శుభాకాంక్ష లు తెలుపుతూ ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు పోటీచేసే ఆశావాహులు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు.
అయితే ఎన్నికల కోడ్ రావడంతో జిల్లాలో అక్కడక్కడ గోడలకు వేసిన ఫ్లెక్సీలను ఇప్పటికే అధికారులు తొలగించారు. ప్రస్తుతం వీటిని అంటించే వారికి సైతం నోటీసులు జారీచేస్తున్నారు. ఎన్నికలొస్తున్నాయంటే పట్టణాలు, పల్లెలు బ్యానర్లతో నిండిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కని పించడం లేదు. బ్యానర్లు కట్టడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం అవుతుంది. దీంతో ఎక్కడా పార్టీల నాయకుల ప్రచార బ్యానర్లను ఏర్పాటు చేయడం లేదు.
లౌడ్ స్పీకర్లకూ అనుమతి...
అలాగే లౌడ్ స్పీకర్లకు అనుమతి తీసుకొని నిబంధనలకు లోబడి ప్రచారం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయనే ఈసీ హెచ్చరికలతో వీటిని వినియోగించేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో మైక్‌సెట్ షాపుల వారికి గిరాకీ లేక ఉసూరుమంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు తమతో పాటు పది మందిని మాత్రమే వెంట తీసుకొని తిరగాల్సి ఉంటుం ది. గుంపులుగా ప్రదర్శనగా వెళ్లరాదని నిబంధన అమలులో ఉండడంతో భారీ ప్రదర్శనలకు అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారు. కేవలం కొద్దిమందితోనే ప్రచారం చేసుకుంటున్నారు.
చిన్న పత్రికలపై ప్రభావం...
ఎన్నికల్లో ప్రకటనల ద్వారా తమ పత్రికకు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని భావించిన పత్రికలపైనా కోడ్ ప్రభావం పడింది. ప్రస్తుతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకట నలు వేయించుకోవడం కష్టమైంది. మీడియా లో ప్రకటనలు జారీ చేయాలనుకుంటే అభ్యర్థు లు ముందుగా జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి నిర్ణీత ఫార్మాట్‌లో ప్రకటన ధర, సమయం, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పబ్లిష్ చేయించుకుంటారో వివరాలు తెలియజేస్తూ దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాల్సి ఉంది.అనుమతి లేకుండా ప్రకటనలు జారీ అయితే ఈసీ చర్యలు తప్పవు. ఇంతటి ప్రయా స ఎందుకని చాలామంది అభ్యర్థులు ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు.
అనర్హత వేటు భయం...
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నిర్ణీత వ్యయం కంటే అధికంగా ఖర్చుచేస్తే అనర్హత వేటుపడే అవకాశం ఉండడంతో ఆచితూచి ఖర్చు పెడుతున్నారు.జీరో బ్యాంకు ఖాతా ద్వారానే లావాదేవీలు సాగించాలనే నిబంధన ఉంది. దీంతో ఎక్కువగా వ్యయం కింద జమ కాకుండా గోప్యంగా ఖర్చుచేస్తున్నారు. ఈసీ నిబంధనలే కాదు అభ్యర్థులకు వేసవి ప్రతాపం అడ్డంకిగా మారింది. వారం రోజులుగా ఎండలు అధికం కావడంతో ఉదయం పది గంటల్లోపే అభ్యర్థు లు ప్రచారాన్ని ముగిస్తున్నారు. తిరిగి సాయంత్రం ప్రచారం చేసుకుంటున్నారు.
ముందస్తు ప్రచారంతో ఊరట
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న పలువురు అభ్యర్థులు షెడ్యూల్ విడుదల కాకముందే ఫ్లెక్సీలతో జోరుగా ప్రచారం చేసుకుననారు. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ఫ్లెక్సీలను వాడుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థుల హడావిడి ఫ్లెక్సీల ఏర్పాటులో ఎక్కువగా కనిపించింది.ఈ పార్లమెంట్ స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థులు దూకుడుగా వ్యవహరించారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి జిల్లాలోని బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డితో పాటు కామారెడ్డి నియోజకవర్గాలు వస్తాయి. దీంతో ఈ నియోజకవర్గాల్లో ఆశావాహులు పెద్ద ఎత్తున ఫ్లెక్లీలు ఏర్పాటు చేయిం చారు.
జహీరాబాద్ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించుకున్న మదన్‌మోహన్‌రావు ఒక అడుగు ముందుకు వేసి రెండు నెలల క్రితమే సైకిల్‌యాత్ర పేరిట నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఫ్లెక్సీలు, గోడరాతలతో విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ తరపున బిచ్కుంద మఠానికి చెందిన ఒక మఠాధిపతి, మాజీ కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర కుమారుడు ఆలె జితేంద్ర పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. మద్నూర్‌కు చెందిన ఒక పారిశ్రామికవేత్త టీఆర్‌ఎస్ తరపున పోటీ చేయడానికి సిద్ధమై, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. షెడ్యూల్ రావడంతో వీటన్నింటిని అధికారులు తొలగించారు.
ప్రచారానికి ని‘బంధనాలు’
Published Wed, Mar 26 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement
Advertisement